PM SHRI: పాఠశాలలకు మహర్దశ

నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు కార్పోరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రైమ్‌ మినిస్టర్‌ స్కూల్స్‌ ఫర్‌ రైసింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టింది.

ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 69 పాఠశాలలను ఎంపిక చేసిన ప్రభుత్వం.. తాజాగా రెండో విడతలో మరో 46 పాఠశాలలను ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేస్తుండగా.. కేంద్రం కూడా నిధులు మంజూరు చేస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి.

చదవండి: Admissions: గురుకుల సీట్లన్నీ భర్తీ చేసేలా...!

ఏయే పాఠశాలలు అంటే..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గతేడాది 17 పాఠశాలలను పీఎంశ్రీ కింద ఎంపిక చేయగా ఈసారి మరో పదింటిని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోడేరులోని మోడల్‌ స్కూల్‌, లింగాలలోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ సొసైటీ, తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ సొసైటీ అచ్చంపేట (బాలికల), జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల అమ్రాబాద్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ తూడుకుర్తి, జెడ్పీహెచ్‌ఎస్‌ కొల్లాపూర్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ మేడిపూర్‌ (తాడూరు మండలం), కేజీవీబీ కోడేరు, ఎంపీపీఎస్‌ కొండూరు (పెంట్లవెల్లి మండలం) పాఠశాలలు ఉన్నాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో..

అడ్డాకుల, భూత్పూర్‌, జక్కలపల్లి, వెన్నచేడ్‌, జడ్చర్ల, కోయిలకొండ, కౌకుంట్ల, మహబూబ్‌నగర్‌ (గురుకుల), మహబూబ్‌నగర్‌ (బోయపల్లి) పాఠశాలలు ఎంపికయ్యాయి.

జోగుళాంబ గద్వాలలో.. మాన్‌దొడ్డి, అయిజ (బాలుర), క్యాతూర్‌, ధరూర్‌, అనంతపూర్‌, గద్వాల (అభ్యసన పాఠశాల), మాచర్ల, కుచినెర్ల, జల్లాపూర్‌, బీచుపల్లి గురుకుల పాఠశాలలకు చోటు కల్పించారు.

నారాయణపేటలో.. దామరగిద్ద, ధన్వాడ (ఆదర్శ), గుండుమాల్‌, మరికల్‌, నారాయణపేట, పాతర్చేడ్‌, చిన్నపొర్ల పాఠశాలలు ఉన్నాయి.

వనపర్తిలో.. జిల్లాలోని మస్తీపూర్‌, ఆత్మకూర్‌, వెలగొండ, గోపాల్‌పేట, కొత్తకోట (బాలికలు), వీపనగండ్ల (బాలుర గురుకుల), పాన్‌గల్‌, పెబ్బేరు (కేజీబీవీ), బునాదిపూర్‌, శ్రీరంగాపూర్‌ పాఠశాలలను ఎంపిక చేశారు.

ఆధునిక సౌకర్యాలు..

పీఎం శ్రీ పథకం కింద మేడిపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఈ పథకం అమలుతో విద్యార్థులకు ఉత్తమ బోధన అందిచవచ్చు. విద్యార్థులకు కావాల్సిన ఆధునిక సౌకర్యాలను కూడా అందుబాటులోకి తేవచ్చు.

– ప్రేమ్‌కుమార్‌, హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్‌, మేడిపూర్‌

నిధులు మంజూరు..

గతేడాది పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 17 పాఠశాలలు ఎంపికవగా.. ఈసారి మరో పదింటికి చోటు కల్పించారు. గతేడాది ఎంపికై న పాఠశాలలకు రూ.5 లక్షల వరకు నిధులు వచ్చాయి. ప్రస్తుతం అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. పీఎంశ్రీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.

– గోవిందరాజులు, డీఈఓ, నాగర్‌కర్నూల్‌

చేపట్టే అభివృద్ధి పనులు..

కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం పీఎంశ్రీ పథకం ద్వారా నిధులు అందిస్తాయి. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో ఎల్‌ఈడీ లైట్లు, పోషకాహార వనం, ఎల్‌ఈడీ ప్యానళ్లు, వ్యర్థాల నిర్వహణ, సొంత భవనాలు, మరుగుదొడ్లు, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్‌ గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు, డిజిటల్‌ బోధన, సైన్స్‌ ల్యాబ్‌ వంటి సదుపాయాలను కల్పించనున్నారు. అయితే ఈ పథకం ద్వారా ఒక్కో పాఠశాలకు ఏడాదికి రూ.40 లక్షల చొప్పున ఐదేళ్లపాటు నిధులు అందించనున్నారు. అయితే గతేడాది ఎంపికై న పాఠశాలలకు స్థాయిని బట్టి రూ.3– 5 లక్షల వరకు నిధులు మంజూరు చేసి ఏయే పనులకు ఖర్చు చేయాలో గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. కాగా విడతల వారిగా మరిన్ని నిధులు మంజూరుయ్యే అవకాశం ఉంది.

#Tags