పౌరులు, ప్రభుత్వాలు
Sakshi Education
భాగం-1 : సమాచార హక్కు చట్టం
- సమాచార హక్కు చట్టాన్ని 2005లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
- ఈ చట్టం ప్రయోజనాలు ప్రజలకు అందాలంటే రెండు ముఖ్యమైన పాత్రలు(ప్రభుత్వం, పౌరులు) అవసరం.
- సమాచారం అనేక రూపాలలో ఉంటుంది- రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికాప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్‌పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, పత్రాలు, నమూనాలు, మోడల్స్ రూపంలో ఉన్న మెటీరియల్, ఏ ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉన్న గణాంకాలు, చట్టానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారి అనుమతి పొందిన ప్రైవేట్ సంస్థకు సంబంధించిన సమాచారం.
- ప్రతి ప్రభుత్వ శాఖ తగిన రికార్డులను నిర్వహించి, వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.
- ప్రతిశాఖ తమకు సంబంధించిన కొన్ని వివరాలను స్వచ్ఛందంగా ప్రజలకు బహిర్గతం చేయాలి.
- సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చే సమాచారం రాతపూర్వకంగా ఉండాలి.
- ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక పౌర సమాచార అధికారి ఉంటారు. అదే శాఖకు చెందిన ఉన్నత అధికారి అప్పీలేట్ అధికారిగా ఉంటారు.
- అన్ని శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు రాష్ర్ట పౌర సమాచార కార్యాలయానికి జవాబుదారీగా ఉంటారు. దీని అధికారి రాష్ర్ట సమాచార కమీషనర్.
- కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్యాలయాల సమాచార అధికారులు కేంద్ర సమాచార కమిషనర్లకు జవాబుదారీగా ఉంటారు.
-
సమాచార అధికారి అయినా నిర్దేశిత సమయంలో సమాచారం ఇవ్వకపోతే వాళ్ళు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
భాగం-2 :- న్యాయ సేవా ప్రాధికార సంస్థ - ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి న్యాయసేవల పీఠాల చట్టాన్ని 1987లో రూపొందించారు.
- ఈ చట్టం 1994లో సవరించారు, 2002లో న్యాయ సేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టంగా సవరించారు.
- దీని ప్రకారం బలహీన వర్గాలకు ఉచిత న్యాయసేవలు అందించడానికి ప్రతి రాష్ర్టంలోను లోక్ అదాలత్ (ప్రజా న్యాయపీఠం)లను ఏర్పాటు చేశారు.
- ఖర్చులేకుండా త్వరితగతిన న్యాయం పొందడానికి లోక్ అదాలత్‌లు ఉపయోగపడతాయి.
- దీనిలో రెండు సంస్థలు ఉంటాయి. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ, రాష్ర్ట న్యాయసేవల ప్రాధికార సంస్థ.
- రాష్ర్ట న్యాయసేవల ప్రాధికార సంస్థకు అధిపతి (ప్యాట్రన్-ఇన్-చీఫ్)గా రాష్ర్ట హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు.
- దీనికి కార్యనిర్వాహక చైర్మన్‌గా పదవిలో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జిని నియమిస్తారు.
- జిల్లా స్థాయిలో జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ ఉంటుంది. జిల్లా జడ్జి దీనికి ఎక్స్-అఫిషియో చైర్మన్‌గా ఉంటారు.
- ప్రతి మండలం లేదా కొన్ని మండలాలకు కలిపి మండల లేదా తాలూకా న్యాయసేవల సంఘాలు ఉంటాయి. ఈ పరిధిలో పని చేస్తున్న సీనియర్ సివిల్ జడ్జి దీనికి అధిపతిగా, ఎక్స్-ఆఫిషియో చైర్మన్‌గా ఉంటారు.
- వివిధ స్థాయిలలో ఈ కింది అధికారులకు దరఖాస్తు చేయాలి.
జిల్లాస్థాయి: కార్యదర్శి, జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ, జిల్లా కోర్టు భవనాలు.
రాష్ర్టస్థాయి: సభ్యకార్యదర్శి, రాష్ర్ట న్యాయసేవల ప్రాధికార సంస్థ, న్యాయసేవా సదన్, సిటీ సివిల్ కోర్టు భవనాలు, హైకోర్టు భవనాలు, హైదరాబాద్-500066.
హైకోర్టులో ఉన్న కేసులకు సంబంధించి: కార్యదర్శి, హైకోర్టు న్యాయసేవల ప్రాధికార సంస్థ, హైకోర్టు భవనాలు, హైదరాబాద్-500066.
4 మార్కుల ప్రశ్నలు
- సమాచార హక్కు చట్టం నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల పౌరుల పాత్రలను వివరించండి. సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పని మరింత పారదర్శకంగా ఎలా అవుతుందో రాయండి?
జ. 1) సమాచార హక్కు చట్టం 2005లో రూపుదాల్చింది. ప్రజల ఉద్యమం కారణంగా, పౌరులకు హక్కులను కల్పిస్తున్న రాజ్యాంగంలోని అంశాల కారణంగా ఈ చట్టం రూపొందింది.
2) ఈ చట్టం ప్రయోజనాలు ప్రజలకు అందాలంటే ప్రభుత్వ శాఖలు, పౌరులు నిర్వర్తించాల్సిన పాత్ర ఎంతగానో ఉంది.
3) ఏ ప్రజాస్వామిక వ్యవస్థలోనైన ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించి వారికి జవాబు దారీగా ఉండాలి.
4) ఒకప్పుడు ప్రభుత్వాలు కేవలం ప్రజాప్రతినిధులకు మాత్రమే జవాబు దారీ తనం వహించేవి కాని ఇప్పుడు ఏ పౌరుడు ఆసక్తి చూపినా వారికి సమాచారం అందజేయడం ప్రభుత్వ శాఖల బాధ్యత.
5) ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని నియమ, నిబంధనల ఆధారంగా పని చేస్తుంది. ఆ నియమాలను పాటిస్తూ కొన్ని రికార్డులను నిర్వహించాలి.
6) ప్రభుత్వ శాఖలు నిర్వహించే రోజువారీ కార్యక్రమాల ఆధారంగా కొన్ని రాత పత్రాలు రూపొందుతాయి. అవి ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ఇవే పత్రాలు సమాచారానికి ఆధారం అవుతాయి.
7) సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత పౌరుల బాధ్యత మరింత పెరిగింది.
8) ఒక శాఖ పని చేయటంలో అవక తవకలు జరిగాయని అనుమానం కలిగితే ఏ పౌరుడైనా దానికి సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తు చేయవచ్చు. తగు సమాచారాన్ని ఇవ్వడం సంబంధిత అధికారి బాధ్యత.
ఉదా: విద్యార్థులకు స్కాలర్‌షిప్ మంజూరైనా దానిని పంచకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తెలుసుకొని దానిని పంచే విధంగా ఏర్పాటు చేయవచ్చు.
9) ప్రభుత్వం పని మరింత పారదర్శకంగా రూపొందడానికి ప్రతిశాఖ పౌరులు ఎవరూ అడగకుండానే తమకు సంబంధించిన కొన్ని వివరాలను స్వచ్ఛందంగా ప్రజలకు బహిర్గతం చేయాలి.
ఉదా:ఒక ప్రాంతంలో రోడ్డు వేస్తుంటే ఆ ప్రాంతంలో బోర్డు పెట్టి ఆపనికి ఎంత ఖర్చు అయింది. ఎన్నిరోజులు పట్టింది వంటి వివరాలు పొందుపర్చాలి. - సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పనిని మెరుగుపర్చటం, పర్యవేక్షించడం ఎలా సాధ్యమవుతుంది?
జ. 1) సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వం పనిని మెరుగుపర్చుకోవడం తప్పని సరి అయింది. ఈ చట్టం వల్ల ఇప్పుడు ప్రతి ప్రభుత్వం శాఖ రికార్డులను నిర్వహించి వాటిని అడిగిన పౌరులకు అందుబాటులో ఉంచాలి.
2) ప్రతిప్రభుత్వ శాఖ కొన్ని నియమ నిబంధనల ఆధారంగా పని చేస్తుంది. తన రోజువారీ కార్యక్రమాలలో భాగంగా ఉపయోగించే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ సమాచారం అవుతాయి.
3) పౌరులెవ్వరూ అడగకుండానే ప్రతిశాఖ తమకు సంబంధించిన కొన్ని వివరాలను స్వచ్ఛందంగా ప్రజలకు బహిర్గతం చేయాలి.
ఉదా:-- ఒక పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరోజు ఎంతమంది హాజరయ్యారు. ఎంతమంది మధ్యాహ్న భోజనం చేశారు తదితర వివరాలు.
- ఏదైనా అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మాణాలు జరుగుతుంటే వాటికి సంబంధించిన వివరాలు.
4) దీనిని పర్యవేక్షించడానికి ఒక నిర్మాణం అవసరం. అందుకోసం కార్యాలయ స్థాయి నుంచి రాష్ర్ట, జాతీయ స్థాయి వరకు వివిధ అధికారులు ఉంటారు.
5) ప్రతి శాఖలో ఒక పౌరసమాచార అధికారి ఉంటాడు. అదే శాఖలో ఒక అప్పిలేట్ అధికారి ఉంటాడు.
6) అన్ని శాఖల అప్పిలేట్ అధికారులు, పౌర సమాచార అధికారులు రాష్ర్ట స్థాయి సమాచార క మిషన్‌కు బాధ్యత వహిస్తారు.
7) కేంద్రప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పౌర సమాచార అధికారులు కేంద్ర సమాచార క మిషన్‌కు బాధ్యత వహిస్తారు.
8) పౌరులు సమాచారం కోసం దరఖాస్తు చేసినపుడు నిర్దేశిత సమయంలో సమాచారం ఇవ్వకపోతే రాష్ర్ట/ కేంద్ర సమాచార కమిషనర్లకు ఫిర్యాదు చేయవచ్చు అవసరం అయితే వీరు ఆ సమాచార అధికారికి జరిమానా కూడా విధించవచ్చు. - సమాచారం అని దేనిని అంటారు? ప్రతి ప్రభుత్వ శాఖలో అధి ఏవిధంగా ఉత్పన్నమవుతుంది? పై అధికారి, కింది అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం అవుతుందా?
జ. 1) సమాచారం:సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం అనేక రూపాలలో ఉంటుంది. రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికాప్రకటనలు, సర్క్యులర్లు, ఆదేశాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, పత్రాలు, నమూనాలు, మోడల్స్ వంటి రూపాలలో ఉన్న మెటీరియల్ ఏ ఎలక్ట్రానిక్ రూపంలోనైనా ఉన్న గణాంకాలు. ఇవి ప్రభుత్వ సంస్థలకు చెందినవి కావచ్చు. ప్రైవేటు సంస్థలకు చెందినవి కావచ్చు.
2) సమాచారం ఉత్పన్నం కావడం: ప్రతి ప్రభుత్వ శాఖ కొన్ని నియమ, నిబంధనల ఆధారంగా పని చేస్తుంది. ఈ నియమాలను పాటిస్తూ వారు చేసే పనులకు సంబంధించి కొన్ని రికార్డులు నిర్వహించాలి. తీసుకున్న నిర్ణయాల వివరణ ఉండాలి. వీటి ఆధారంగా వ్యవస్థలో అనేక రాత పత్రాలు రూపొందుతాయి. ఇదే సమాచారం.
ఉదా:1) ఆరోగ్యశాఖలో డాక్టర్లు, నర్సుల ఎంపిక, నియామకం, బదిలీలకు సంబంధించిన విషయాలు.
2) రెవెన్యూశాఖలో భూమి రికార్డులకు సంబంధించిన విషయాలు.
3) విద్యాశాఖలో స్కాలర్‌షిప్‌లు, మధ్యాహ్న భోజనం వివరాలు పై అధికారి, కింది అధికారి మధ్య జరిగే మౌఖిక సంభాషణ సమాచారం కాదు, సమాచారం అనేది ఖచ్చితంగా రాత మూలకంగా ఉండాలి అది పేపరు రూపంలో కావచ్చు ఎలక్ట్రానిక్ రూపంలో కావచ్చు. - దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఏ పౌరుడికైనా సమాచారం అందుబాటులో ఉండేలా చెయ్యడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
జ. సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం ప్రభుత్వ సంస్థలు
కంప్యూటరైజ్డ్ రూపంలో సమాచారాన్ని భద్రపరచాలి.
దానికి సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగానే వెల్లడి చేయాలి.
1) ప్రతి ప్రభుత్వ సంస్థ:-- తనకు సంబంధించిన అన్ని రికార్డులను తేలికగా బయటకు తీయడానికి వీలుగా వర్గీకరించి, సూచికలతో నిర్వహించాలి.
- ప్రతి సంస్థ ఈ దిగువ సమాచారాన్ని ప్రచురించాలి.
2. సంస్థలోని అధికారాలు, ఉద్యోగస్తుల అధికారాలు, విధులు.
3. నిర్ణయాలు తీసుకోవడంలో అనుసరించే విధానం, పర్యవేక్షణ, జవాబుదారీ విధానాలను కూడా పేర్కొనాలి.
4. సంస్థకు ఉండే లేదా దాని నియంత్రణలో ఉండే లేదా తమ విధులను నిర్వర్తించడంలో ఉద్యోగస్తులు ఉపయోగించే నియమాలు, నిబంధనలు, ఆదేశాలు మార్గదర్శకాలు, రికార్డులు.
5. సలహా ఇవ్వడం కోసం ఏర్పాటు చేసి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న బోర్డులు, సమితులు, సంఘాలు ఇతరాల వివరాలు.
6. ఆ కార్యాలయంలోని అధికారుల ఉద్యోగస్తుల వివరాలు.
7. అధికారులు, ఉద్యోగస్తులకు ఇస్తున్న నెలసరి జీతం, నియమాల ప్రకారం చేసే ఇతర చెల్లింపులు.
8. తన ప్రతి ఒక్క ఏజెన్సీకి కేటాయించిన బడ్జెట్.
9. సబ్సిడీ పథకాల అమలు విధానం, దానికి కేటాయించిన నిధులు.
10. దాని ద్వారా రాయితీలు, పర్మిట్లు, లేదా అధీకృత పత్రాలు పొందిన వాళ్ల వివరాలు.
11. పౌర సమాచార అధికారుల పేర్లు, హోదాలు, ఇతర వివరాలు.- ముఖ్యమైన విధానాలు రూపొందించేటప్పుడు లేదా ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రకటించేటప్పుడు సంబంధింత అన్ని వాస్తవాలను వెల్లడి చేయాలి.
- ప్రభావిత వ్యక్తికి పరిపాలన సంబంధ లేదా న్యాయ స్వరూపం గల నిర్ణయాలకు కారణాలను తెలియజేయాలి.
- పై సమాచార మంతటినీ ఎవరూ అడగకుండానే ప్రభుత్వ సంస్థలు వెల్లడి చేయాలి.
- ఇది అందరికీ తేలికగా అందుబాటులో ఉండాలి.
- ఇది స్థానిక భాషలో ఉండాలి. దీనికి ఏదైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే అది ప్రజలకు భారం కాకుండా ఉండాలి.
- న్యాయ సహాయం ఆశించే ప్రజలకు న్యాయ సేవల ప్రాధాన్యత సంస్థ ఏ విధంగా దోహద పడుతుంది?
జ. 1) ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి మన దేశంలో ఒక విధానం ఉంది.
2) న్యాయ సేవల ప్రాధికార సంస్థ (సవరణ) చట్టం 2002 ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయసేవలు అందించడానికి న్యాయసేవా పీఠాలను ఏర్పాటు చేశారు.
3) దీని వల్ల న్యాయవ్యవస్థ సమాన అవకాశాల ప్రాతిపదికన అందరికీ న్యాయాన్ని అందిస్తుంది.
4) గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను గ్రామ పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ అమోదయోగ్యంగా పరిష్కరించడటం మన దేశంలో అనాదిగా జరుగుతోంది.
5) ఇదే పద్దతిలో ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించడానికి లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేశారు.
6) వీటి ద్వారా న్యాయకోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతో తాగాదాలను, వివాదాలను పరిష్కరించుకోవచ్చు.
7) ఖర్చు లేకుండా త్వరితగతిన న్యాయం పొందవచ్చు.
8) కోర్టులో దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ సహాయపడుతుంది. - న్యాయసేవల ప్రాధికార సంస్థల చట్టం కింద చేపట్టే కేసులు, ఉచిత న్యాయ సేవలు పొందడానికి పేర్కొన్న అర్హతలపై మీ అభిప్రాయం ఏమిటి?
జ. న్యాయసేవల ప్రాధికార సంస్థల చట్టం కింద చేపట్టే కేసులు:-
1) వైవాహిక విభేదాలు, భరణానికి సంబంధించిన కేసులు.
2) భర్త, అత్తవారింటి వేధింపులకు సంబంధించిన కేసులు, గృహహింస కేసులు
3) అన్ని రకాల సివిల్‌కేసులు భూ వివాదాలు.
4) చట్టరీత్యా రాజీకి అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు
ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులైన వారు:-
1) షెడ్యూల్డు కులాలు లేదా షెడ్యూల్డు జాతులకు చెందిన వ్యక్తులు.
2) మానవ అక్రమ రవాణా బాధితులు, బిక్షాటకులు
3) స్త్రీలు, పిల్లలు
4) మతి స్థిమితం లేనివారు లేదా అంగవైకల్యం ఉన్నవారు.
5) పెను విపత్తు, జాత్యహంకార హింస, కులవైషమ్యాలు, వరదలు, కరువులు, భూకంపాలు, పారిశ్రామిక, విపత్తులకు గురైనవారు.
6) పారిశ్రామిక కార్మికులు
7) వ్యభిచార వృత్తి చట్టం ప్రకారం రక్షణ గృహంలోను, బాలనేరస్తుల న్యాయ చట్టం ప్రకారం బాలనేరస్తుల గృహంలోను, మానసిక ఆరోగ్య చట్టం ప్రకారం మానసిక వ్యాధి సంరక్షణా కేంద్రంలో నిర్భంధంలో ఉన్నవారు.
8) లక్ష రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారు.
నా అభిప్రాయం:-సమాజంలోని షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత, సత్వర న్యాయ సహాయం చేయడం అభినందనీయం ముఖ్యంగా మహిళలు వైవాహిక జీవితంలో ఎదుర్కొనే విభేదాలు, గృహహింసకు సంబంధించిన కేసులు సత్వర పరిష్కారం కనుగొనడం సమర్థనీయమే.
2 మార్కుల ప్రశ్నలు
- సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యానికి ఉన్న అసలైన స్ఫూర్తిని తెలియజేస్తుంది. దీనిని మీరు ఎలా సమర్థిస్తారు?
జ. సమాచార హక్కు చట్టం, 2005 ప్రజాస్వామ్యానికి అసలైన స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చును.
1) ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రజలే ఎన్నుకుంటారు. కాబట్టి ప్రభుత్వంలో ఏం జరుగుతోందని వారి తెలియాల్సిన అవసరం ఉంది.
2) ఈ చట్టం లేక ముందు సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సమాచారం తెలిసేది కాదు.
3) ఈ చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో జరిగే అన్ని కార్యక్రమాలు అంటే నిధుల మంజూరు, ఖర్చు, నాణ్యత, ఉద్యోగుల నియామకాలు, స్కాలర్‌షిప్‌లు మొదలైన అన్ని విషయాలు ప్రజలు తెలుసుకోవచ్చు.
4) ప్రభుత్వ వ్యవహారాలలో దాపరికం లేని విధానం అనుసరించబడుతుంది. కొన్ని విషయాలను పార్కులు అడగకుండానే ప్రభుత్వ శాఖలు బహిర్గతం చేసి ప్రదర్శించాల్సి ఉంటుంది. - సమాచారహక్కు చట్టం ప్రకారం సమాచారం వెల్లడి చేయడానికి ఎలాంటి మినహాయింపులు ఉన్నాయి?
జ. సమాచార వెల్లడి చేయడానికి మినహాయింపులు:-
1) భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రతలను వెల్లడి చేసే సమాచారం. విదేశీ శక్తుల సందర్భంలో కీలక ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలు కలిగి ఉండే అంశాలు.
2) పార్లమెంటు లేదా రాష్ర్ట శాసన సభల హక్కులకు భంగం కలిగించే సమాచారం.
3) గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశీ ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం.
4) ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం.
5) మంత్రులు లేదా సెక్రటరీల బృందం ముందు ఉంచే కేబినేట్ పత్రాలు లేదా రికార్డులు. - లోక్ అదాలత్ ఉద్దేశమేంటి?
జ. భారతదేశంలో తగాదాలు, వివాదాల పరిష్కారానికి అనాదిగా ఉన్న విధానమే ఇపుడు లోక్ అదాలత్ రూపాన్ని సంతరించుకుంది. దీని ఉద్దేశాలు....
1) సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత, సమర్థ న్యాయ సేవలను అందించడం.
2) న్యాయ కోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో సుహృద్భావ వాతావరణంలో, పరస్పర అంగీకారంతో తగాదాలను, వివాదాలను పరిష్కరించడం.
3) ఎలాంటి రుసుము తీసుకోకుండా ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడం.
4) కోర్టులలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను కూడా ఎటువంటి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించడం. - న్యాయసేవా ప్రాధికార సంస్థల విధులు ఏవి?
జ. న్యాయసేవా ప్రాధికార సంస్థల విధులు:
1) చట్టంలో పొందుపర్చిన ప్రకారం అర్హులైన వ్యక్తులకు న్యాయ సేవలను అందించటం.
2) లోక్ అదాలత్‌లను నిర్వహించడం.
3) ముందస్తు నివారణ, వ్యూహాత్మక న్యాయ సహాయ కార్యక్రమాలు చేపట్టడం.
4) న్యాయసేవల ప్రాధికార సంస్థ నిర్ణయించే ఇతర విధులను నిర్వహించడం. - గ్రామపెద్దలు, కోర్టులు తగాదాలు/వివాదాలను పరిష్కరించే విధానాలను పోల్చండి. మీరు దేనిని ఇష్టపడతారు. ఎందుకు?
జ. గ్రామపెద్దలు:గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను గ్రామ పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ అమోదయోగ్యంగా పరిష్కరించడం మన దేశంలో అనాదిగా వస్తున్న విధానం. దీని వల్ల తగాదాలు త్వరితగతిన పరిష్కారం అవుతాయి.
కోర్టులు:ప్రజల మధ్య వచ్చిన తగాదాలను పరిష్కరించడానికి కోర్టులు ఉన్నాయి. అయితే ఇవి కొన్ని నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. అమలులో ఉన్న చట్టాల ఆధారంగా, సాక్షులను విచారిస్తూ కోర్టులు న్యాయాన్ని అందిస్తాయి. అయితే కోర్టులలో కేసులు తేలడానికి సుదీర్ఘ సమయం పడుతుంది.
ఈ రెండు విధానాలలో గ్రామపెద్దలు పరిష్కరించే విధానాన్నే నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఎక్కువ ఖర్చు లేకుండా త్వరిత గతిన తగాదా పరిష్కారం అవుతుంది.
1-మార్కు ప్రశ్నలు:-
- రాష్ర్ట, కేంద్ర సమాచార కార్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఎందుకు ఇచ్చారు?
జ. 1) రాష్ర్ట, కేంద్ర సమాచార కార్యాలయాలు స్వయం ప్రతిపత్తి కల్గిన సంస్థలు.
2) ఏ ఇతర సంస్థ లేక వ్యక్తి అధికారానికి లోబడి ఉండకుండా ఉండటానికి స్వయంప్రతిపత్తి కల్పించారు. - సమాచార హక్కు చట్టం ప్రయోజనాలు ప్రజలకు పూర్తిగా అందాలంటే ముఖ్య పాత్ర వహించేది ఎవరు?
జ. 1) ప్రభుత్వ శాఖలు
2) పౌరులు - విద్యాశాఖ నుంచి ఎలాంటి సమాచారాన్ని పౌరులు కోరవచ్చు?
జ. విద్యాశాఖ నుంచి పౌరులు పాఠ్యపుస్తకాల సరఫరా, పంపిణీ, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల సెలవులు, స్కాలర్‌షిప్‌లు, విద్యార్థుల సంఖ్య, హాజరు మొదలైన విషయాలను కోరవచ్చు. - సమాచారం అంటే ఏమిటి?
జ. సమాచారం:రాత మూలకంగా గాని, ప్రింటింగ్ లోగాని, ఎలక్ట్రానిక్‌రూపంలో గాని నిక్షిప్తం చేపి ఉన్న రికార్డులు, డాక్యుమెంట్లు, మెమోలు, ఈ-మెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికాప్రకటనలు, ఆదేశాలు, ఒప్పందాలు, నివేదికలు మొదలైనవి. - సమాచారం అందించడానికి ఒక కార్యాలయంలో ఎవరు ఉంటారు?
జ. సమాచారం అందించడానికి ప్రతి కార్యాలయంలో కింది అధికారులు ఉంటారు.
1) పౌర సమాచార అధికారి
2) సహాయ పౌర సమాచార అధికారి. - ఒక రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయానికి చెందిన సమాచార అధికారి తగుసమాచారం ఇవ్వకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
జ. రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయానికి చెందిన సమాచార అధికారి తగు సమాచారం ఇవ్వకపోతే ఆ శాఖకు చెందిన అప్పిలేట్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు, ఆ అధికారి కూడా స్పందించకపోతే రాష్ర్ట సమాచార క మిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. - లోక్ అదాలత్ అంటే ఏమిటి?
జ. లోక్ అదాలత్:బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి ఉచిత, సత్వర న్యాయ సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేసిన ప్రజాన్యాయ పీఠాలే లోక్ అదాలత్‌లు. - న్యాయ సేవల పీఠాల చట్టం ఎప్పుడు చేయబడింది? దానిని ఇప్పటి వరకు ఎన్ని సార్లు సవరించారు?
జ. 1) న్యాయ సేవల పీఠాల చట్టం మొదటిసారి 1987లో చేశారు.
2) దానిని 1994లోను, 2002లోను మొత్తం రెండు సార్లు సవరించారు. - న్యాయసేవల ప్రాధికార సంస్థల రెండు ముఖ్య విధులు ఏవి?
జ. 1) చట్టంలో పొందుపర్చిన ప్రకారం అర్హులైన వ్యక్తులను న్యాయసేవలను అందించటం.
2) లోక్ అదాలత్‌లను నిర్వహించడం. - లోక్ అదాలత్‌ల వల్ల చేకూరే రెండు ముఖ్య ప్రయోజనాలు ఏమి?
జ. 1) ఎటువంటి కోర్టు రుసుము ఉండదు. ఒక వేళ కోర్టు రుసుము అప్పటికే చెల్లించి ఉంటే తిరిగి చెల్లిస్తారు.
2) వివాదాలు తొందరగా పరిష్కారం అవుతాయి. - లోక్ అదాలత్‌లలో విచారించే ముఖ్యమైన కేసులు ఏమి?
జ. 1) వైవాహిక విభేదాలు, భరణానికి సంబంధించిన కేసులు
2) భర్త, అత్త వారింటి వేధింపు కేసులు, గృహహింస కేసులు.
1/2 మార్కు ప్రశ్నలు (బహుళైచ్ఛిక ప్రశ్నలు)
- సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది?
1) 2001
2) 2005
3) 2009
4) 2011 - కింది వాటిలో ఏది రెవెన్యూ శాఖకు సంబంధించిన సమాచారం?
1) మందుల కొనుగొలు
2) వసతి గృహసదుపాయాలు
3) భూమి రికార్డులు
4) మధ్యాహ్న భోజనం వివరాలు - కింది వాటిలో ఏది సమాచారం కాదు?
1) ఈ-మెయిల్స్
2) సీడీ రూపంలో ఉన్న సమాచారం
3) అధికారుల మధ్య ముఖాముఖి సంభాషణ
4) పత్రికా ప్రకటన - రాష్ట్రానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖల పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు ఎవరికి జవాబు దారీగా ఉంటారు?
1) రాష్ర్ట పౌర సమాచార కార్యాలయానికి
2) కేంద్ర సమాచార కార్యాలయానికి
3) రాష్ర్ట శాసన సభకు
4) గవర్నర్‌కు - ఏదైనా అధికారి దగ్గర పౌరులు కోరిన సమాచారం లేకపోతే ఏమి చేయాలి?
1) తన దగ్గర సమాచారం లేదని నోటిమాటతో చెప్పాలి.
2) తన దగ్గర సమాచారం లేదని రాత మూలకంగా తెలియజేయాలి.
3) ఆ సమాచారం ఏ అధికారి వద్ద ఉందో ఆ అధికారి వద్ద నుంచి దానిని పొంది అందజేయాలి.
4) ఏమీ చేయక పోయినా ఫర్వాలేదు. - కేంద్ర రాష్ర్ట సమాచార కమిషనర్లకు ఈ అధికారం ఉండదు?
1) నిర్దేశిత సమయం లోపు, సరిైయెున సమాచారం ఇచ్చేలా చూడటం
2) సమాచారం ఇవ్వని అధికారులపై జరిమానా విధించడం
3) సమాచార హక్కు చట్టం ప్రకారం తగు రికార్డులను నిర్వహించేలా చూడటం
4) ఆయా శాఖల పనిలో చట్టాలను ఉల్లంఘిస్తే చర్య తీసుకోవడం. - సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థ అనగా?
1) రాజ్యాంగం కింద ఏర్పడిన సంస్థ
2) పార్లమెంట్ లేదా రాష్ర్ట శాసన సభల ప్రకారం ఏర్పడిన సంస్థ
3) ప్రభుత్వ ఆదేశాలు లేదా నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన సంస్థ
4) పైవన్నీ - సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని వెల్లడి చేయడానికి వీరికి మినహాయింపు లేదు?
1) పార్లమెంట్ హక్కులకు భంగం కలిగించే సమాచారం
2) దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు సంబంధించిన సమాచారం.
3) ఒక వ్యక్తి భౌతిక భద్రతకు సంబంధించిన సమాచారం
4) వైద్య శాఖకు సంబంధించిన సమాచారం - సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరుల సమాచారాన్ని పొందటానికి దరఖాస్తు కొరకు ఎంత రుసుము చెల్లించాలి?
1) 50 రూ.-100రూ.
2) 10రూ.-20 రూ.
3) 5 రూ.-10రూ.
4) 25రూ.-50రూ. - న్యాయ సేవల ప్రాధికార సంస్థల చట్టానికి చివరి సారిగా ఎప్పుడు సవరణ చేశారు?
1) 1987
2) 2002
3) 1994
4) 2000 - రాష్ర్ట న్యాయసేవల ప్రాధికార సంస్థకి ప్యాట్రన్-ఇన్-చీఫ్‌గా ఎవరు ఉంటారు?
1) గవర్నర్
2) రాష్ర్ట హైకోర్టు ఛీఫ్ జస్టిస్
3) రాష్ర్ట హైకోర్టు జడ్జి
4) పదవీ విరమణ చేసిన ఒక హైకోర్టు జడ్జి - జిల్లా స్థాయి న్యాయసేవల ప్రాధికార సంస్థకు ఎక్స్-అఫిషియో చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
1) జిల్లా జడ్జి
2) జిల్లా కలెక్టర్
3) జిల్లాలోని సీనియర్ అడ్వకేట్
4) ప్రభుత్వం నియమించిన అధికారి - మండల న్యాయసేవల సంఘానికి అధిపతిగాను, ఎక్స్అఫిషియో చైర్మన్‌గాను ఎవరు ఉంటారు?
1) జిల్లా జడ్జి
2) మండల తహసీల్దార్
3) సంఘ పరిధిలో పనిచేస్తున్న సీనియర్
4) ప్రత్యేక అధికారి - దీన్ని లోక్ అదాలత్‌లలో విచారించరు?
1) భార్య, భర్తల వివాదం
2) గృహ హింస
3) భూవివాదాలు
4) హత్య కేసు - లోక్ అదాలత్‌ల ద్వారా న్యాయ సేవలు పొందటానికి వీరు అర్హులు కాదు?
1) స్త్రీలు
2) పారిశ్రామిక కార్మికులు
3) ప్రభుత్వ ఉద్యోగులు
4) వికలాంగులు
జవాబులు
1) 2 2) 3 3) 3 4) 1 5) 3
6) 4 7) 4 8) 4 9) 3 10) 2
11) 2 12) 1 13) 3 14) 4 15) 3
Published date : 10 Oct 2023 12:51PM