ABK Prasad: ఇంకా ఎందుకీ విదేశీ మొగ్గు?
‘‘భారత భూమి మీద పిల్లల్ని కనడం అమెరికాకు దత్తత ఇవ్వడానికేనని తెలిసుంటే... ప్రసవానికొక పునర్జన్మ నెత్తకపోదును... అమెరికా ఖజానా నింపుకొనే యుద్ధంలో/ బిడ్డను యుద్ధభూమికి అంకితమిచ్చిన తల్లిగుండె/ కన్నీరింకిన మేఘాలై వర్షిస్తుంది/ స్వార్థ సామ్రాజ్య నేతలకు/ తల్లి ఉసురు తగలకపోదు.’’
– కవయిత్రి డాక్టర్ పెళ్లకూరు జయప్రద
ఇంతకూ అన్ని వసతులు, సౌకర్యాలు పొదిగి ఉన్న భారత భూమిని వదిలేసి మన యువత పరాయి పంచలలో విద్య కోసం, ఉద్యోగాల కోసం ఎందుకు ఎగబడవలసిన దుఃస్థితి వచ్చింది? భారత పాలనా చక్రాలు, దేశ నేతలు... జాతీయ స్థాయి విద్య, ఉపాధి సౌకర్యాలు దేశ యువతకు అందించలేక పోవడానికి దేశంలో తగిన వనరులు లేక కాదు. భారత సెక్యులర్ రాజ్యాంగం అందించిన దేశీయ వనరుల వినియోగానికి సంబంధించిన అధ్యాయాలను అడ్డదిడ్డమైన నిబంధ నలతో జత చేసినందున దేశ పౌరులు ప్రయోజనం పొందలేక పోతున్నారు. సంపన్న గుత్త వర్గాలు ఈ అవకతవకల ఆధారంగా దేశ వనరులను యథేచ్ఛగా సొంతం చేసుకుని పౌరులకు దేశీయ విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బ తీస్తున్నారు. ఫలితంగా విదేశీ విద్య, ఉపాధి వనరులనన్నా సద్వినియోగం చేసుకొని బతుకుదామన్న తపనలో ఈ వ్యామోహాన్ని తల్లిదండ్రులు పెంచుకోవలసి వచ్చింది.
ఈ వాస్తవాన్ని మన దేశం దృష్టికి మొదటిసారిగా పాతికేళ్లనాడే – ఎవరో కాదు, భారతదేశంలోని అమెరికా రాయబారే తీసుకొచ్చాడు. ‘‘అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుపడటానికి విద్య, ఉద్యోగార్థులై అమె రికాకు వస్తున్న భారతీయులు ఎంతగానో దోహదపడుతున్నారు’’ అని ఆయన కీర్తించిన సంగతి మనం మరచిపోరాదు. ఈ పాతికేళ్లుగానూ ఈ పరిస్థితిలో మార్పు లేదు. అంటే, భారత పాలకులు దేశంలో విద్య, ఉద్యోగ వనరులను భారత యువతకు కల్పించకుండా పరాధార మనస్తత్వానికి అలవాటు పడిన ఫలితంగా ఈ దుఃస్థితి దాపురించి కొనసాగుతోందని మరచిపోరాదు.
ఈ దశలో గత పాతికేళ్లుగా పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలకు ప్రజా ప్రతినిధుల పేరిట ఎన్నికవుతూ వస్తున్న వివిధ పార్టీల ఛోటా– మోటా రాజకీయ నాయకులు తమ ఆస్తులకు మించిన ధనరాసులతో ఎలా తూగుతూ తమ అవినీతి సామ్రాజ్యాలను నిర్మించుకుంటూ వస్తున్నారో ‘ఏడీఆర్’ సాధికార నివేదికలు బట్టబయలు చేస్తున్నాయి. అయినా మార్పు లేదు. ఈ పరిస్థితుల్లో దేశంలో విద్య, వైద్యాభివృద్ధి వనరులు ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా ఎలా, ఎక్కడినుండి లభి స్తాయి? అందుకే నన్నయ మహాకవి మహాభారతం ‘ఆదిపర్వం’లోనే ‘సరమ’ అనే కుక్కపిల్ల ద్వారా సార్వకాలికమైన విజ్ఞానాన్ని ప్రజలకు పంచిపెట్టాడు.
‘ఆదిపర్వం’ తొలి ఆశ్వాసంలో పాండవుల ముని మనుమడైన జనమేజయ మహారాజు నిర్వహించిన ఒక యజ్ఞం గురించి ప్రస్తావిస్తాడు. ఆ యజ్ఞ భూమికి ‘సరమ’ అనే కుక్క పిల్ల వస్తే అపవిత్రంగా పరిగణించి జనమేజయుడి సోదరులు దాన్ని దారుణంగా కొట్టి బయటకు పంపించివేస్తారు. ఆ ‘సరమ’ జరిగిన దారు ణాన్ని తల్లికి వివరిస్తుంది. అప్పుడు నీతులు పేదవాళ్ళకే కాదు, అంద రికీ వర్తించాలనీ, ఈ పని చేయడం తగునా, తగదా అన్న ఆలోచన, సార్వకాలిక సత్యం అందరూ పాటించాలనీ ‘సరమ’ తల్లి బోధిస్తుంది.
ఇక, ‘మట్టి’కి అనువాదం ‘రైతు’ అని చెబుతూ గ్లోబలైజేషన్ పేరిట ‘చాపకింద నీరులా’ జరుగుతున్న తతంగం ఏమిటో మరొక ఆధునిక కవి ఇలా వర్ణించాడు:
‘‘కాడెద్దులు పోయి
కంప్యూటర్లు వచ్చాయి
భుజాల మీద నాగలి పోయి
బైలార్స్ ట్రాక్టర్లు వచ్చాయి
ఆకలికి తప్ప అన్నిటికీ
యంత్రాలు వచ్చాయి.’’
అయినా రైతు దుఃస్థితి మారలేదని ఒక కవి స్పందిస్తే– ఇదే సమయంలో ‘వానకు కూడా దరిద్రం పట్టుకుంది/ కురవకుండానే రైతు కళ్ళల్లో నీళ్ళు నింపుతోం’దని మరో కవి వ్యంగ్యంగా అంటించాడు. ఇదిలా ఉండగా, మరో కవి ప్రస్తుత వ్యవసాయ పరిస్థితుల్ని వర్ణిస్తూ: ‘‘కాడికి కంప్యూటర్/ మేడికి కీబోర్డు, వెబ్‌సైట్‌లో విత్తడం, ఇంటర్నెట్‌లో అమ్మడం’’ అని గ్లోబల్ వ్యవసాయాన్ని వ్యంగ్యంగా చిత్రించాడు. మరో ఆధునిక కవి –
‘‘కళ్లముందు పంటకల్లం అదృశ్యమైనప్పుడు
ఇళ్లల్లో దూలాలకు వేలాడేవి
విత్తనాల సంచులు కాదు – రైతుల శవాలు’’ అని ఆక్రోశించాడు.
ఇలాంటి నిరాశావాదానికి విరుగుడు అన్నట్టు, రైతుకు బలంగా కొమ్ముకాస్తూ, రాబోయే మంచిరోజుల్ని తలచుకొని, రైతు ఆగ్రహిస్తే వచ్చే పరిణామాన్ని వివరిస్తూ, ఆహ్వానించదగ్గ ఆశావాదాన్ని కోడూరి విజయకుమార్ ఇలా వ్యక్తం చేశాడు:
‘‘మట్టి చేతులు కూడా మాట్లాడతాయి
వాటి మాటల భాషే వేరు –
మట్టి చేతులు మాట్లాడటం ప్రారంభించాక
నోళ్లున్న మారాజుల సింహాసనాలే కదిలిపోతాయి
ఆ రోజుకి ఎదురు చూడాల్సిందే’’!
కానీ మన నేతలకి నైతికత, విశ్వసనీయత కరువైపోయాయి. దీనికి కారణం అడ్డగోలు సంపాదనల ద్వారా ఎదిగిపోవడం. ప్రజా ప్రాతినిధ్య సభలుగా రాణించవలసిన రాజ్యాంగ సంస్థలను భ్రష్టు పట్టించడం. ఆఖరికి దేశ తొలి ప్రధాన మంత్రి, జాతీయ కాంగ్రెస్ నిర్మాతలలో అగ్రగణ్యుడైన జవహర్‌లాల్ నెహ్రూను నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలను చాపకింద నీరులా నేటి పాలక వర్గం చేస్తోంది. పేరును మాయపుచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి నెలకొల్పిన మంచి సంప్రదాయాలు చెక్కు చెదిరిపోవు. నెహ్రూ మాదిరిగా తమ కపటాన్ని చీల్చి తమ వ్యక్తిత్వంలోని పరిమితుల్ని అంత బాహాటంగా చెప్పుకున్నవారు లేరు. ‘‘నేను ధనిక వర్గంలో పుట్టి పెరిగినందున భావవ్యాప్తిలో కమ్యూనిస్టులు వెళ్లగలిగినంత దూరం వెళ్లలేను’’ అన్నారు. అందుకే పాలకులకు నైతికత ప్రధాన సూత్రంగా ఉండాలి.
అందుకే ఏ ప్రార్థన చేసినా అది స్వార్థం కోసం కాదు, కార్య సాధన కోసం గుండె ధైర్యం ఇవ్వమని విశ్వకవి రవీంద్రుడు ఎందుకు కోరుకున్నాడో వినండి:
‘‘నన్ను ప్రార్థించనీ – ప్రమాదాల నుంచి
రక్షించమని కాదు
ధైర్య సాహసాలతో ఎదుర్కొనే శక్తిని
కలిగించమని ప్రార్థించనీ
నన్ను కోరుకోనీ
నాకు సంభవించే నా బాధలను పోగొట్టమని కాదు
కష్టనష్టాలను అతి తేలికగా భరించగలిగే శక్తిని కోరుకోనీ
నన్ను ఆశించనీ
నా జీవిత పోరాటంలో మిత్రుల సహకారాన్ని
దిగ్విజయం పొందడానికి నా స్వంత శక్తిని ఆశించనీ
ఓ ప్రభూ!
నాకు కలిగే దిగ్విజయాలలో మాత్రం నీ కరుణా
కటాక్షాలను స్మరించే పిరికివానిగా చేయకు
పరాజయాలలో నీ చేయూత అర్థించనీ’’!
శభాష్, ఈ నిర్మలమైన మనస్సు పాలకుల మెదళ్లను ఏనాటికి కుదిపి కదుపుతుందో!
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in