Skip to main content

Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం...హాల్‌టికెట్‌ చూపితే

పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం...హాల్‌టికెట్‌ చూపితే
Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం...హాల్‌టికెట్‌ చూపితే
Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితం...హాల్‌టికెట్‌ చూపితే

అనంతపురం ఎడ్యుకేషన్‌: హాల్‌టికెట్‌ చూపి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పదో తరగతి విద్యార్థులకు డీఈఓ వరలక్ష్మీ సూచించారు. బుధవారం డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు 30న ముగుస్తాయన్నారు. రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 142 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 40,063 మంది రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ప్రతి కేంద్రంలో కనీస మౌలిక వసతులు కల్పించామన్నారు. తాగునీరు, ఫర్నీచర్‌, లైటింగ్‌ ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. రెవెన్యూ, విద్యాశాఖ, పోలీసు అధికారులతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశామన్నారు.

అప్రమత్తంగా ఉండాలి..

పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఈఓ ఆదేశించారు. ఇన్విజిలేటర్లు విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. విద్యార్థి హాల్‌టికెట్‌ను పరిశీలించి ఏ మీడియం పరీక్ష రాస్తున్నారో అందుకు సంబంధించిన ప్రశ్నపత్రం ఇవ్వాలన్నారు. పొరబాటున తప్పు ప్రశ్నపత్రం ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌

జిల్లా అబ్జర్వర్‌, ఆర్జేడీ రాఘవరెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మండలానికి మండల విద్యాశాఖ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. వారి మండలంలోని సెంటర్లలో ఏ చిన్న సమస్య జరిగినా వారిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. ఎక్కువ సెంటర్లు ఉన్న మండలాల్లో ఎంఈఓ–2 కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. 142 మంది సీఎస్‌లు, 142 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 65 మంది అడిషనల్‌ డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, దాదాపు 1700 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ప్రభుత్వం ఈసారి ప్రశ్నపత్రాల తయారీలో కొత్త టెక్నాలజీ అమలు చేసిందన్నారు. ఎక్కడి నుంచైనా ఫొటో తీసినా, జిరాక్స్‌ చేయించినా అది ఏ ఊరు, ఏ కేంద్రం, ఏ విద్యార్థికి కేటాయించిన ప్రశ్నపత్రమో తెలిసిపోతుందన్నారు.

Also Read :   Model Papers 2024

హెల్ప్‌లైన్‌ నంబర్ల ఏర్పాటు

పరీక్షల సమయంలో ఇబ్బంది తలెత్తినా, అనుమానాలు ఉన్నా విద్యార్థులు, తల్లిదండ్రులు నివృత్తి చేసుకునేందుకు హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. 94405 94773, 94415 75778 నంబర్లకు ఫోన్‌ చేయొచ్చని వెల్లడించారు. విద్యార్థులు 8.45 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందునాయక్‌ తెలిపారు. సెల్‌ఫోన్లు అనుమతించమని స్పష్టం చేశారు. పెన్నులు, పెన్సిళ్లు విద్యార్థులు తెచ్చుకోవాలన్నారు. ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని సూచించారు.

18 నుంచి ఓపెన్‌ పరీక్షలు

సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్‌) స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు 18 నుంచి ప్రారంభమవుతాయని డీఈఓ వరలక్ష్మీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 3,749 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి పురుషోత్తంబాబు, సూపరింటెండెంట్‌ సరళ పాల్గొన్నారు.

 

Published date : 14 Mar 2024 03:29PM

Photo Stories