Skip to main content

ప్రాణవాయువు అంటే ఏమిటి?

Tenth Classప్రాణవాయువు (ఆక్సిజన్) లేకపోతే మనుషులు, జంతువులు, మొక్కలు, చెట్లు, ఇతర ఏ జీవరాసులూ జీవించలేవు. ఆక్సిజన్ అనేది ఒక వాయువు. దీనిని కార్ల్ విల్‌హెల్మ్ షీలే 1773లో కనుగొన్నాడు. అయితే ప్రీస్ల్టీ రచించిన పుస్తకం 1774లో ముందుగా రావడంతో ఆయనే ఈ వాయువును కనుగొన్నట్లుగా చెబుతారు. ఆక్సిజన్ అనే పదాన్ని మాత్రం ఆంటోనీ లావోసియర్ మొదటిసారిగా వాడాడు.

వాతావరణంలో వున్న గాలిలో 21% ప్రాణవాయువు, 78% నత్రజని, మిగిలిన ఒకశాతం ఇతర వాయువులు ఉంటాయి. భూమిలో 50% వరకూ ఇది లోహపు ఆక్సైడ్‌ల రూపంలో లభిస్తుంది. 185 డిగ్రీల సెల్సియస్ వద్ద ఆక్సిజన్ ను ద్రవంగా మార్చవచ్చు. ద్రవరూపంలో ఇది లేత నీలిరంగులో వుంటుంది. ఆక్సిజన్‌ను 219 డిగ్రీల సెల్సియస్ వద్ద ఘనపదార్థంగా మార్చవచ్చు. ప్రయోగశాలలో పొటాషియం క్లోరైడ్‌ను మాంగనీస్ డయాక్సైడ్‌ను కలిపి, వేడిచేసి ప్రాణవాయువును తయారు చేయవచ్చు. వాతావరణంనుండి గాలిని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తే ఆక్సిజన్ వస్తుంది. సాధారణ వాతావరణ ఒత్తిడి కంటే 200 రెట్లు ఒత్తిడిని గాలి మీద కలుగజేసి ఒక సన్నని రంధ్రం ద్వారా పంపుతారు. ఒక్కసారిగా ఒత్తిడి తగ్గిపోయేసరికి గాలి ద్రవీభవిస్తుంది. దీనినుండి నత్రజని వాయువును ఒక ప్రత్యేక పద్ధతిలో వేరు చేస్తారు. అపుడు ద్రవీభవించిన ప్రాణవాయువు మిగిలిపోతుంది.
Published date : 13 Nov 2013 10:25AM

Photo Stories