Gurukula Students Food Problems: గురుకులంలో విద్యార్థుల కష్టాలు
● జిల్లాలోని అన్ని వసతిగృహాల్లో దయనీయ పరిస్థితి
● విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలవుతున్నా.. ఇదే తీరు
● మెనూ అమలు లోపభూయిష్టం
● డైట్ చార్జీలివ్వక నీళ్ల సాంబారే దిక్కు
● గురుకులాలకు నాలుగు నెలలుగా నిత్యావసర వస్తువుల నిధుల నిలిపివేత
● సరఫరాను నిలిపేస్తామంటున్న వెండార్లు
● ఇదే జరిగితే ఆకలి కేకలే
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు సం‘క్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో కనీస వసతులు ఉండటం లేదు. గత ప్రభుత్వంలో వసతి విద్యార్థుల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు తీర్చేది. ప్రధానంగా అప్పట్లో మధ్యాహ్నం పాఠశాలల్లో నాణ్యమైన భోజనం ఉండేది. ఇక హాస్టళ్లలో ఉదయం అల్పాహారం, రాత్రి భోజన మెనూ కచ్చితంగా అమలయ్యేలా అప్పటి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Telangana Contract Basis Jobs: తెలంగాణలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ: Click Here
ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్‌ను నియమించి పాఠశాలల నుంచి హాస్టళ్ల వరకు తరచూ తనిఖీ చేయించి మెనూ ప్రకారం భోజనం అందించేలా చూసింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం కరువైంది. కేవలం రాత్రి పూట నీళ్ల సాంబార్‌తోనే సరిపెడుతున్న పరిస్థితి. మరుగుదొడ్ల నిర్వహణను గాలికొదిలేశారు. తాగే నీళ్లు, స్నానాలు చేసే నీళ్ల ట్యాంక్‌లను ఎప్పటికప్పుడు శుభ్రపర్చకపోవడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. అపరిశుభ్రత వాతావరణంలోనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది.
విద్యార్థులకు మంచి విద్య, భోజనం, వసతిని సమకూర్చి.. సుశిక్షితులైన అధ్యాపకులను ఏర్పాటు చేసి.. మంచి విద్యనందించేలా గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలోని 28 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో సుమారు 10 వేల మంది విద్యార్థులున్నారు. ఇందులో బీసీ గురుకులాలు నాలుగు, ఎస్సీ గురుకుల పాఠశాలలు 15, ఎస్టీ గురుకుల పాఠశాలలు మూడు, జనరల్ ఆరు ఉన్నాయి. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం నిష్పత్తితో నిధులను వెచ్చిస్తాయి.
అన్నింటికీ కోతే..
పేద విద్యార్థులపై టీడీపీ ప్రభుత్వం మానవత్వాన్ని చూపడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డైట్ చార్జీలను నిలిపేసింది. నెలవారీ ఇచ్చే కాస్మొటిక్ చార్జీల పరిస్థితీ ఇంతే. గ్యాస్‌కు నిధుల్లేక గురుకులాల ప్రిన్సిపల్స్ అప్పులతో నెట్టుకొచ్చి పేద విద్యార్థుల కడుపులు నింపుతున్నారు.
డైట్ చార్జీలను నిలిపేయడంతో హాస్టళ్లల్లో విద్యార్థులకు పెట్టే మెనూ పూర్తిగా మారిపోయింది. ఉడకని అన్నం, నీళ్ల చారుతోనే సరిపెడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు అర్థాకలితో అలమటిస్తున్నారు. మరికొందరు బయటి ఆహారాన్ని తింటున్నారు.
తరగతి గదుల్లేవు
నెల్లూరు దర్గామిట్ట జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. భోజనం అనంతరం ఆ వంట పాత్రలను వాళ్లే మోస్తున్నారు. విద్యార్థుల వసతి గదిలోనే తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాలలో పారిశుధ్యం అంతంత మాత్రంగానే ఉంది. 162 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో ప్రత్యేకంగా తరగతి గదుల్లేవు. రోజూ పెట్టెలను సర్దుకోవడం, అక్కడే తరగతులనూ నిర్వహిస్తున్నారు. భోజనాల సమయంలో బయట విద్యార్థులు చేస్తున్నారు.
నో మెనూ.. పెట్టిందే తిను..!
కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 22 హాస్టళ్లు ఉండగా, ఎస్సీ పది, బీసీ పది, ఎస్టీ రెండు ఉన్నాయి. ఇందులో కందుకూరులో 10, లింగసముద్రంలో మూడు, వలేటివారిపాళెంలో ఒకటి, గుడ్లూరులో రెండు, ఉలవపాడులో ఆరు.. ఐదు కేజీబీవీలు, ఒక గురుకుల పాఠశాల ఉన్నాయి. కందుకూరు ఎస్సీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరింది. నూతన భవన నిర్మాణానికి అనుమతి వచ్చినా, ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
హాస్టల్ భవనం శిథిలావస్థకు
విద్యా సంవత్సర ప్రారంభంలోనే వసతి విద్యార్థులకు అందించాల్సిన దుప్పట్లు, పెట్టెలను ఇంత వరకు ఇవ్వలేదు. ఉలవపాడు ఎస్సీ బాలుర హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది. మెనూ పాటించకుండా పప్పు మాత్రమే విద్యార్థులకు పెట్టారు. లింగసముద్రం ఎస్సీ, బీసీ బాలుర హాస్టళ్లలో మరుగుదొడ్లు లేకపోవడంతో డబ్బాలు తీసుకొని పొలాల్లోకి వెళ్తున్న పరిస్థితి. ఉడకని అన్నం, రుచిలేని కూరలను తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు. మంచినీరు కూడా సక్రమంగా ఉండవన్నారు. కళాశాల స్థాయి విద్యార్థులకు ఇచ్చే రూ.1600 మెస్ చార్జీలతో ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సి ఉంది. అయితే ఈ ఏడాది నుంచి డైట్ చార్జీలు విడుదల కాకపోవడంతో టీఆర్‌ఆర్ ఎస్సీ బాలికల కళాశాలల విద్యార్థులకు సాంబార్‌తోనే అన్నం పెడుతున్న పరిస్థితి.
నీరు బాగా లేకపోవడంతో విద్యార్థులకు చర్మవ్యాధులు
కావలి పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 11 హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 1100 మంది విద్యార్థులు ఉన్నారు. ఎస్టీ గురుకుల హాస్టల్లో స్నానాలకు వాడే నీరు బాగా లేకపోవడంతో విద్యార్థులకు చర్మవ్యాధులు వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ హాస్టల్లో భోజనాలు బాగుండటంలేదని తల్లిదండ్రులకు విద్యార్థులు చెప్తున్నారు. దీంతో తరచూ భోజనాలను ఇంట్లో వండుకొని హాస్టల్‌కు తీసుకొచ్చి తమ బిడ్డలకు తినిపిస్తున్నారు. ఎస్సీ హాస్టల్లో స్నానాల గదుల తలుపు చెదలు పట్టి శిథిలమయ్యాయి. బీసీ హాస్టల్లో స్నానాల గదుల తలుపులు దారుణంగా మారాయి. నీటి ట్యాంకులు దుర్భర స్థితికి చేరాయి.
ఆరుబయటే ఆడపిల్లల స్నానాలు
కోవూరులోని బీసీ బాలికల వసతి గృహంలో వసతుల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి ఇక్కడ 100 మందికే వసతి సరిపోతుంది. అయితే ప్రస్తుతం 140 మంది విద్యార్థినులున్నారు. స్నానాల గదులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థినులు ఆరుబయటే చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 3, 4, 5వ తరగతి పిల్లలు బాత్‌రూముల్లోనే స్నానం చేస్తున్నారు. ఇక బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్వహణ సక్రమంగా లేదు. ఇక్కడ 175 మంది విద్యార్థులుంటే.. వసతి మాత్రం 100 మందికే సరిపడేలా ఉంది. అత్యవసరమైన మెడికల్ కిట్లూ లేవు. మంచినీటికి ప్రత్యేకంగా డ్రమ్ములను ఏర్పాటు చేయలేదు. దాహమేస్తే కుళాయి వద్దకెళ్లి పట్టుకోవాలి. పరిసరాల పరిశుభ్రత లేకపోవడంతో విషపురుగు కుట్టి ఇటీవల ఓ విద్యార్థికి ఏకంగా కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విద్యార్థుల సంఖ్య
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు మొత్తం 18 ఉన్నాయి. వెంకటాచలం మండలం చెముడుగుంట, సర్వేపల్లి హాస్టళ్లలో విద్యార్థులు చేరకపోవడంతో వాటిని మూసేశారు. పొదలకూరు మండలంలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు 8 ఉండగా, పొదలకూరు ఎస్సీ బాలికల హాస్టల్‌కు సొంత భవనం లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మహ్మదాపురంలో దొడ్ల డెయిరీ సీఎస్సార్ ఫండ్స్‌తో హాస్టల్ భవనాలను చక్కగా నిర్మించారు.
మనుబోలు మండలం మనుబోలులో ఎస్సీ బాలుర, బాలికల, బద్దెవోలులో బీసీ బాలుర వసతి గృహాలు ఉన్నాయి. ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. బాలికల వసతిగృహంలో తలుపు లేని స్నానపు గదులు, పెచ్చులూడుతున్న స్లాబ్‌తో విద్యార్థినులు భీతిల్లుతున్నారు. ముత్తుకూరులో సంక్షేమ వసతిగృహం ఉండగా తొలగించారు. తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు, తోటపల్లిగూడూరు గ్రామాల్లో మొత్తం 4 హాస్టళ్లు ఉన్నాయి. నరుకూరులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహం నాలుగు దశాబ్దాల కాలం నాటిది కావడంతో పెచ్చులూడుతోంది. శిథిల భవనం కావడంతో ఎప్పుడేమి జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. ఇక్కడ మరుగుదొడ్ల సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పొదలకూరులోని ఎస్సీ బాలికల వసతి గృహానికి సొంత భవనమే లేదు. ఒకే హాల్.. అదే స్టడీ రూమ్.. వసతి గది. ఇక్కడ 70 మందికి కలిపి ఐదు మరుగుదొడ్లే ఉన్నాయి. ఆరుబయటే దుస్తులను ఉతుక్కోవాలి.