Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా చర్యలు ....పరీక్ష కేంద్రానికి ఉదయం 8.45 గంటలకే చేరుకోవాలని...
తుమ్మపాల: జిల్లాలో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రవిపట్ట్ శెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో వెబ్ ఎక్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 21,250 మంది హాజరుకానున్నారని, వీరిలో 10,873 మంది బాలురు, బాలికలు 10,386 మంది రెగ్యులర్ విద్యార్థులు, 2,324 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. 108 పరీక్ష కేంద్రాల్లో రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
పరీక్ష కేంద్రానికి ఉదయం 8.45 గంటలకే చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా హాజరయ్యే విద్యార్థులకు కేంద్రంలోకి ప్రవేశం లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఈ పరీక్షలను ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలని, అధికారులు అప్రమత్తతో ఉండాలని, ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలను మరోసారి తనిఖీలు నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, గాడ్జేట్లు, ఎలక్ట్రిక్ పరికరాలు అనుమతించబోమన్నారు. డీఈవో సహా చీఫ్ సూపరింటెండెంట్ ఇతర అధికారులు సైతం సెల్‌ఫోన్లను, పేజర్లు, కాల్కిలేటర్లు వెంట తీసుకురావద్దన్నారు. అక్రమాలకు పాల్పడితే బాధితులపై మూడేళ్ల జైలుశిక్ష పడుతుందని హెచ్చరించారు. అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు అత్యవసర వైద్య పరికరాలు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
Also Read : పరీక్ష హాల్‌లో ఒత్తిడికి గురికావొద్దు... ఈ చిట్కాలు పాటించి ఒత్తిడిని జయించండి!
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, బయట వ్యక్తులకు అనుమతి లేదన్నారు. మాస్ కాపీయింగ్‌పై ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలని, హాల్‌టికెట్లు ఉన్న విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ కేవీ మురళీకృష్ణ, డీఈవో వెంకటలక్ష్మమ్మ, డీఆర్వో దయానిధి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.