Anganwadi School Timings Change news: ఇక నుంచి అంగన్‌వాడీ టైమింగ్స్‌లో మార్పు
అచ్చంపేట: అంగన్‌వాడీ కేంద్రాల్లో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తూ.. చిన్నారులకు మెరుగైన పూర్వ ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీస్కూల్స్‌గా మార్చి, మూడో తరగతి వరకు విద్యాబోధన అందించాలని నిర్ణయించింది.
New Anganwadi Schools: గుడ్‌న్యూస్ ఇక నుంచి కొత్త అంగన్‌వాడీలు ఎందుకంటే...
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకమని.. పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు నేర్పి, ఆటపాటలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్ల వయసు దాటిన చిన్నారులను గుర్తించి, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఈనెల 15 నుంచి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘అమ్మబాట–అంగన్‌వాడీ బాట’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
అందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 7,967 మంది పిల్లలను చేర్పించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం అందించనున్నారు.
విద్యాబోధనలో మార్పులు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇదివరకు గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో విద్యాబోధన చేపడుతున్నారు. అయితే ప్రీస్కూల్‌లో 3 – 6 ఏళ్లలోపు పిల్లలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలుగా ప్రేరణాత్మక, కృత్యాధార బోధన చేయనున్నారు.
జూన్ నుంచి ఆగస్టు వరకు ఆటపాటలు, ప్రకృతి, సైన్స్, యోగా, పూర్వ గణితం, రంగులు ఇతర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ కార్యక్రమాలతో పాటు కృత్యాలతో పిల్లలకు విద్యాబోధన చేస్తారు. నాలుగో శనివారం పూర్వ ప్రాథమిక విద్యా దినోత్సవం జరిపి.. కృత్యాలు, కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. పిల్లల్లో వచ్చిన మార్పులు, అభివృద్ధిని తల్లిదండ్రులకు తెలియజేస్తారు.
మానసిక ఒత్తిడి దూరం చేసేందుకు..
మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల్లోని నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ విద్య అందిస్తున్నారు. పిల్లలపై ఎలాంటి మానసిక ఒత్తిడి కలగకుండా నిపుణుల సూచన మేరకు ఆటలు, పాటలు, కథల ద్వారా చిన్నారులకు చదువుపై ఆసక్తిని పెంపొందిస్తున్నారు.
చిన్నారులను ఆకట్టుకునే విధంగా సిలబస్ రూపొందించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎర్లీ చైల్డ్ హుండ్ కేర్ డెవలప్‌మెంట్ డే వేడుకలు నిర్వహిస్తూ, సామూహికంగా చిన్నారులతో అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అదేవిధంగా చిన్నారుల తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులకు పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పిస్తున్నారు. కేంద్రాలకు సరఫరా అయిన బోధన, ఆట వస్తువులను ప్రదర్శించి చూపిస్తున్నారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా వివరాలిలా..
అంగన్‌వాడీల్లో పిల్లలను చేర్పిస్తున్నాం..
‘అమ్మమాట–అంగన్‌వాడీ బాట’ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 7,967 మంది పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చుకున్నాం. చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు అలవాటుచేసి, ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య అందిస్తాం. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రీస్కూల్స్ ఏర్పాటుచేసింది. సంబంధిత మెటీరియల్, కిట్స్, పుస్తకాలు, యూనిఫాం అన్ని సరఫరా అవుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చాం. – రాజేశ్వరి, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి