Skip to main content

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ

1 మార్కు ప్రశ్నలు

  1. భారతదేశంలో ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు?
    జ. భారత ఎన్నికల సంఘం భారతదేశంలో ఎన్నికలను నిర్వహిస్తుంది.
  2. భారత ఎన్నికల సంఘం విధులను వర్గీకరించండి.
    జ.
    భారత ఎన్నికల సంఘం విధులు
    1. పాలనా సంబంధ విధులు
    2. సలహా విధులు
    3. అర్ధన్యాయ సంబంధ విధులు
  3. ఒక రాజకీయ పార్టీ ఎలా ఆవిర్భవిస్తుంది.
    జ.
    నియమావళిని రాసుకొని ఎన్నికల కమీషన్ దగ్గర రిజిస్టర్ చేయిస్తే ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది.
  4. సార్వజనీన ఓటుహక్కు అనగానేమి?
    జ.
    18సం.లు నిండిన జాతి, మత, లింగ, భాషాపరమైన బేధాలు లేకుండా అందరికీ ఓటింగ్ హక్కు కలిగి ఉండడాన్ని సార్వజనీన ఓటుహక్కు అంటారు.
  5. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అని దేన్ని అంటారు?
    జ.
    షెడ్యూలు ప్రకటించిన తేదీ నుండి ఎన్నికలు జరిగే తేదీ వరకు పార్టీలు, అభ్యర్థులు ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటారు.
  6. ఎన్నికలలో జరిగే అనుచిత ప్రవర్తనలను ఏవైనా రెండింటిని పేర్కొనుము.
    జ.
    ఎన్నికలలో జరిగే అనుచినత ప్రవర్తనలు
    1. రాజకీయ ప్రకటనల ద్వారా జాతి, కుల మతపరమైన అభ్యర్థనలు చేయుట.
    2. ఓటర్లకు లంచాలను ఇచ్చి ప్రలోభ పెట్టడం గానీ, బెదిరించడం గానీ చేయుట.


2 మార్కుల ప్రశ్నలు

  1. రిటర్నింగ్ అధికారి విధులను పేర్కొనుము.
    జ.
    1. తమకు సమర్పించిన నామ ప్రతిపాదనలను పరిశీలించి సక్రమమైన ప్రతిపాదనల జాబితాను ప్రకటిస్తారు.
    2. ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.
    3. అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు.
    4. బ్యాలెట్ పేపర్ ముద్రణ లేదా ఇవిఎం లను నష్టం చేస్తారు.
    5. పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వహించడానికి సిబ్బందిని నియమిస్తారు.
    6. ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
  2. జాతీయ పార్టీ మరియు ప్రాంతీయ పార్టీల మధ్య తేడాలు రాయుము.
    జ.
    జాతీయ పార్టీ: సాధారణ ఎన్నికలలో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6శాతం చొప్పున పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాల నుండి 11 లోక్‌సభ ఓట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.
    ప్రాంతీయపార్టీ: రాష్ర్టంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3శాతం ఓట్లు లేదా 3 శాసన సభ స్థానాలు పొందిలే ఆ పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది.
  3. సాధారణ, మధ్యంత ఉప ఎన్నికలను విభేదించుము.
    జ.
    1. 5 సం.లకు ఒకసారి దేశం లేదా రాష్ర్ట స్థాయిలో జరిగే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు.
    2. 5సం.ల కాలం గడవకముందే శాసనసభకు లేదా పార్లమెంటుకు ఎన్నికలను నిర్వహించడం మధ్యంతర ఎన్నికలు.
    3. ఒకటి లేదా కొన్ని ఖాళీలకు నిర్వహించే ఎన్నికలు ఉప ఎన్నికలు.
  4. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించడానికి కొన్ని చర్యలు సూచించుము.
    జ.
    1. ఒక్క ఓటరును కూడా వదలకుండా ప్రతి ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించాలి.
    2. ఎన్నికల విధులకు సంబంధించి ఉన్న మొత్తం సిబ్బందిపై ఎన్నికల కమీషన్ పర్యవేక్షణ ఉండాలి.
    3. గరిష్టంగా నిర్ణయించిన పరిమితికి మించి ఎన్నికల సమయంలో ఖర్చుపెట్టినచో ఆ ఎన్నికలు చెల్లకుండా చూడాలి.
    4. నకిలీ ఓట్లు, ఇతర ఓట్లు వేయడం వాటిని ఎదుర్కోవడం కోసం తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డులు అందజేయాలి.
  5. ఓటుహక్కుపై రెండు నినాదాలు రాయుము.
    జ.
    1. నీ ఓటు - నీ ఆయుధం
    2. పటిష్టమైన భవనం - బలమైన ఇటుకలతో
    3. పటిష్టమైన దేశం - నిజాయితీ ఓటర్లతో


4 మార్కుల ప్రశ్నలు

  1. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ఏవేని నాలుగు అంశాలను పేర్కొనుము.
    జ.
    1. పార్టీలు, అభ్యర్థులు జాతి, కుల,మత ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు.
    2. ఇతర రాజకీయ పార్టీలను అభ్యర్థులను విమర్శించేటపుడు ప్రజా జీవితంతో సంబంధంలేని వ్యక్తిగత దూషణలు చేయవద్దు.
    3. రాజకీయ ప్రకటనల ద్వారా జాతి, కుల, మతపరమైన అభ్యర్థనలు చేయకూడదు.
    4. ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభపెట్టడం, బెదిరించడంగాని చేయకూడదు.
    5. ఒకరిస్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించకూడదు.
    6. పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం. తిరిగి తీసుకెళ్ళడం నిషిద్ధం.
  2. ఎన్నికల సంఘం విధులను పేర్కొనుము.
    జ.
    1. ఎన్నికలు స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్వహించేటట్లు చూడడం.
    2. పునర్విభజనకు సంబంధించిన చట్టాల ప్రకారం నియోజక వర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం.
    3. ఎన్నికల షెడ్యూలును ప్రకటించడం
    4. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ తేదీల ఖరారు.
    5. రాజకీయ పార్టీలను గుర్తించడం, గుర్తులను కేటాయించడం.
    6. ఎన్నికల సమయంలో పార్టీలు పాటించాల్సిన ఎన్నికల నియమావళిని రూపొందించి అమలు చేయడం.
    7. ఎన్నికల సిబ్బందిని నియమించడం
    8. ఎన్నికలకు సంబంధించి రాష్ర్టపతి, గవర్నర్లకు సూచనలిస్తుంది.
  3. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన ఏదేని 4 నియమాలను పేర్కొనుము.
    జ.
    1. అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు.
    2. ప్రభుత్వ వాహనాలను ప్రచారానికి వాడకూడదు.
    3. అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండూ కలిపి ఉండరాదు.
    4. పత్రికలో, టి.వీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వకూడదు.
    5. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఎటువంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయ కూడదు. కొత్త పథకాలు ప్రకటించకూడదు. హామీలు ఇవ్వకూడదు.


బహుళైచ్ఛిక ప్రశ్నలు

  1. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎప్పటినుండి అమలులోనికి వస్తుంది?
    ఎ) ఎన్నికల షెడ్యూలు ప్రకటన వెలువడినప్పటి నుండి
    బి) పోలింగ్ రోజు నుండి
    సి) నామపత్రాలు సమర్పించినప్పటి నుండి
    డి) ఫలితాలు ప్రకటించినప్పటి నుండి
  2. మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు
    ఎ) ప్రతి 5సం.లకు
    బి) 5సం.లు పూర్తికాక ముందు
    సి) ఒకటి లేదా ఎక్కువ ఖాళీలకు
    డి) ప్రతి 2బీ సం.లకు
  3. జిల్లా స్థాయిలో ప్రధాన ఎన్నికల అధికారి?
    ఎ) జిల్లా విద్యాధికారి
    బి) జిల్లా వైద్యాధికారి
    సి) పోలీస్ కమీషనర్
    డి) జిల్లా కలెక్టర్
  4. ఎన్నికల కమీషన్ విధికానిది.
    ఎ) ఓటర్ల జాబితా రూపొందించడం
    బి) ఎన్నికల షెడ్యూలు ప్రకటించడం
    సి) ముఖ్యమంత్రులకు సలహాలు ఇవ్వడం
    డి) రాష్ర్టపతి, గవర్నరులకు సలహాలు ఇవ్వడం
  5. సార్వజనీన వయోజన ఓటు హక్కు అనగా
    ఎ) 20.సం.లు నిండిన వారికి ఓటుహక్కు కలిగి ఉండడం
    బి) ఎలాంటి విచక్షణ లేకుండా 18సం.లు నిండిన ఓటుహక్కు కలిగి ఉండడం
    సి) చదువుకున్న వారికి మాత్రమే ఓటుహక్కు కల్పించడం
    డి) 30సం.లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగి ఉండడం.
  6. కిందివాటిలో సరైన దాన్ని ఎన్నుకొనుము.
    ఎ) నోటా (NOTA) అనేది ఎన్నికల కమీషన్ యొక్క గుర్తు
    బి) నోటా (NOTA) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో ఒక భాగం
    సి) నోటా (NOTA) అభ్యర్థుల యొక్క గెలుపును ప్రభావితం చేస్తుంది
    డి) నోటా (NOTA) అభ్యర్థుల యొక్క ఓటమిని ప్రభావితం చేస్తుంది.


సమాధానాలు
1) ఎ; 2) బి; 3) డి; 4) సి; 5) బి; 6) బి;

Published date : 10 Oct 2023 01:20PM

Photo Stories