Skip to main content

Gurukula Schools: అద్దె భారం.. గురుకులాలకు తాళం!.. అద్దె భవనాల్లో ఇన్ని పాఠశాలలా!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు సంక్షేమ గురుకుల విద్యా సంస్థలకు తాళాలు పడ్డా యి. ప్రభుత్వం చెల్లించాల్సిన భవనాల అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో యజమానులు వాటి గేట్లకు తాళాలు వేశారు. బకాయిలు చెల్లిస్తేనే గేట్లు తెరుస్తామని స్పష్టం చేశారు.
Gurukula Schools Locked By Building Owners

కొన్నిచోట్ల యజమానులు తాళాలు వేయడమే కాకుండా, ప్రభుత్వం అద్దె బకాయిలు చెల్లించలేదంటూ బ్యానర్లు సైతం ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కొన్ని గంటల పాటు హాస్టళ్ల బయటే నిరీక్షించాల్సి వచ్చింది. 

హాస్టళ్లకు నెలవారీగా చెల్లించాల్సిన అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గత కొంతకాలంగా భవనాల యాజమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా దసరా సెలవుల నేపథ్యంలో మూతపడిన గురుకులాలు అక్టోబర్ 15న పునఃప్రారంభమయ్యాయి. 

చదవండి: ISO Certificate : బాలిక‌ల గురుకులానికి ఐఎస్ఓ గుర్తింపు!

ఈ క్రమంలో బడులు తెరిచేందుకు వచ్చిన గురుకుల పాఠశాలల సిబ్బంది, గేట్లకు వేరే తాళాలు వేసి ఉండడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. అద్దె బకాయిలు చెల్లించిన తర్వాతే సిబ్బందిని, విద్యార్థులను లోనికి అనుమతిస్తామని యజమానులు స్పష్టం చేశారు. కళాశాలల భవనాలకు సంబంధించి కూడా బకాయిలున్నట్లు సమాచారం. 

పలు గురుకులాలకు తాళాలు 

యాదాద్రి జిల్లా మోత్కూరులోని సాంఘిక సంక్షేమ బాలురు గురుకుల పాఠశాలకు యజమాని తాళం వేశారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు 6 గంటల పాటు పాఠశాల ఎదుట నిరీక్షించాల్సి వచ్చి0ది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసిన తర్వాత అందరూ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక్కడి మైనార్టీ గురుకుల పాఠశాల భవనానికి యజమాని బకాయిలు చెల్లించలేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

హుజూర్‌నగర్‌లో గంటపాటు బయటే వేచిచూసిన తర్వాత ప్రిన్సిపాల్‌ రెహనాబేగం విజ్ఞప్తి మేరకు యజమాని తాళం తీశారు. తుంగతుర్తిలో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటే ఉండాల్సి వచ్చి09ది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకులం, మైనార్టీ బాలికల గురుకులం, నాంచారి మడూరులోని బీసీ బాలుర డిగ్రీ గురుకుల కళాశాల గేట్లకు యజమానులు తాళాలు వేశారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

 గూడూరు మండలంలోని మర్రిమిట్ట శివారు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయానికి, ఖానాపురం మండలం ఐనపల్లిలో, దుగ్గొండి మండలం గిరి్నబావిలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల గేట్లకు తాళం వేశారు. దుగ్గొండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల హాస్టల్‌.. చెన్నారావుపేట మండల కేంద్రంలో నిర్వహిస్తుండగా భవనానికి తాళం వేశారు. 

రేగొండ మండలంలోని లింగాల, వరంగల్‌ ఉర్సు గుట్ట వద్ద మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనానికి కూడా తాళం వేశారు. మంచిర్యాల జిల్లా తాండూరులోని మహాత్మా జ్యోతిబా పూలె గురుకుల పాఠశాలకు యజమాని తాళాలు వేశారు. కాగా, మంచిర్యాల జిల్లా తాండూరు బీసీ గురుకుల భవనానికి తాళం వేసిన యజమాని శరత్‌ కుమార్‌పై వివిధ సెక్షన్ల కింది పోలీసులు కేసు నమోదు చేశారు.  

అద్దె భవనాల్లో 625 పాఠశాలలు  

రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీలు సంబంధిత సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతుండగా.. పాఠశాల విద్యాశాఖ పరిధిలో జనరల్‌ గురుకుల సొసైటీ కొనసాగుతోంది. వీటి పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 1,033 విద్యాసంస్థలున్నాయి. ఇందులో 967 పాఠశాలలు కాగా మిగిలినవి డిగ్రీ కాలేజీలు. అయితే 625 పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలున్న ప్రాంతాల ఆధారంగా అద్దె నిర్ణయించిన కలెక్టర్లు ఆ మేరకు చెల్లింపులు చేస్తూ వస్తున్నారు. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని భవనాలకు ఒక విధమైన అద్దె ఖరారు చేయగా, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో మరో విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకో విధంగా చదరపు అడుగు చొప్పున ప్రభుత్వం అద్దె ఖరారు చేసింది. ఆ మేరకు ప్రతి త్రైమాసికంలో యజమానులకు నేరుగా చెల్లింపులు చేçసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే కొంత కాలంగా ఆయా భవనాలకు అద్దె చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వస్తోంది. 

మైనార్టీ స్కూళ్లకు ఏడాదికి పైగా నిలిచిన చెల్లింపులు 

ఎస్సీ, ఎస్టీ సొసైటీల పరిధిలో నాలుగైదు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. అదేవిధంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 2024–25 వార్షిక సంవత్సరం నుంచి నిధులు విడుదల కాలేదు. ఇక మైనార్టీ గురుకుల సొసైటీ పరిధిలో మాత్రం దాదాపు ఏడాదికి పైగా చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది. దీంతో బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. 

గురుకుల అద్దె భవనాలకు సంబంధించి మొత్తం రూ.150 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా దసరా సెలవులకు గురుకులాలు ఖాళీ కావడంతో, ఇదే అదనుగా కొందరు యజమానులు భవనాలకు తాళాలు వేశారు.

Published date : 16 Oct 2024 05:12PM

Photo Stories