Singareni Jobs : ఈ ఒక్క నిర్ణయంతో.. 500 ఉద్యోగాలు.. ఎలా అంటే..?

గ్రామీణ ప్రాంతాల్లో రికార్డుల్లో ఒకటి.. వ్యవహారికంగా మరో పేరు ఉండడం సహజం. దీంతో ఏళ్ల క్రితం సింగరేణి గనుల్లో పనులకు ఎవరూ రాకపోవడంతో అర్హతలు ఉన్నా, లేకపోయినా పలువురిని చేర్చుకున్నారు. అయితే, వారి ఇళ్ల వద్ద పిలిచే పేరు ఒకటి ఉండగా.. రికార్డుల్లో మరొకటి నమోదైంది. ఇది ఇన్నాళ్లూ బాగానే ఉన్నా ఇప్పుడు మెడికల్‌ ఇన్‌ వాలిడేషన్‌ అయిన ఉద్యోగుల వారసులకు శాపంగా మారింది.

ఒకటి కాదు రెండు ఏకంగా 500 కుటుంబాలకు పైగా ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నాయి. వీరేమీ అక్రమ విధానాల్లో ఉద్యోగాలు ఇప్పించాలని కోరడం లేదు. వారసత్వంగా రావాల్సిన ఉద్యోగాలు కేటాయించాలని కోరుతున్నా సింగరేణి యాజమాన్యం మనస్సు కరగడం లేదు. పాలకులు మారుతున్నా ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న ఆలోచన రాకపోవడంతో వందలాది కుటుంబాలు ఆవేదనలో మగ్గుతున్నాయి.

ఎందుకు ఇలా..?
చాలా మంది సుమారు 40 ఏళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధికి పాటుపడగా రకారకాల అనారోగ్య కారణాలతో మెడికల్‌ ఇన్‌ వాలిడేషన్‌ అయ్యారు. అయితే, ఇందులో పలువురికి రెండేసి పేర్లు ఉండడంతో ఇన్నాళ్లు రాని సమస్య ఇప్పుడు ఎదురవుతోంది. మెడికల్‌ ఇన్‌వాలిడ్‌ అయి ఏళ్లు గడుస్తున్నా వారసులకు ఉద్యోగాలు ఇచ్చే సమయంలో కొర్రీలు పెట్టటం సరికాదని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలియాస్‌ పేర్ల కారణంగా ఉద్యోగాలకు నోచుకుని వారు సింగరేణి వ్యాప్తంగా 500 మంది వరకు ఉంటారు. అయితే, చిన్నచిన్న కారణాలతో వీరి నియామకాలకు నివేదిక ఇవ్వడంలో విజిలెన్స్‌ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతుండగా.. ఈ జాప్యంతో కొందరు పిల్లలకు కుదిరిన పెళ్లిళ్లు సైతం నిలిచిపోయే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఇదే హామీ ఇచ్చినా...?
సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు అలియాస్‌ పేరు మార్పిడి విషయమై న్యాయం చేస్తామని 2017లో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుర్తింపు సంఘం ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. అయితే అటు ప్రభుత్వం, ఇటు యూనియన్‌ పదవీకాలం ముగిసినా హామీ మాత్రమే నెరవేరలేదు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఇదే హామీ ఇచ్చినా.. ఏడాది కావస్తున్నప్పటికీ హామీని నెరవేర్చకపోవడంతో సుమారు 500 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.

దరఖాస్తులన్నింటినీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద..
ఏళ్ల క్రితమే మెడికల్‌ ఇన్‌ వాలిడేషన్‌ పూర్తయిన పలువురు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా రెండేసి పేర్లు ఉన్న విషయాన్ని గుర్తించారు. దీంతో విజిలెన్స్‌ విభాగానికి నివేదించారు. ఈ మేరకు దరఖాస్తుల ఆధారంగా కార్మికుల ఇళ్లకు వెళ్లి సమీపంలోని వారిని రకరకాల ప్రశ్నలు వేసి విచారణ చేపట్టారు. సంస్థ అభివృద్ధికి ఏళ్ల పాటు పనిచేసిన తమ విషయంలో కనీస మర్యాద లేకపోయినా, విచారణ ను ఓపికగా భరించినప్పటికీ వారసులకు ఉద్యోగాలు రాకపోవడంతో కార్మికుల వేదన అంతా ఇంతా కాదు. ఈ మేరకు ఇలాంటి దరఖాస్తులన్నింటినీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద పరిష్కరిస్తే 500 కుటుంబాల్లో వెలుగు నిండుతాయనే విషయాన్ని యజమాన్యం గుర్తించాలని పలువురు కోరుతున్నారు.

కార్మికుడికి సగం జీతం ఇవ్వాలని..
సింగరేణి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఐఆర్‌పీఎం, వెల్ఫేర్‌ వింగ్‌లతో సమీక్షిస్తే ఇలాంటి కార్మికుల సమస్య పరిష్కరించొచ్చు. అయినా విచారణను విజిలెన్స్‌కు ఇవ్వడం సరికాదు. మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన నాటి నుంచి కార్మికుడికి సగం జీతం ఇవ్వాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అలియాస్‌ అంశాన్ని త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తామ‌ని హెచ్‌ఎంఎస్‌ జనరల్‌ సెక్రటరీ రియాజ్‌ అహ్మద్ తెలిపారు.

#Tags