Skip to main content

మట్టి కుండలో నీరు చల్లగా ఉంటుంది. ఎందుకు?

 మన చేతిపై లేక మణికట్టుపై కొన్ని చుక్కలు సెంటు లేదా అత్తరు వేసుకుంటే చల్లగా, హాయిగా అనిపిస్తుంది. అందుకు కారణం ఆ చుక్కలు చేతి నుంచి ఉష్ణాన్ని గ్రహించి ఆవిరవడమే. ఈ ప్రక్రియను ‘భాష్పీభవనం’ అంటారు. అత్తరు చుక్కలు చేతిపై పడిన ప్రదేశంలో వేడి తగ్గిపోవడంతో చల్లదనం మన అనుభవంలోకి వస్తుంది. మన దేహానికి బాగా చెమట పట్టినపుడు ఫ్యాన్ కింద కూర్చుంటే కలిగే చల్లదనం కూడా ఇలాంటిదే. దేహంలో ఉండే ఉష్ణాన్ని చెమట బిందువులు గ్రహించి ఆవిరిగా మారతాయి. ఆ ఆవిరిని ఫ్యాను గాలి దూరంగా తీసుకుపోవడంతో దేహానికి చల్లదనం కలుగుతుంది.

కుక్కలు వేసవి కాలం మండుటెండలో నాలుక చాపి వగరుస్తూ ఉండడం గమనించారా? కారణం, వాటికి దాహం వేయడమే. అలా చేయడం వల్ల వాటి నాలుకలపై ఉండే లాలాజలం వేసవిలోని వేడిని గ్రహించి భాష్పీభవనం చెందతుంది. దాంతో చల్లదనం అనుభవంలోకి వచ్చి అవి సేద తీరుతాయి. ఈ ఉదాహరణల వల్ల భాష్పీభవనం చల్లదనం కలుగజేస్తుందని, ఈ కారణం వల్లే మట్టి కుండలోని నీరు చల్లబడుతుందని తెలుస్తుంది.

మట్టికుండల గోడలు అతి సూక్ష్మమైన రంధ్రాలు కలిగి ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి నీరు నెమ్మదిగా బయటకు వస్తుంటుంది. ఆ నీరు ఆవిరి చెందుతూ అందుకు కావలసిన వేడిని కుండలోని నీటి నుంచి గ్రహిస్తుంది. దాంతో కుండలోని నీరు చల్లబడుతుంది. కుండలో సూక్ష్మరంధ్రాలు ఎక్కువగా ఏర్పడటానికి మట్టితో చేసిన పచ్చి కుండలను బట్టీలో ఒక నిర్దుష్టమైన ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. అందుకే ‘కొత్తకుండలో నీరు చల్లన’ అని సామెత వచ్చింది!

- లక్ష్మీ ఈమని
Published date : 20 Jul 2013 04:47PM

Photo Stories