AP Grama Ward Volunteer Salary Hike : ఇకపై గ్రామ, వార్డు వలంటీర్లకు వేతనం పెంపు.. ఇంకా వీళ్లకు..
ఇకపై గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతినెల రూ. 5750 ప్రభుత్వం చెల్లించనున్నది. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్టు తెలిపింది. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వలంటీర్లకు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ కొద్ది రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు లేఖ రాశారు.
☛ AP DSC Notification Update News : ఏపీ డీఎస్సీపై మంత్రి క్లారిటీ ఇదే.. రెండు మూడు రోజుల్లోనే..
ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ టీఎస్ చేతన్ డిసెంబర్ 29వ తేదీన (శుక్రవారం) అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు జాయింట్ కలెక్టర్లు, జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్‌చార్జిలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్‌డీవోలు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు.
డిసెంబర్ 13న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకుఇంటింటికీ రేషన్ పంపిణీలో వలంటీర్లను మరింత భాగస్వాములను చేయనున్నారు. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ వలంటీర్లకు కొన్ని ప్రత్యేక విధులను నిర్ధారించింది. వీటిని కూడా రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు తెలియజేశారు. వలంటీర్లకు రూ.750 అదనపు ప్రోత్సాహకాన్ని ఎప్పటి నుంచో వర్తింపజేస్తామో వేరేగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. వలంటీర్లు తమ క్లస్టర్ (గ్రామీణ ప్రాంతాల్లో 50 ఇళ్ల పరిధి, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్ల పరిధి)లో ఇంటింటికీ రేషన్ పంపిణీలో పూర్తి అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ప్రతినెలా ప్రభుత్వం అందజేసే రేషన్ సరుకులను తీసుకునేలా విస్తృత ప్రచారం చేయాలి. రేషన్ వాహనాలు ఇంటింటికీ పంపిణీకి వచ్చే సమయాన్ని ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు తెలియజేయాలి. రేషన్ పంపిణీ జరిగే సమయంలో వలంటీర్లు కూడా ఉండాలి. రేషన్ సరుకులు తీసుకునే క్రమంలో లబ్ధిదారులు వేలిముద్రలు వేయడం తదితర అంశాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడికక్కడే వాటి పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. తమ పరిధిలో రేషన్ పంపిణీలో ఏవైనా లోపాలు, అవకతవకలు జరిగినట్టు గుర్తిస్తే.. ఆ వివరాలను వెంటనే సంబంధిత వీఆర్‌వో లేదా డిప్యూటీ తహసీల్దార్‌లకు తెలియజేయాల్సి ఉంటుంది.
☛ Government Teacher Jobs : గుడ్ న్యూస్.. 38,800 టీచర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..