Skip to main content

ఆంధ్ర ప్రదేశ్ .. టెన్త్ మ్యాథ్స్‌లో ‘పది’ గ్రేడ్ పాయింట్లు సాధించండి ఇలా..

త్వరలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రివిజన్‌కు 15 రోజులు కేటాయిస్తే, మిగిలిన సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
Bavitha పాఠ్యపుస్తకం, సిలబస్ మారినప్పటికీ పాఠ్యాంశాల్లోని భావనలపై పట్టు సాధిస్తే ఏ విధంగా ప్రశ్న వచ్చినా సమాధానం రాయొచ్చు. పేపర్-1, పేపర్-2ల్లో ముఖ్య అధ్యాయాలు, తేలికైన అంశాలు, ఏ అధ్యాయం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వంటివి తెలుసుకొని ప్రిపరేషన్ కొనసాగించడం ప్రధానం.
  • విద్యార్థులు మొదట కొత్తగా విడుదల చేసిన ప్రశ్నపత్రాలను పరిశీలించి, అధ్యాయాల వారీగా వెయిటేజీని గుర్తించి పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలి.
  • మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే గణితం కష్టమైన సబ్జెక్టు, కానీ అధిక మార్కులు పొందేందుకు అవకాశమున్న సబ్జెక్టు కాబట్టి దీనికి రోజుకు కనీసం రెండు గంటలు కేటాయించాలి.
  • ప్రస్తుత పరీక్ష విధానం (నిరంతర, సమగ్ర మూల్యాంకనం)లో ఒక భావనకు సంబంధించిన ప్రశ్నలు అడిగే విధానంపై అవగాహన పెంపొందించుకొని, అధ్యాయాల వారీగా సిద్ధమవాలి.
  • సీసీఈ పద్ధతిపై అవగాహనకు గత సీబీఎస్‌ఈ ప్రశ్నపత్రాలను, ఎస్‌సీఈఆర్‌టీ విడుదల చేసిన ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
  • ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
వ్యాసరూప, స్వల్ప సమాధాన ప్రశ్నలు:
వ్యాసరూప ప్రశ్నలకు ఎక్కువ మార్కులు ఉంటాయి కాబట్టి అధ్యాయాల వారీగా ఈ తరహా ప్రశ్నలను గుర్తించి, వాటిని సాధించాలి. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా పేపర్-1లోని బహుపదులు, నిరూపక రేఖాగణితం, శ్రేఢులు; పేపర్-2లోని సరూప త్రిభుజాల్లోని సిద్ధాంతాలు, త్రికోణమితి అనువర్తనాలు, క్షేత్రమితి అధ్యాయాల నుంచి వస్తాయి. వాస్తవ సంఖ్యలు, సమితులు, త్రికోణమితి, సాంఖ్యకశాస్త్రం, సంభావ్యత అధ్యాయాల్లోని వ్యాసరూప ప్రశ్నలు సులువైనవి. బహుపదులు, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత నుంచి ఇచ్చే గ్రాఫ్ సమస్యలు, రేఖాగణితంలోని నిర్మాణాలు, సాంఖ్యక శాస్త్రంలోని ఓజీవ్ వక్రం గ్రాఫ్ సమస్యలు కచ్చితంగా వచ్చే ప్రశ్నలు. తొలుత వ్యాసరూప ప్రశ్నల ప్రిపరేషన్‌ను పూర్తిచేయాలి.
  • అధిక మార్కుల సాధనలో వ్యాసరూప ప్రశ్నలతో పాటు స్వల్ప సమాధాన (1 మార్కు, రెండు మార్కులు) ప్రశ్నలు కీలకం. రెండు పేపర్లలో ఇలాంటి ప్రశ్నలకు 28 మార్కులు ఉంటాయి. అందువల్ల వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి.
బిట్స్ ప్రిపరేషన్:
విద్యార్థులు పది గ్రేడ్ పాయింట్లు సాధించడంలో బిట్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. బిట్స్ ప్రిపరేషన్ ఒక మార్కు ప్రశ్నలకు కూడా ఉపయోగపడుతుంది. మొత్తం రెండు పేపర్లలో 30 మార్కులకు బిట్లు ఉంటాయి. పాఠ్యపుస్తకంలోని అన్ని బిట్లను ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుంచి బిట్లను బాగా ప్రాక్టీస్ చేస్తే పబ్లిక్ పరీక్షలతో పాటు పాలిటెక్నిక్, ఏపీఆర్‌జేసీ వంటి పరీక్షల్లో మంచి స్కోర్ సాధించవచ్చు.

సూత్రాలను గుర్తుంచుకోవాలంటే..
గణితం అనేది సూత్రాలపై ఆధారపడిన సబ్జెక్టు. సూత్రాలు నేర్చుకొని, గుర్తుంచుకోకుంటే సమస్యల్ని సాధించలేం. కాబట్టి అధ్యాయాల వారీగా సూత్రాలను ఒకచోట రాసుకొని, పట్టుసాధించాలి. ఏ సమస్యకు ఏ సూత్రం ఉపయోగించాలో తెలుసుకోవాలి.

సాధారణ విద్యార్థుల ప్రిపరేషన్:
సాధారణ విద్యార్థులకు గణితం సబ్జెక్టు మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే కష్టంగా ఉంటుంది. వీరు కొన్ని ప్రశ్నలను కచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే తేలిగ్గా ఉత్తీర్ణులవుతారు. వీలైతే 50 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. పేపర్-1లో బహుపదులు, రెండు చలరాశుల్లో రేఖీయ సమీకరణాల జత నుంచి ఇచ్చే గ్రాఫ్ సమస్యలు, సరూప త్రిభుజాలు, వృత్తాల స్పర్శ రేఖలు, ఖండన రేఖల నుంచి ఇచ్చే నిర్మాణం సమస్య, సాంఖ్యక శాస్త్రం నుంచి ఇచ్చే గ్రాఫ్ సమస్య (ఓజీవ్ వక్రం) కచ్చితంగా ఇచ్చే సమస్యలు, వీటిని సులువుగా నేర్చుకోవచ్చు.

10 గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే:
92-100 మార్కులు వస్తే పది గ్రేడ్ పాయింట్లు సాధించినట్లే. కాబట్టి కొన్ని సమస్యల్ని (8 మార్కుల వరకు) సాధించలేకపోయినా 10 గ్రేడ్ పాయింట్లు తెచ్చుకోవచ్చు.
  • పరీక్షలకు 15 రోజులు ముందుగానే సిలబస్ పూర్తిచేయాలి. వీలైనన్ని ఎక్కువసార్లు (కనీసం 3లేదా 4 సార్లు) రివిజన్ చేయడం వల్ల సబ్జెక్టుపై పూర్తిస్థాయి పట్టు సాధించవచ్చు. దీనివల్ల ప్రశ్నలు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ తేలిగ్గా సమస్యలకు సమాధానాలు ఇవ్వొచ్చు.
  • బిట్స్ కోసం పదో తరగతి పాఠ్యపుస్తకాలతో పాటు, ఏపీఆర్‌జేసీ, పాలిటెక్నిక్ ప్రశ్నపత్రాల్లోని బిట్స్‌ను కూడా ప్రాక్టీస్ చేయాలి.
ఎలా రాయాలి?
ఏడాది కాలంలో నేర్చుకున్న విషయాలు ఒక ఎత్తయితే, ఆ నేర్చుకున్న అంశాల ఆధారంగా క్రమపద్ధతిలో సమాధానాలు ఇవ్వడం మరో ఎత్తు. ఎంత ప్రతిభ ఉన్న విద్యార్థి అయినా సమాధానాలు సరిగా రాయకపోతే మార్కులు కోల్పోయే ప్రమాదముంది. చక్కటి దస్తూరితో అడిగిన మేరకు సమాధానం రాయాలి.
  • బాగా తెలిసిన ప్రశ్నలకు ముందు సమాధానాలు రాయాలి. కొట్టివేతలు లేకుండా చూడాలి.
  • ముఖ్యమైన హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్‌ను అండర్‌లైన్ చేయాలి. ప్రశ్నల సంఖ్యను స్పష్టంగా రాయాలి. సమాధానానికి, సమాధానానికి మధ్య కొంత జాగా వదిలేయాలి.
  • మొదట వ్యాసరూప ప్రశ్నలు, తర్వాత రెండు మార్కులు, ఆ తర్వాత ఒక మార్కు ప్రశ్నలకు సమాధానాలు రాస్తే మంచిది. చివర్లో అదనపు ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు.
  • పటాలు, గ్రాఫ్‌లు చక్కగా వేయాలి. చిత్తుపనికి మార్జిన్‌ను ఉపయోగించుకోవాలి.
Prepared by:
Y.Vanamraju,
Mathematics Faculty.
ZPHS, Nandikotkur.
Published date : 12 Feb 2015 03:20PM

Photo Stories