AP Summative-1 Exams : పకడ్బందీగా సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ–1) పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ–1) పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆ ర్టీ) రూపొందించిన ఉమ్మడి ప్రశ్నపత్రంతోనే అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్ విభాగంలో 182 ఉన్నత, 80 ప్రాథమికోన్నత పాఠశాలలకు జిల్లా ఉమ్మడి పరీక్ష మండలి (డీసీఈబీ) ద్వారా ప్రశ్నపత్రాల్ని పంపిణీ చేస్తున్నారు. ప్రైవేటు విభాగంలో 290 ఉన్నత, 201 ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు సైతం డీసీఈబీ ముద్రించిన ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు 987 ప్రాథమిక పాఠశాలలకు ప్రశ్న పత్రాలు డీసీఈబీ ద్వారా సరఫరా చేస్తున్నారు.
Also Read : Success Stroy : నాకు రోజుకు రూ.72 లక్షల జీతం.. నేను చేసే పని ఇదే..!
ప్రభుత్వ రూపొందించిన అకడమిక్ కేలండర్‌కు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు విద్యార్థులకు ఉమ్మడి ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రశ్నపత్రాల్ని డీసీఈబీ ద్వారా ముద్రించి ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా సరఫరా చేస్తుండగా, ప్రైవేటు పాఠశాలల నుంచి ముద్రణ, రవాణా ఖర్చుల్ని ఒక్కో విద్యార్థికీ నామమాత్రపు రుసుం నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ప్రశ్న పత్రాల్ని మండలాల్లోని స్కూల్ కాంప్లెక్స్‌లకు పంపి, ఎంఈవోల పర్యవేక్షణలో భద్రపరుస్తున్నారు. ప్రతి రోజూ పరీక్షకు గంట ముందుగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పంపుతున్నారు.
–జి.లలిత ప్రసాద్,
డీసీఈబీ కార్యదర్శి, గుంటూరు