Tenth Class Public Exams 2024:మెలకువలతో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉత్తమ గ్రేడ్....విద్యార్థులకు నిపుణుల సూచనలు
కడప /మదనపల్లె : పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పదింతల ఉత్సాహంతో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్కుల సాధనకు చదవడం ఎంత ముఖ్యమో చక్కటి చేతిరాత కీలకం. సరైన సమాధానం రాసినా...పేపరు దిద్దేవారికి అర్థమైనప్పుడే నూరు శాతం మార్కులు సాధించవచ్చని గతంలో పరీక్ష పత్రాలను దిద్దిన ఉపాధ్యాయులు చెబుతున్నారు.పెన్‌టిప్‌ను దూరంగా పట్టుకుని రాస్తే అక్షరాలు గుండ్రంగా వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
సూచనలు..
● జవాబులను సూటిగా రాయాలి
● మనం రాసే తీరు పరీక్ష పేపర్ దిద్దేవారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు
● వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి
● చేతి రాత గుండ్రంగా ఉండటంతోపాటు ఆర్థమయ్యేలా ఉండాలి
అక్షరం బాగుంటే విజయం మీదే..
విద్యార్థి చేతి రాతను బట్టి సబ్జెక్టులో అతని అవగాహన స్థాయిని అంచనా వేయవచ్చు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎంత తెలివైన వారనేది జవాబు పత్రాలు దిద్దేవారికి తెలియదు. వారు రాసే తీరు అక్షరాల కూర్పును బట్టి వారి ప్రతిభను అంచానా వేస్తారు.అందమైన దస్తూరి చూసే వారిని ఇట్టే అకట్టుకుంటుంది. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారి మనసుకు హత్తుకుని మార్కులు వేసేలా ప్రేరేపిస్తుంది.
ఇలా రాస్తే మంచిది..
● ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకున్నాకే రాయాలి.
● సమాధానపత్రంలో పేజీకి 15– 16 లైన్లు ఉండాలి.
● పేజీకి పైన కింద మార్జిన్ విడిచి పెట్టాలి.
● మొదటి వరుసలో ఎంత బాగా రాశారో చివరి వరకు అదే దస్తూరి కొనసాగించాలి
● గణితంలో అయితే అంకెలు స్పష్టంగా ఉండాలి. కొట్టివేతలు వస్తే మార్కులు తగ్గుతాయి. గ్రాఫ్‌ను చక్కగా గీయాలి.
● సైన్స్‌లో బొమ్మలు గీసేటప్పుడు కష్టమైన వాటిని వదిలేసి సులభంగా ఉన్న వాటిని అకర్షణీయంగా గీయాలి,
● సాంఘికశాస్త్రం సబ్జెక్టులో సమాధానాలను పాయింట్ల వారీగా రాయాలి. మ్యాప్‌లో అడిగిన వాటిని స్పష్టంగా ఉర్తించాలి. శీర్షికలు, ఉపకీర్షికలు కింద అండర్‌లైన్ వేయాలి.
● మంచి పెన్నులను ఉపయోగించాలి. అక్షరాలు గుండ్రంగా ఉండేలా చూసుకోవాలి
విద్యార్థులు చేసే పొరపాట్లు..
కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25–30 లైన్లు రాస్తారు. గజిబిజిగా ఉంటే జవాబు పత్రం చూడగానే ఆకట్టుకోదు. అందువల్ల ఒక్కోపేజీలో 16–18 లైన్లకు మంచకుండా చూడాలి. లైన్లు సమాంతరగా ఉండాలి.పదాలు ఒకేలైన్‌లో వచ్చేలా రాయాలి. చాలా మంది విద్యార్థులు బాగా ఒత్తిపట్టి రాస్తుంటారు. దీంతో పేజీ రెండో వైపు ఆ అక్షరాలు కనిపిస్తూ చివరికి జవాబుపత్రం గజిబిజిగా తయారవుతుంది.చాలా మంది అంకెలను సరిగా రాయరు. 2 అంకెను ఇంగ్లీషు జెడ్ తరహాలో, 5ను ఎస్ తరహాలో, 0 ను 6 తరహాలో రాస్తుంటారు. ఫలితంగా రావాల్సిన మార్కులు తగ్గిపోతాయి.