Foreign Job Scams: ఉద్యోగాల పేరిట మోసాలకు తెర తీస్తున్న ఏజెన్సీలు !.. ఈ జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి..

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని ఈ రోజుల్లో యువత ఎక్కువగా కోరుకుంటోంది.

మంచి జీవితం, లక్షల్లో జీతం సంపాదించాలన్న ఆశతో ఎంత కష్టమైనా సరే విదేశాలకు వెళ్లేందుకు ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. అయితే యువత బలహీనతను ఆసరాగా చేసుకుని కొన్ని ఏజెన్సీలు, సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయి. ఎన్నో ఆశలతో విదేశాలకు వెళుతున్న వారు చివరకు బానిసలుగా, లేదంటే స్థానిక నేర ముఠాల చేతుల్లో పావులుగా మారి జీవితాలు దుర్భరం చేసుకుంటున్నారు.

తాజాగా కాంబోడియాకు అమాయకులను తరలిస్తున్న ఓ ముఠా మోసాలను టీజీ సైబర్‌ సెక్యురిటీ బ్యూరో అధికారులు వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాంబోడియాలో చైనా ముఠాలు ఇలాంటి అమాయకులతో బలవంతంగా సైబర్‌నేరాలు చేయిస్తున్నాయి.
ఆ ముఠాల చిత్రహింసల నుంచి ఇద్దరు తెలుగు యువకులు బయటపడిన నేపథ్యంలో ఇలాంటి ముఠాపై దర్యాప్తు ముమ్మరం చేశారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువత ఇలాంటి ముఠాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.  

చదవండి: FAKE Jobs: ఇంటర్వ్యూ లేకుండానే ప్రభుత్వ శాఖలో ఉద్యోగం.. నిరుద్యోగులే టార్గెట్‌

లక్షల్లో జీతాలంటే.. మోసమని గ్రహించాలి  

విదేశాల్లో ఉద్యోగావకాశాలు, లక్షల్లో జీతాలు.. అని ఏజెన్సీలు ఊదరగొడుతున్నాయంటే అది కచ్చితంగా మోసమని గ్రహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విద్యార్హతకు సంబంధం లేని ఉద్యోగాల్లోనూ అవకాశం కల్పిస్తామని చెప్పే ఏజెన్సీల మాటలు నమ్మవద్దని చెపుతున్నారు.
విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే వారు ఏజెంట్లు ఇచ్చే విజిట్‌ వీసాలను అంగీకరించవద్దని, ట్రావెల్‌ ఏజెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.  

అనుమానం ఉంటే ఫిర్యాదు చేయండి.. 

విదేశాల్లో ఉద్యోగావకాశాల పేరిట మోసాలకు పాల్పడే సంస్థలు, ఏజెన్సీలకు సంబంధించి సమాచారం ఉన్నా.. ఆ సంస్థలు మోసానికి తెరతీస్తున్న ట్టు అనుమానం ఉన్నా వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లేదా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని, లేదంటే నేషనల్‌ సైబర్‌ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సీఎస్‌బీ అధికారులు సూచిస్తున్నారు.  

చదవండి: Unemployed: నిరుద్యోగులకు స్వచ్ఛంద సంస్థ టోకరా

విదేశాలలో 10 అత్యంత సాధారణ పని మోసాలు

  1. జాబ్ సైట్‌లలో స్కామ్‌లు
  2. కెరీర్ ప్రకటనలో స్కామ్
  3. సోషల్ మీడియాలో మోసాలు
  4. పిరమిడ్ మార్కెటింగ్‌లో స్కామ్
  5. వ్యాపారం & నిర్వహణలో స్కామ్
  6. టీచింగ్ జాబ్స్ లో స్కామ్
  7. హాస్పిటాలిటీలో స్కామ్
  8. ప్రభుత్వ ఉద్యోగ మోసాలు
  9. డేటా ఎంట్రీ స్కామ్‌లు
  10. ఇంటి సహాయాన్ని కోరుతూ నకిలీ కుటుంబంలా మోసం

ఈ జాగ్రత్తలు మరవొద్దు..  

  • సోషల్‌ మీడియాలో, ఆన్‌లైన్‌లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు నమ్మి మోసపోవద్దు. నిజమైన
  • జాబ్‌ పోర్టల్స్, న్యూస్‌ పేపర్లలో వచ్చే ఉద్యోగ ప్రకటనలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.  
  • మీరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌లకు సంబంధించిన ప్రైవసీ పాలసీని తెలుసుకోవాలి. ఆ సైట్‌వాళ్లు మనకు సంబంధించిన ఏయే వ్యక్తిగత వివరాలు తీసుకుంటున్నారన్నది గమనించాలి.  
  • ఉద్యోగ ప్రకటనలు చూసినప్పుడు సదరు కంపెనీ లేదా సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో
  • మాత్రమే వివరాలు చూడాలి. విదేశాల్లో ఉద్యోగాల పేరిట వచ్చే ఈ–మెయిల్స్, వాట్సప్‌కు వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయవద్దు.  
  • కొన్ని ప్రముఖ ఏజెన్సీలు, సంస్థల పేరిట ఆన్‌లైన్‌లో జాబ్‌ ప్రకటనలు ఇస్తూ..
  • సైబర్‌ నేరగాళ్లు కొద్దిపాటి అక్షరాల మార్పులతో మోసాలకు పాల్పడతున్నారన్నది మరవొద్దు.  
  • ఉద్యోగాల కోసం ముందుగానే ఆయా ఏజెన్సీలు, సంస్థలకు డబ్బులు చెల్లించవద్దు. 

#Tags