Internships: సీఎస్‌ఈ, ఈసీఈ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌.. రూ.12 వేల స్టైపెండ్‌!!

జూనియర్లకు పాఠాలు చెప్పడం ద్వారా చదువుకుంటూనే సంపాదించుకునే అవకాశాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు కల్పించింది.
ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌గా ఎంపికైన ఇంజినీరింగ్‌ విద్యార్థులు

వారిని భవిష్యత్‌ నైపుణ్య నిపుణులుగా (ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌) తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బీటెక్‌ సీఎస్‌ఈ, ఈసీఈ, ఎంసీఏ ఫైనలియర్‌ విద్యార్థులకు ఉన్నత పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కల్పించింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వీరు ఫ్యూచర్‌ స్కిల్స్‌ అందించాల్సి ఉంటుంది.
ఈ ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేసిన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు నెలకు రూ.12 వేల స్టైపెండ్‌ అందజేస్తారు. దీంతో పాటు వారు వర్చువల్‌గా మరో ఇంటర్న్‌షిప్‌ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఉన్నత విద్యలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో పాఠశాలకు ముగ్గురు..
కాకినాడ జేఎన్‌టీయూ (జేఎన్‌టీయూకే) పరిధిలోని 155 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 766 మంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేశారు. వీరిని మొత్తం 2,298 ఉన్నత పాఠశాలలకు కేటాయించారు. ఒక్కో పాఠశాలకు ముగ్గురు చొప్పున నియమితులయ్యారు. వీరి ద్వారా 8, 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఫ్యూచర్‌ స్కిల్స్‌పై అవగాహన కల్పిస్తారు. అలాగే, ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ అందించాలి. భవిష్యత్తులో బోధన రంగంలో రాణించాలనుకునే వారికి, ఉద్యోగం, మార్కెట్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి కూడా ఈ ఇంటర్న్‌షిప్‌ దోహదపడుతుంది.

AP Govt: ఏపీ విద్యావ్యవస్థలో విప్లవాత్మక ఘట్టం.. ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’ విద్య అమలుకు ఒప్పందం

పాఠశాలలకు మ్యాపింగ్‌..
ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌గా నియమించిన వారిని వారి కళాశాలలకు సమీపంలోని ఉన్నత పాఠశాలలకు మ్యా పింగ్‌ చేశారు. ఒక్కో ఇంజినీరింగ్‌ విద్యార్థి తనకు కేటాయించిన మూడు పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై నాలుగు నెలల పాటు అవగాహన క ల్పిస్తారు. వారానికి రెండు రోజులు ఆయా పాఠశాలల కు వెళ్లి ఉన్నత తరగతుల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తారు.

ఈ కోర్సుల్లో శిక్షణ..
ఫ్యూచర్‌ స్కిల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులకు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ (ఐఓటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), మెటావర్స్‌/వెబ్‌ 3.0, మోడలింగ్‌ అండ్‌ ప్రింటింగ్‌, క్లౌడ్‌ కంప్యూటరింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటా/డేటా ఎనలిస్ట్‌, రోబోటిక్స్‌లో బేసిక్స్‌పై అవగాహన కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు స్మార్ట్‌ టీవీలు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్స్‌ను అందజేసింది. ఉపాధ్యాయులకు డిజిటల్‌ పరికరాలపై విద్యా బోధన, హైస్కూల్‌ విద్యార్థులకు ట్యాబ్స్‌ వినియోగంపై కూడా ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌ శిక్షణ ఇస్తున్నారు. కొత్త కంటెంట్‌ ఇన్‌స్టాల్‌ చేసి కూడా అందిస్తారు.

ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌ను నియమించారిలా..

జిల్లా          పాఠశాలలు    నియమితులైనవారు
కాకినాడ        194             65
కోనసీమ        216             74
తూర్పు గోదావరి   183     67

India Today Education Summit 2024: తిరుపతి ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో

గొప్ప మార్పునకు నాంది..
ప్రభుత్వ నిర్ణయం గొప్ప మార్పునకు నాంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర విద్యార్థులు చదువుతో పాటే సంపాదించుకోనున్నారు. విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ లిటరసీ పెరుగనుంది. విద్యార్థులు ఇప్పటికే స్మార్ట్‌ ప్యానల్స్‌పై పాఠాలు వింటున్నారు. వీటి ద్వారా మరింత నాణ్యమైన సాంకేతిక పాఠాలు నేర్పించేందుకు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌నకు పంపాలన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నాం. – డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, ఉప కులపతి, జేఎన్‌టీయూకే

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్రెడిట్లు..
ఫ్యూచర్‌ స్కిల్‌ పోగ్రామ్‌కు సంబంధించి నెలకు రూ.12 వేల స్టైపెండ్‌తో పాటు ఆ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ డిగ్రీలో క్రెడిట్స్‌ కూడా కలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం దేశ చరిత్రలోనే తొలిసారి కావడం మనకు గర్వకారణం. – డాక్టర్‌ సీహెచ్‌ సాయిబాబు, అకడమిక్‌ ఆడిట్‌ డైరెక్టర్‌

కొత్త అనుభూతినిచ్చింది..
ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ఫ్యూచర్‌ స్కిల్స్‌పై విద్యార్థులకు చెప్పే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. చదువుకుంటూనే తిరిగి చెప్పడం కొత్త అనుభూతినిస్తోంది. ఇంటర్న్‌షిప్‌ కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరలోనే పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లయింది. – ఇళ్ల బాల నాగ ప్రవీణ్‌, ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్‌, ముమ్మిడివరం

తరగతులకు హాజరవుతున్నా..
నాకు కేటాయించిన మూడు పాఠశాలల్లోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు వెళ్తున్నాను. ఇంజినీరింగ్‌ ఈసీఈ చదువుతున్నాను. నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం విద్యార్థులకు తెలియని సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నాను. ఇది చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్‌గా స్టైపెండ్‌ కూడా అందజేయడం సంతోషాన్నిస్తోంది. – కలిదిండి తరుణి, ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్‌, రాజోలు

Internships: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం..  ఎవ‌రికంటే..

#Tags