Lakshmapuram ZP School: 8 మంది టీచర్లు.. 10 మంది విద్యార్థులు

రామన్నపేట: ఆ ఉన్నత పాఠశాలలో అక్షరాలా పది మంది విద్యార్థులు, ఎనిమిదిమంది ఉపాధ్యాయులున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లిన విద్యా ర్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగినా ఫలితం లేకుండా పోయింది.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం లక్ష్మాపురం జెడ్పీ పాఠశాల దుస్థితి ఇది. ఈ పాఠశాల 2002–03 విద్యాసంవత్సరంలో అప్‌గ్రేడ్‌ అయింది. ప్రారంభంలో 200 మంది విద్యార్థులు ఉండేవారు. అప్పట్లో సక్సెస్‌ స్కూల్‌గా ఎంపికైంది. రూ.30 లక్షలతో భవనాలను నిర్మించారు.
కానీ ప్రైవేటు పాఠశాలలు, మోడల్‌స్కూళ్లు, గురుకుల పాఠశాలల ప్రభావంతో అయిదారు సంవత్సరాల నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పదికి పడిపోయింది. పది మందిలో తొమ్మిది మంది మాత్రమే పాఠశాలకు వస్తుండగా.. ఒక విద్యార్థి పాఠశాల పునః ప్రారంభమయ్యాక జూలై 10న‌ మాత్రమే హాజరయ్యాడు.
పాఠశాలలో ప్రస్తుతం ఎనిమిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో ఒకరు జీహెచ్‌ఎం కాగా మ్యాథ్స్, ఫిజికల్‌ సైన్స్, బయోసైన్స్, ఆంగ్లం స్కూల్‌ అసిస్టెంట్లు, తెలుగు, హిందీ పండిట్లు, పీఈటీ ఉన్నారు.  

చదవండి: Teachers: జీవో 317తో నష్టపోయిన టీచర్లను జిల్లాలకు పంపాలి

నచ్చజెప్పినా గ్రామస్తులు ససేమిరా.. 

పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ గ్రామం నుంచి మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలు, వేములకొండ ఉన్నత పాఠశాలకు వెళ్తున్న 36 మంది విద్యార్థులను గుర్తించారు.

ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి.. గ్రామపెద్దలతో సమావేశమయ్యారు. ఉపాధి, వ్యవసాయ పనులు చేసే చోటికి వెళ్లి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగడం లేదు.  

#Tags