FAKE Jobs: ఇంటర్వ్యూ లేకుండానే ప్రభుత్వ శాఖలో ఉద్యోగం.. నిరుద్యోగులే టార్గెట్
మీకు ఒప్పందం కుదిరితే చాలు.. ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువు ఇప్పించే బాధ్యత మాదే. ఇలా నడిగడ్డలో కొందరు మోసగాళ్లు నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాల పేరిట నట్టేట ముంచుతున్నారు.
కొన్నేళ్లుగా నిరుద్యోగులే లక్ష్యంగా దందా సాగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన అనేక మంది నిరుద్యోగులతో రూ. లక్షలు వసూలు చేసి.. ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో అటెండర్, సూపర్‌వైజర్ పోస్టులకు నకిలీ ఆర్డర్ కాపీలను అందజేసినట్లు తెలుస్తోంది. వీరి మాటలు నిజమని నమ్మి ఆర్డర్ కాపీలతో ఆయా కార్యాలయాలకు వెళ్లిన నిరుద్యోగులు అసలు విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు.
చదవండి: Puja Khedkar Case: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు యూపీఎస్సీ షాక్.. అభ్యర్థిత్వం రద్దు..
వెలుగులోకి ఇలా..
గద్వాల మండలం పూడూర్‌కు చెందిన నిరుద్యోగి గొల్ల కృష్ణయ్యకు కొన్ని నెలల క్రితం గద్వాల పట్టణానికి చెందిన ఇర్ఫాన్ పరిచయమయ్యాడు. జిల్లా కలెక్టరేట్‌లో అటెండర్, సూపర్‌వైజర్ ఉద్యోగాలు ఉన్నాయని.. ఉద్యోగం కావాలంటే రూ. 3 లక్షలు మా ఏజెన్సీకి చెల్లించాలని.. హైదరాబాద్‌కు చెందిన సామేల్ ఉద్యోగ నియామక పత్రం అందజేస్తాడని నమ్మించడంతో కృష్ణయ్య డబ్బులు చెల్లించాడు.
అయితే ఉద్యోగంలో చేరే విషయంపై అప్పుడూ, ఇప్పుడు అంటూ జాప్యం చేయడంతో తాను మోసపోయినట్టు గ్రహించి, ఆగస్టు 6వ తేదీన పట్టణ పోలీసులకు బాధితుడు కృష్ణయ్య ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం 12వ తేదీన ఇర్ఫాన్, సామేల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిరుద్యోగ యువత ఎంతో మంది మోసపోయినట్టు పోలీసులు గుర్తించి, ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎంత మంది నిరుద్యోగ యువత ఈ ముఠా సభ్యుల మాటలు నమ్మి మోసపోయారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: TGSRTC Fake Notification: అది ఫేక్ నోటిఫికేషన్: సజ్జనార్
గతంలోనూ..
ఈ తరహా కేసు 2020 జనవరి 28న గద్వాల పట్టణ పోలీసుస్టేషన్‌లో నమోదైంది. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిరుద్యోగ యువతే లక్ష్యంగా నడిగడ్డలో నిత్యం మోసాలకు పాల్పడుతున్నారు.
30 మందికి పైగా బాధితులు?
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30 మందికి పైగా నిరుద్యోగులను మోసం చేసినట్లు తెలుస్తోంది. పలువురు నిరుద్యోగులు గద్వాలకు చెందిన ముఠా సభ్యుడి ఇంటి వద్దకు వచ్చి గొడవ పడిన క్రమంలో కుటుంబ సభ్యుల జోక్యంతో కొంత నగదు ఇచ్చి, చేతులు దులుపుకొన్నట్లు సమాచారం. సొంత బంధు మిత్రులను సైతం ఉద్యోగాల పేరుతో బురిడీ కొట్టించాడనే విమర్శలు ఉన్నాయి.
అయితే ఈ ముఠా సభ్యులపై గతంలో గద్వాల జిల్లా ఉండవెల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ వ్యక్తి ఖాతాను హ్యాక్ చేసి, రూ. 6 లక్షలు అపహరించినట్లు మహబూబ్‌నగర్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. గూగుల్ నుంచి ఐడీ సైతం రద్దు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ‘సాక్షి’ ముఠా సభ్యుడిని సంప్రదించగా, అలాంటిదేమీ లేదని.. మీడియా బృందానికి మంచి పార్టీ ఇస్తా కలుద్దామంటూ ఫోన్ కట్ చేయడం కొసమెరుపు.
సవాల్‌గా తీసుకున్నాం..
నిరుద్యోగులు, అమాయకులను మోసాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాం. పాత కేసులు, తాజాగా నమోదైన కేసును సవాల్‌గా తీసుకున్నాం. ముఠా సభ్యులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. పురోగతి సాధించని కేసులను సైతం వెలుగులోకి తీసుకొచ్చేందుకు జిల్లా పోలీసు శాఖ కసరత్తు చేస్తుంది. ఉద్యోగాల పేరిట మోసం చేసే వ్యక్తుల బారిన పడకుండా నిరుద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యవహారంలో ఎవరిని ఉపేక్షించేది లేదు.
– శ్రీనివాస రావు, ఎస్పీ