UPSC IES/ISS Notification 2024: IES/ISS పోస్టుల వివరాలు.. సబ్జెక్ట్ పేపర్లకు సన్నద్ధత ఇలా..
- మొత్తం 48 పోస్ట్‌లతో ఐఈఎస్/ ఐఎస్‌ఎస్ నోటిఫికేషన్
- రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక
- ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌లో పీజీ, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు
ఐఈఎస్/ఐఎస్‌ఎస్
ఐఈఎస్.. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్. ఐఎస్‌ఎస్..ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల ఆర్థిక సంబంధ కార్యకలాపాల సమర్థ నిర్వహణకు అవసరమైన నిపుణుల ఎంపికకు యూపీఎస్సీ ప్రతిఏటా నిర్వహించే పరీక్ష.. ఐఈఎస్/ఐఎస్‌ఎస్.
మొత్తం 48 పోస్ట్‌లు
యూపీఎస్‌సీ తాజాగా విడుదల చేసిన ఐఈఎస్/ఐఎస్‌ఎస్–2024 నోటిఫికేషన్ ద్వారా రెండు విభాగాల్లో కలిపి మొత్తం 48 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌లో 18 పోస్ట్‌లు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌లో 30 పోస్ట్‌లు ఉన్నాయి.
చదవండి: UPSC Latest Notification 2024: UPSC - IES/ISS Exam 2024 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
విద్యార్హత
- ఐఈఎస్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి.
- ఐఎస్‌ఎస్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లేదా ఈ సబ్జెక్ట్‌లు స్పెషలైజేషన్‌గా పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు
2024, ఆగస్టు 1 నాటికి అభ్యర్థి వయసు 21–30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
రెండు దశల ఎంపిక ప్రక్రియ
ఐఈఎస్, ఐఎస్‌ఎస్ ఎంపిక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో వేయి మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
రాత పరీక్షలు వేర్వేరుగా
ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్ష ఐఈఎస్, ఐఎస్‌ఎస్ అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటుంది.
వెయి మార్కులకు ఐఈఎస్ రాత పరీక్ష
ఐఈఎస్ రాత పరీక్ష ఆరు పేపర్లలో మొత్తం 1,000 మార్కులకు జరుగుతుంది. అవి.. పేపర్–1 జనరల్ ఇంగ్లిష్ 100 మార్కులు, పేపర్–2 జనరల్ స్టడీస్ 100 మార్కులు, పేపర్–3 జనరల్ ఎకనామిక్స్–1, 200 మార్కులు; పేపర్–4 జనరల్ ఎకనామిక్స్–2, 200 మార్కులు; పేపర్–5 జనరల్ ఎకనామిక్స్–3, 200 మార్కులు; పేపర్–6 ఇండియన్ ఎకనామిక్స్ 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఐఈఎస్ పరీక్ష పేపర్లన్నీ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటాయి. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం మూడు గంటలు.
ఐఎస్‌ఎస్.. రాత పరీక్ష ఇలా
ఐఈఎస్‌తో పోల్చితే.. ఐఎస్‌ఎస్ రాత పరీక్ష కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ప్రశ్నలతో పేపర్లు ఉంటాయి. అవి..పేపర్–1 జనరల్ ఇంగ్లిష్–100 మార్కులు, పేపర్–2 జనరల్ స్టడీస్–100 మార్కులు, పేపర్–3 స్టాటిస్టిక్స్–1(ఆబ్జెక్టివ్), 200 మార్కులు; పేపర్–4 స్టాటిస్టిక్స్–2(ఆబ్జెక్టివ్), 200 మార్కులు; పేపర్–5 స్టాటిస్టిక్స్–3, 200 మార్కులు; పేపర్–6 స్టాటిస్టిక్స్–4, 200 మార్కులకు ఉంటాయి. మొత్తం 1000 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్ 3,4 తప్ప మిగతా పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. ఆబ్జెక్టివ్ పేపర్లకు రెండు గంటలు, డిస్క్రిప్టివ్ పేపర్లకు మూడు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
పర్సనల్ ఇంటర్వ్యూ
రాత పరీక్షలో చూపిన ప్రతిభ, పోస్ట్‌ల సంఖ్య, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఇందులో చోటు సంపాదించిన వారికి మలిదశలో చివరగా 200 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపితే.. రాత పరీక్షలో మార్కులు, ఇంటర్వ్యూ మార్కులను క్రోడీకరించి తుది విజేతలను ఖరారు చేసి ఆయా సర్వీసులకు ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఏప్రిల్ 30
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ: 2024, మే 1 నుంచి 7 వరకు
- పరీక్ష తేదీలు: 2024, జూన్ 21 నుంచి
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://upsc.gov.in/
రాత పరీక్షలో రాణించేలా
ఐఈఎస్, ఐఎస్‌ఎస్ పరీక్షల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు అకడమిక్‌గా పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయడం ఉపకరిస్తుంది. అదే విధంగా ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్ల సాధన కూడా కలిసొస్తుంది.
జనరల్ ఇంగ్లిష్
ఐఈఎస్, ఐఎస్‌ఎస్ రెండు సర్వీసులకు ఉమ్మడిగా ఉండే పేపర్ ఇది. ఇందులో ప్రశ్నల క్లిష్టత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ఇందులో ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. వొకాబ్యులరీని, రీడింగ్ కాంప్రహెన్షన్ టెక్నిక్స్‌ను పెంచుకోవాలి. ఇంగ్లిష్‌లో ఎక్కువగా ప్యాసేజ్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ స్టడీస్
ఈ పేపర్ కూడా రెండు సర్వీసులకు ఒకే మాదిరిగా ఉంటుంది. ఎక్కువగా కరెంట్ ఈవెంట్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. శాస్త్ర సాంకేతిక రంగం, భారత రాజ్యాంగం, భారతదేశ చరిత్ర, జాగ్రఫీలపై పట్టు సాధించాలి.
జనరల్ ఎకనామిక్స్–1
ఇందులో రాణించడానికి సూక్ష్మ అర్థశాస్త్రం, మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ ఎకనోమెట్రిక్ మెథడ్స్‌పై పట్టు సాధించాలి. సూక్ష్మ అర్ధశాస్త్రానికి సంబంధించి వినియోగదారుని డిమాండ్ సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం, విలువ, పంపిణీ అంశాలు తెలుసుకోవాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ఉండే ఈ పేపర్ కోసం లారెంజ్ వక్ర రేఖ, ఏంజెల్ సూత్రం, పారెటో పంపిణీ సిద్ధాంతం, స్వల్పకాల–దీర్ఘకాల వ్యయ రేఖలు, తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
జనరల్ ఎకనామిక్స్–2
స్థూల అర్థశాస్త్రం, ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్, అంతర్జాతీయ అర్థశాస్త్రం తదితర అంశాల కలయికగా ఉండే పేపర్ ఇది. దీనికోసం ప్రతి అంశాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ చదువుకోవాలి. జాతీయాదాయం కొలమానం, గ్రీన్ నేషనల్ ఇన్‌కమ్, సంప్రదాయ ఉద్యోగితా సిద్ధాంతం, ఫిలిప్స్ రేఖ, ద్రవ్యరాశి సిద్ధాంతం వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ప్రపంచ వాణిజ్య సంక్షోభాలు–కారణాలు,ప్రపంచ వాణిజ్య సంస్థ, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల తాజా కార్యకలాపాలపైనా దృష్టి పెట్టాలి.
జనరల్ ఎకనామిక్స్–3
ఇందులో ప్రభుత్వ విత్త శాస్త్రం, పర్యావరణ అర్థశాస్త్రం, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్ అంశాలు సమ్మిళితంగా ఉంటాయి. ఈ పేపర్‌లో మంచి మార్కుల కోసం పన్ను సంస్కరణలు, గరిష్ట సాంఘిక ప్రయోజన సిద్ధాంతం, ప్రభుత్వ వ్యయ సిద్ధాంతం, గ్రీన్ జీడీపీ, ఇండస్ట్రియల్ ఎకనమిక్స్ తదితర అంశాలపై అవగాహన పొందాలి.
ఇండియన్ ఎకనామిక్స్
సిలబస్‌లోని ముఖ్యాంశాలను వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. స్థిరీకరణ–నిర్మాణాత్మక సర్దుబాటు ప్యాకేజీ, విత్తరంగ సంస్కరణలు, నీతి ఆయోగ్ సిఫార్సులు, టోకు ధరల సూచీ–రిటైల్ ధరల సూచీ, భారత ద్రవ్య మార్కెట్, ఎఫ్‌డీఐ, డిజిన్వెస్ట్‌మెంట్ పాలసీ తదితర తాజా అంశాలపై దృష్టి సారించాలి.
సబ్జెక్ట్ పేపర్లకు సన్నద్ధత ఇలా
- స్టాటిస్టిక్స్–1 పేపర్‌లో రాణించాలంటే.. పలు సిద్ధాంతాలపై పట్టు సాధించాలి. స్టాటిస్టికల్ మెథడ్స్, న్యూమరికల్ అనాలిసిస్ వంటి అంశాలపై అవగాహన పొందాలి.
- స్టాటిస్టిక్స్–2 పేపర్‌లో.. లీనియర్ మోడల్స్, ఎస్టిమేషన్, హైపోథిసిస్ టెస్టింగ్, మల్టీవెరైటీ అనాలిసిస్(ఎస్టిమేషన్ ఆఫ్ మీన్ వెక్టార్ అండ్ కో వేరియన్స్ మ్యాట్రిక్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి.
- స్టాటిస్టిక్స్–3 పేపర్‌లో.. శాంప్లింగ్ టెక్నిక్స్, ఎకనామిక్ సాటిస్టిక్స్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్, ఎకనోమెట్రిక్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- స్టాటిస్టిక్స్–4 పేపర్‌లో.. స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ ,డెమోగ్రఫీ అండ్ వైటల్ ఛార్ట్స్, కంప్యూటర్ సిస్టమ్–సాఫ్ట్‌వేర్ కాన్సెప్ట్స్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ వంటి కంప్యూటర్ సంబంధ అంశాలపై పట్టుసాధించాలి.
- డేటా ఆధారిత అంశాలు అధికంగా ఉండే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ పేపర్లలో మంచి స్కోర్ చేయాలంటే.. వేగంతోపాటు కచ్చితత్వం, సునిశిత పరిశీలన అవసరం. ప్రిపరేషన్ సమయంలోనే ప్రతి అంశాన్ని నిర్దిష్ట కాలపరిమితి విధించుకుని చదవాలి. ముఖ్యంగా ఆయా సిద్ధాంతాలు, వాటిని వినియోగించి డేటా రూపకల్పన, ఛార్ట్స్, గ్రాఫ్స్ రూకల్పన వంటి అంశాలపై పట్టు సాధించాలి.