Skip to main content

‘పది’లమైన గ్రేడ్ కోసం..

పదో తరగతి వార్షిక పరీక్షల సమయం సమీపిస్తోంది. మార్చిలో పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులకు అందుబాటులో ఉన్న సమయం మూడు నెలలు. పదో తరగతిలో సాధించిన మార్కులే భవిష్యత్తుకు సోపానాలుగా మారతాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మంచి మార్కులు సాధించే క్రమంలో పదో తరగతి విద్యార్థుల్లో తలెత్తుతున్న సందేహాలకు సమాధానాలు...
  • తెలుగు సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా చదవాల్సిన చాప్టర్లు?
    జవాబు:
    విద్యార్థులు దానశీలము, వీర తెలంగాణ, కొత్త బాట, ఎవరి భాష వాళ్లకు ఇంపు చాప్టర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • ఉపవాచకంలో మంచి మార్కులు పొందడానికి మార్గాలు?
    జవాబు:
    తెలుగు ఉపవాచకం పేపర్-2గా ఉంటుంది. ప్రస్తుత ఉపవాచకంలో రామాయణం గురించి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇతివృత్తం, ప్రాముఖ్యతలపై దృష్టి పెట్టాలి. రామాయణంలోని ముఖ్య పాత్రలు, వ్యక్తులు, వారి ప్రవర్తన శైలితోపాటు ఆయా పాత్రల ద్వారా లభించే సందేశాలపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా రామాయణంలోని ముఖ్య ఘట్టాలైన కిష్కిందకాండ, సుందరకాండ వంటి ఇతివృత్తాలను సంపూర్ణంగా అధ్యయనం చేయాలి.
  • వ్యాకరణంలో ముఖ్యంగా దృష్టి పెట్టాల్సినవి?
    జవాబు:
    సంయుక్తార్థాలు, వ్యుత్పత్యర్థాలు, జాతీయాలు, సంధులు, సమాసాలు బాగా అభ్యసనం చేయాలి. ఉదాహరణలతో కూడిన అభ్యసనం మరింత మేలు చేస్తుంది. అంతేకాకుండా ఆయా సందర్భాలకు అనుగుణంగా సమాసాలను విశ్లేషించే సొంత నైపుణ్యం అవసరం.
  • అపరిచిత గద్యం అంటే ఏంటి? అందులో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మార్గాలు?
    జవాబు:
    విద్యార్థుల్లోని అవగాహన స్థాయిని తెలుసుకునేందుకు పరీక్షలో అపరిచిత గద్యం విభాగాన్ని పొందుపర్చారు. ఇందులో ఏదైనా ఒక అంశాన్ని ప్యాసేజ్ రూపంలో ఇస్తారు. దీన్నే అపరిచిత గద్యంగా పేర్కొన్నారు. ఆ ప్యాసేజ్‌కు సంబంధించి అయిదు మార్కులు ఉంటాయి. విద్యార్థులు పాఠ్యాంశాలు చదువుతున్నప్పుడు వాస్తవిక కోణంలో చదివి, అర్థం చేసుకోగలిగితే.. అపరిచిత గద్యం ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వొచ్చు.
  • అపరిచిత పద్యం అంటే?
    జవాబు:
    అపరిచిత గద్యం మాదిరిగానే పద్యభాగానికి సంబంధించి విద్యార్థుల్లో వాస్తవ అవగాహన స్థాయిని తెలుసుకునే విధంగా పాఠ్యాంశాల్లో లేని పద్యాన్ని ఇస్తారు. దీన్నే అపరిచిత పద్యం అంటారు. దీనికి కూడా ఐదు మార్కులు ఉంటాయి. విద్యార్థులు సిలబస్ ప్రకారం పద్యభాగంలోని ప్రతిపదార్థాలు, భావాలపై పట్టు సాధిస్తే అపరిచిత పద్యంలోనూ సులువుగా ఐదు మార్కులు పొందే అవకాశం ఉంది.
  • తెలుగులో మంచి మార్కులకు దోహదం చేసే ఇతర మార్గాలు?
    జవాబు:
    పదజాలం, వ్యాకరణాంశాలు, సృజనాత్మకత, స్వీయ రచనలో నైపుణ్యం సాధించాలి. దీని కోసం ఆయా పాఠ్యాంశాల్లోని సారాంశాలు, కథలు, కథానికలపై సొంత అవగాహన, స్వీయ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచుకోవాలి.
  • ప్రస్తుతం ప్రిపరేషన్ పరంగా తెలుగు కోసం అనుసరించాల్సిన సమయ పాలన?
    జవాబు:
    విద్యార్థులు నవంబర్ చివరికి లేదా డిసెంబర్ మొదటి వారానికి సిలబస్ పూర్తి చేసుకోవాలి. తర్వాత నుంచి పూర్తిగా రివిజన్‌కు కేటాయించాలి. రివిజన్ సమయంలో ఆయా పాఠ్యాంశాల్లోని సారాంశంపై సొంత అవగాహనతో పాటు అభిప్రాయాలను సొంత మాటల్లో వ్యక్తం చేయటం ప్రాక్టీస్ చేయాలి. కొత్త పరీక్షా విధానంలో అవగాహన - ప్రతిస్పందన పేరుతో విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి పొందిన నైపుణ్యాన్ని సొంత మాటల్లో చెప్పే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే డెరైక్ట్ ప్రశ్నలు కాకుండా ఒక పాఠ్యాంశాన్ని పేర్కొని దాని ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? లేదా దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అనే తరహాలో ప్రశ్నలు అడుగుతున్నారు.
  • ఇంగ్లిష్‌లో మంచి మార్కుల కోసం అనుసరించాల్సిన విధానం?
    జవాబు:
    మొత్తం ఎనిమిది యూనిట్లతో ఉన్న ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో ప్రతి యూనిట్‌కు సంబంధించి స్టోరీస్, ఎస్సేలు, నేరేటివ్స్ రాసే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. దాంతో పాటు వెర్బల్, నాన్-వెర్బల్ యాక్టివిటీస్‌గా పేర్కొన్న బార్ డయాగ్రమ్స్, పై చార్ట్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి యూనిట్ చివరన ఇచ్చిన స్వీయ మూల్యాంకన చెక్‌లిస్ట్‌ను తప్పనిసరిగా అనుసరించాలి.
  • ఇంగ్లిష్‌లో ముఖ్యమైన యూనిట్లు?
    జవాబు:
    ప్రస్తుత విధానంలో అన్ని యూనిట్లను ముఖ్యమైనవిగానే భావించాలి. అయితే పరీక్ష తీరులో మార్పు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు హ్యూమన్ రిలేషన్స్, సోషల్ ఇష్యూస్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, బయోడైవర్సిటీ యూనిట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల చిన్న, పెద్ద ప్రశ్నలకు సులభంగా సమాధానాలు రాయవచ్చు.
  • ఇంగ్లిష్ వ్యాకరణంలో ముఖ్యమైన విభాగాలు?
    జవాబు:
    రిపోర్టెడ్ స్పీచ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్, యూసేజ్ ఆఫ్ వెర్బ్స్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా వొకాబ్యులరీని పరీక్షించే ప్రశ్నలు లేదా బిట్స్ కూడా ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఆయా పదాలకు సంబంధించి సినానిమ్స్, యాంటానిమ్స్ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
  • వర్డ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి? వీటికి సంబంధించిన ప్రశ్నలు/ బిట్స్‌కు ఎలా సన్నద్ధం కావాలి?
    జవాబు:
    ఆయా పదాలను సందర్భాన్ని బట్టి సొంతంగా రాసే విధానం క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్. ఈ నేపథ్యంలో విద్యార్థులు పదాలు-అర్థాలు-వినియోగించే తీరుపై అవగాహన పొందాలి. ఉదాహరణకు.. గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్. వ్యక్తులు లేదా సందర్భాలకు అనుగుణంగా వాటికి సంబంధించి ఉన్న గుడ్ క్వాలిటీస్, బ్యాడ్ క్వాలిటీస్‌ను సొంతగా రాసే నైపుణ్యం పొందాలి.
  • స్పెల్లింగ్స్‌పై పట్టు కోసం ఏం చేయాలి?
    జవాబు:
    ప్రస్తుత పరీక్ష విధానంలో స్పెల్లింగ్ టెస్ట్‌కు రెండు మార్కులు కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆయా స్పెల్లింగ్స్ కోసం ప్రత్యేకంగా చిన్నపాటి డిక్షనరీలను వినియోగించాలి.
  • పేపర్-2 కోసం అనుసరించాల్సిన వ్యూహం?
    జవాబు:
    పార్ట్-ఎలో 30 మార్కులు; పార్ట్-బిలో 20 మార్కులు ఉండే పేపర్-2లో కొంత సాధన చేస్తే సులువుగానే మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. ప్రతి పాఠం చివరలో ఇచ్చే ప్రాక్టీస్ ప్రశ్నలను సాధన చేయాలి.
  • రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటే ఏంటి? ఇందులో మంచి మార్కులు పొందడం ఎలా?
    జవాబు:
    సప్లిమెంటరీ పుస్తకంలోని పాఠ్యాంశాల నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించి అయిదు ప్రశ్నలు అడుగుతారు. వీటి ఉద్దేశం విద్యార్థుల్లో అవగాహన స్థాయి, సందర్భాలు, పదాలు, ఆయా పదాల వినియోగం గురించి పరీక్షించడం. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠ్యాంశాలను చదువుతున్నప్పుడే అందులోని గ్రామర్, వెర్బ్, సెంటెన్స్ ఫార్మేషన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
  • న్యూస్ రిపోర్ట్ అంటే ఏంటి? ఇందులో అనుసరించాల్సిన విధానాలు?
    జవాబు:
    ఏదైనా ఒక సంఘటన ఇచ్చి సొంతగా నివేదిక రూపొందించమని అడగడమే న్యూస్ రిపోర్ట్. ఈ క్రమంలో విద్యార్థులు సరైన శీర్షిక (హెడింగ్), లీడ్ సెంటెన్స్, ఆ సంఘటనకు సంబంధించిన అంశాన్ని సొంతగా పోల్చగలిగే నైపుణ్యం, స్వీయ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ముగించాలి.
  • లెటర్ రైటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
    జవాబు:
    లెటర్ రైటింగ్‌లో పంక్చుయేషన్స్‌కు, సదరు లెటర్ ఎవరిని అడ్రెస్ చేస్తూ రాస్తున్నారో దానికి అనుగుణంగా సబ్జెక్ట్ లైన్ వంటివి ఉండేలా చూసుకోవాలి. అఫిషియల్ లెటర్, పర్సనల్ లెటర్, లెటర్ టు ది ఎడిటర్ ఇలా మూడు ముఖ్యమైనవిగా చెప్పొచ్చు.
  • నాన్ - వెర్బల్ యాక్టివిటీలో రాణించాలంటే?
    జవాబు:
    కొంత సమాచారాన్ని లేబుల్ లేదా డయాగ్రమ్ రూపంలో ఇచ్చి దాని ఆధారంగా సొంత విశ్లేషణకు ప్రాధాన్యం ఇచ్చే నాన్-వెర్బల్ యాక్టివిటీలో రాణించాలంటే ఆ లేబుల్ లేదా డేటాలోని సమాచారాన్ని సొంతగా విశ్లేషించే నైపుణ్యం కావాలి. బేసిక్ గ్రామర్‌పై పట్టు, సొంతగా వాక్యాలు రాసే నైపుణ్యం, ముఖ్యమైన పదాలను గుర్తించే నేర్పుతో దీన్ని సులువుగా పూర్తి చేయొచ్చు.
  • అన్-నోన్ ((UnKnown) ప్యాసేజ్‌లకు సమాధానం ఇచ్చేందుకు ఎలా సన్నద్ధం కావాలి?
    జవాబు:
    ముందుగా ప్యాసేజ్ పూర్తిగా చదవాలి. ప్యాసేజ్ ఉద్దేశాన్ని గుర్తించి దానికి అనుగుణంగా.. ప్యాసేజ్ కింద ఇచ్చే ప్రశ్నలను చూసుకుంటూ ప్యాసేజ్‌లో దానికి సంబంధించిన అంశాలను గుర్తించాలి. ఇలా చేస్తే అన్-నోన్ ప్యాసేజ్‌లో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.
  • హిందీ పేపర్ కోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలి?
    జవాబు:
    కొత్త సిలబస్‌లో హిందీ పేపర్‌లోని పాఠ్యాంశాలు, పరీక్ష శైలిలు విద్యార్థుల్లోని వాస్తవిక అవగాహన, ప్రతిస్పందనలను తెలుసుకునే విధంగా ఉన్నాయి. పాఠ్యాంశాలను చదువుతున్నప్పుడు ఆ పాఠ్యాంశం ముఖ్య ఉద్దేశం, సంబంధిత అంశం వాస్తవంగా ఎలా అన్వయించవచ్చు అనే భావనతో చదవడం వల్ల హిందీలో మంచి మార్కులు పొందవచ్చు.
  • మంచి మార్కులు పొందడానికి మార్గాలు?
    జవాబు:
    సెక్షన్-1లోని ఆధునిక పద్యభాగం, పఠిత గద్యాంశం, అపఠిత గద్యాంశం, అపఠిత పద్యాంశాలకు సంబంధించి ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఆయా ప్యాసేజ్‌ల ఉద్దేశం, ముఖ్య పదాలను గుర్తిస్తే దీనికి కేటాయించిన 20మార్కులను సులువుగా సొంతం చేసుకోవచ్చు.
  • గరిష్ట మార్కులు పొందేందుకు అవకాశం ఉన్న విభాగం?
    జవాబు:
    హిందీలో ప్రస్తుత సిలబస్ ప్రకారం గరిష్ట మార్కులు పొందేందుకు అవకాశం ఉన్న విభాగం సెక్షన్-4లో ఇచ్చే వ్యాసం. ఈ వ్యాసం పాఠ్య పుస్తకం నుంచి కాకుండా సాధారణ అంశం నుంచి అడుగుతారు. కాబట్టి సొంతగా అభిప్రాయం ఇవ్వగలిగే నైపుణ్యం ఉంటే దీనికి కేటాయించిన పది మార్కుల్లో సులువుగా ఎనిమిది మార్కులను సొంతం చేసుకోవచ్చు.
  • హిందీ ఆబ్జెక్టివ్ పేపర్‌లో మంచి మార్కులు పొందాలంటే?
    జవాబు:
    ప్రతి పాఠ్యాంశం చివర ఇచ్చిన ఎక్సర్‌సైజ్‌లను, ప్రశ్నలను సాధన చేస్తే ఆబ్జెక్టివ్ పేపర్‌లోని 25 మార్కులకు 15 మార్కులను పొందొచ్చు.
  • పీఎస్ పేపర్ కోసం ఎలా శ్రమించాలి?
    జవాబు:
    భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి మొత్తం 14 అధ్యాయాలున్న పీఎస్ పేపర్‌లో మంచి మార్కులు దిశగా ప్రతి అధ్యాయం చివరన ఇచ్చిన ఎక్సర్‌సైజ్ కొశ్చన్స్‌ను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి.
  • ఫిజిక్స్‌లో ముఖ్యమైన పాఠ్యాంశాలు?
    జవాబు:
    కాంతి వక్రీభవనం, వక్ర, సమ, ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే గతంలో మాదిరి యూనిట్ వారీ వెయిటేజీ లేదు కాబట్టి అన్ని చాప్టర్లు చదవడం మేలు. ఫిజిక్స్ సెక్షన్-2లో ఉష్ణం, విద్యుత్ ప్రవాహం, విద్యుదయస్కాంతత్వం పాఠ్యాంశాలను తప్పనిసరిగా చదవాలి.
  • కెమిస్ట్రీలో తప్పనిసరిగా చదవాల్సిన పాఠ్యాంశాలు?
    జవాబు:
    రసాయన చర్యలు- సమీకరణాలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, మూలకాల వర్గీకరణ-ఆవర్తన పట్టిక, లోహ సంగ్రహణ శాస్త్రాలను బాగా అధ్యయనం చేయాలి.
  • పీఎస్ పేపర్‌లో మంచి మార్కుల సాధనకు ఉపయోగపడే అంశాలు?
    జవాబు:
    ప్రతి అంశానికి సంబంధించి బేధాలు, గణనలు, ఉపయోగాలు, ఉత్పాదనలపై పూర్తి అవగాహన సాధిస్తే మంచి మార్కులు పొందవచ్చు.
  • ప్రతి అధ్యాయానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలు?
    జవాబు:
    ప్రతి అధ్యాయానికి సంబంధించి నిర్వచనాలు, సూత్రాలు, ప్రాథమిక భావనలు నేర్చుకోవడం వల్ల లఘు, బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది. దీంతో పాటు విషయ అవగాహన ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయిస్తే పరీక్షలో మంచి స్కోర్ సాధించవచ్చు.
  • పట చిత్రం విభాగంలో మంచి మార్కులు పొందాలంటే?
    జవాబు:
    పటం గీయటంతో పాటు భాగాలను గుర్తించగలిగే నైపుణ్యంతో పట చిత్రం విభాగంలో మంచి మార్కులు లభిస్తాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఫిజిక్స్‌కు సంబంధించి గాజు దిమ్మెలో కాంతి వక్రీభవనం, మానవుని కన్ను-నిర్మాణం, విద్యుత్ మోటార్, విద్యుత్ జనరేటర్ పట చిత్రాలను; అదే విధంగా కెమిస్ట్రీకి సంబంధించి నీటి విద్యుత్ విశ్లేషణను చూపే పటం, నీటిలో కఠిన ఆమ్ల ద్రావణం, ఆర్బిటాళ్లు-ఆకృతులు, బ్లాస్ట్ కొలిమి పటాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
  • ఎన్‌ఎస్ పేపర్‌లో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన చాప్టర్లు?
    జవాబు:
    శ్వాస క్రియాయాంత్రికం, డయాలసిస్, హృదయం పనితీరు, అనియంత్రిత వ్యవస్థలు, మెదడు పనితీరు, మెండల్ సిద్ధాంతాలు, డార్విన్ పరిణామ వాదం, ఆవరణ వ్యవస్థలు, కిరణజన్య సంయోగ క్రియ జరిగే తీరు, జీవావరణ పిరమిడ్‌లు, మొక్కలలో హార్మోన్, జీవక్రియలలో సమన్వయం వంటి పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • మంచి మార్కుల సాధనకు ఉపయోగపడే మార్గాలు?
    జవాబు:
    పాఠ్యాంశాలను విశ్లేషిస్తూ చదవడం, ఫ్లో చార్టులు, బ్లాక్ డయాగ్రమ్‌లు రూపొందించుకోవడం చేయాలి. అదే విధంగా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి కీలక భావనలను చదవాలి.
  • డయాగ్రమ్స్‌ను ప్రాక్టీస్ చేయాల్సిన విధానం?
    జవాబు:
    డయాగ్రమ్స్‌ను కేవలం భాగాలు గుర్తించడానికే పరిమితం కాకుండా అన్ని కోణాల్లో ప్రాక్టీస్ చేయాలి. కారణం పరీక్షలో ఒక డయాగ్రమ్‌ను ఇచ్చి భాగాలు గుర్తించమని అడిగే ప్రశ్నలే కాకుండా.. ఒక అంశం పేర్కొని దానికి సంబంధించి డయాగ్రమ్ రూపొందించమని ప్రశ్నలు అడగవచ్చు. కాబట్టి విద్యార్థులు ఒక అంశానికి సంబంధించి సొంతంగా డయాగ్రమ్ రూపొందించడం నుంచి ఆయా భాగాల వాస్తవ ప్రాముఖ్యత వరకు అన్నిటిపై అవగాహన పొందేలా ప్రాక్టీస్ చేయాలి.
  • ప్రయోగ సంబంధ ప్రశ్నల ప్రాముఖ్యత, వాటి ప్రిపరేషన్‌కు అనుసరించాల్సిన విధానం?
    జవాబు:
    ప్రయోగాలకు సంబంధించి అడిగే ప్రశ్నల్లో ప్రయోగ నిర్వచనం అడగడమే కాకుండా ప్రయోగ నిర్వహణ తీరు, అవసరమైన పరికరాలు, ఆ ప్రయోగ ఫలితం గురించి తెలపమనడం వంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. దీనికి అనుగుణంగా కేవలం ప్రయోగం చేయడానికే పరిమితం కాకూడదు.
  • మ్యాథమెటిక్స్‌లో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు?
    జవాబు:
    పేపర్-1, పేపర్-2 రెండిటికీ కలిపి ఏడు చాప్టర్ల చొప్పున 14 చాప్టర్లు ఉన్న మ్యాథమెటిక్స్‌లో ప్రస్తుత విధానం ప్రకారం అన్ని చాప్టర్లు ముఖ్యమైనవే. ఈ క్రమంలో పేపర్-1లో వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చర రాశులలో రేఖీయ సమీకరణాల జత, వర్గ సమీకరణాలు, శ్రేఢులు, నిరూపక రేఖాగణితం అధ్యాయాలను; పేపర్-2లో సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శ రేఖలు, ఛేదన రేఖలు, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత సాంఖ్యక శాస్త్రాలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు.
  • మ్యాథమెటిక్స్‌లో మంచి మార్కుల సాధనకు వ్యూహాలు?
    జవాబు:
    ప్రతి అధ్యాయానికి సంబంధించి నిర్వచనాలు, సూత్రాలను ఒక చోట పొందుపర్చుకోవాలి. ప్రతి అధ్యాయంలోని ‘ఇవి చేయండి’, ‘ప్రయత్నించండి’ అని ఇచ్చిన సమస్యలను కచ్చితంగా సాధన చేయాలి.
  • మ్యాథమెటిక్స్‌ను క్లిష్టంగా భావించే విద్యార్థులు ఎలా ముందడుగు వేయాలి?
    జవాబు:
    సాధారణ విద్యార్థులు ముందుగా సులువైన అధ్యాయాలను నేర్చుకోవాలి. ఈ క్రమంలో పేపర్-1లో వాస్తవ సంఖ్యలు, సమితులు, రేఖీయ సమీకరణాల జత అధ్యాయాలలోని గ్రాఫ్ సమస్యలను; పేపర్-2లో సంభావ్యత, సాంఖ్యక శాస్త్రం, త్రికోణమితి, క్షేత్రిమితిలోని ముఖ్యమైన సమస్యలను ప్రాక్టీస్ చేస్తే సాధారణ విద్యార్థులు కూడా మంచి మార్కులు పొందొచ్చు.
  • ప్రిపరేషన్ పరంగా సమయ పాలన ఎలా ఉండాలి?
    జవాబు:
    విద్యార్థులు డిసెంబర్ రెండో వారానికల్లా మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ పూర్తి చేసుకోవాలి. తర్వాత సమయం రివిజన్‌కు కేటాయించాలి. కనీసం మూడుసార్లు రివిజన్ చేసే విధంగా సమయం కేటాయించుకోవాలి. అంతేకాకుండా జనవరి నుంచి మార్చి వరకు కనీసం మూడు లేదా నాలుగు ప్రీ-ఫైనల్ టెస్ట్‌లు రాసి వాటిలో తమ ప్రదర్శన స్థాయిపై అవగాహన ఏర్పరచుకోవాలి.
  • సోషల్ స్టడీస్ పేపర్‌లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు?
    జవాబు:
    సోషల్ స్టడీస్‌కి సంబంధించి పేపర్-1 కంటే పేపర్-2 (హిస్టరీ, సివిక్స్) కొంత క్లిష్టం కాబట్టి ముందుగా దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పేపర్ వారీగా పరిశీలిస్తే.. పేపర్-1 (జాగ్రఫీ, ఎకనామిక్స్)లో భారతదేశం-భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి-ఆదాయం, సుస్థిరాభివృద్ధి వంటి పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పేపర్-2లో భారత జాతీయోద్యమ చరిత్ర, రాజ్యాంగ నిర్మాణం, సమకాలీన సామాజిక ఉద్యమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • జాగ్రఫీలో మంచి మార్కులు పొందాలంటే?
    జవాబు:
    ఇందులోని పాఠ్యాంశాలను వాస్తవ పరిస్థితులతో అన్వయించుకుంటూ చదవాలి. అదే విధంగా అట్లాస్‌ను ఉపయోగిస్తూ ప్రిపరేషన్ సాగిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
  • సోషల్ స్టడీస్‌లో రెండు పేపర్లలో మంచి మార్కులు పొందడానికి మార్గాలు?
    జవాబు:
    పేపర్-1లో అన్ని చాప్టర్లకు సంబంధించి గ్రాఫ్, వలయ గ్రాఫ్‌లను, పట్టికలను పరిశీలించి గుర్తు పెట్టుకోవాలి. మానవాభివృద్ధి సూచికలను అధ్యయనం చేయాలి. పేపర్-2లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించాలి.
  • పాఠ్యాంశాలపై సులభంగా అవగాహన పొందేందుకు ఎలాంటి అధ్యయనం అవసరం?
    జవాబు:
    ప్రతి అధ్యాయాన్ని అర్థం చేసుకొని అందులోని ముఖ్య సమాచారాన్ని క్రోఢీకరించుకోవాలి. దానికి అనుగుణంగా సొంత విశ్లేషణతో చదివితే అన్ని పాఠ్యాంశాలపై సులభంగా అవగాహన లభిస్తుంది. అదే విధంగా రేఖాచిత్ర ఆధారిత, పట ఆధారిత, గ్రాఫ్ ఆధారిత అంశాలపై అవగాహన పెంచుకుంటే మరిన్ని మార్కులు పొందవచ్చు.
Published date : 03 Dec 2015 05:54PM

Photo Stories