Admissions: గురుకుల సీట్లన్నీ భర్తీ చేసేలా...!
నాలుగు గురుకుల సొసైటీలు ఉమ్మ డిగా ఐదోతరగతి అర్హత పరీక్ష నిర్వహించగా, కేటగిరీల వారీగా అధికారులు విద్యార్థుల విభజన పూర్తి చేశారు. దీంతో తొలివిడత ప్రాథమిక ఎంపిక జాబితాను ఆయా సొసైటీ లు వెబ్‌సైట్‌లో పొందుపర్చాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీలు తొలివిడత జాబితా ఆధారంగా అడ్మిష న్లు పూర్తి చేస్తున్నాయి.
నాలుగు గురుకుల సొసైటీల పరిధిలో ఐదోతరగతిలో ప్రవేశానికి 48వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 30వేల మందికి పైగా ప్రాథమిక జాబి తాలో అర్హత సాధించారు. తొలిజాబితాలో ఎంపికైన విద్యా ర్థులు వారంరోజుల్లోగా ఆయా స్కూళ్లలో రిపోర్టు చేయాలి. ఆ తర్వాత ఉన్న ఖాళీల ఆధారంగా రెండోజాబితా విడుదల చేస్తారు. మరోవారం రోజుల్లోగా రెండో జాబితా విడుదల చేయనున్నట్టు గురుకుల సొసైటీ వర్గాలు చెబుతున్నాయి.
చదవండి: Gurukul Students in EAPCET: ఈఏపీ సెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన బాలుర గురుకుల విద్యార్థులు..
ఈ నెలాఖరులోగా జూనియర్, డిగ్రీ అడ్మిషన్లు
గురుకుల జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. పదోతరగతి ఫలితాలు వెలువడిన వెంటనే ప్రవేశాల ప్రక్రియ వేగవంతం చేయాలని భావించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం అర్హత పరీక్ష ఫలితాలను గురుకుల సొసైటీలు విడుదల చేశాయి. నెలాఖరులోగా ఎంపికైన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి.
మొదటివిడత అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత రెండోవిడత ఎంపిక జాబితా విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీలు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేశాయి. మైనార్టీ గురుకుల సొసైటీ మాత్రం కాస్త వెనుకబడి ఉంది. ఈ సొసైటీ నుంచి ఐదోతరగతితో పాటు జూనియర్ కాలేజీలు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదు.
మిగులు సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
గురుకుల విద్యాసంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సొసైటీలు నిర్ణయించాయి.
- ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు ఇప్పటికే కార్యదర్శి కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అర్హత పరీక్షల ద్వారా సీట్లు భర్తీ పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి అర్హతల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు.
- జనరల్ గురుకుల సొసైటీల్లో సీట్లు పెద్దగా మిగలడం లేదు.
- బీసీ గురుకుల సొసైటీల్లో సీట్ల భర్తీకి ఆ సొసైటీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించింది. సీట్లు దక్కని విద్యార్థులు సొసైటీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అర్హతను బట్టి అడ్మిషన్ ఇస్తారు. పూర్తిగా పారదర్శకతతో అడ్మిషన్లు జరిగేందుకు సాంకేతికవ్యవస్థ ఏర్పాటు చేశామని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బి.సైదులు ‘సాక్షి’తో అన్నారు.