Software Engineer Jobs: వచ్చే 2-3 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు!..ఈ రంగాల్లో ఇంజనీర్లకు భారీగా డిమాండ్
భారతదేశ సాంకేతిక రంగంలో రానున్న 2-3 ఏళ్లకుగాను 10 లక్షల మంది టెక్నాలజీ ఇంజినీర్ల అవసరం ఉందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతా గుప్తా అంచనా వేశారు. విద్యార్థుల్లో కంపెనీలకు అవసరమయ్యే నైపుణ్యాలను పెంచితే తప్పా ఈ డిమాండ్‌ను పూడ్చలేమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సంగీతా గుప్తా మాట్లాడుతూ..‘రాబోయే 2-3 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర రంగాల్లో అధునాతన నైపుణ్యాలు కలిగిన దాదాపు 10 లక్షల మంది టెక్ ఇంజినీర్ల అవసరం ఉంది. దురదృష్టవశాత్తు కళాశాలలు విద్యార్థులకు తగినంత ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించడం లేదు. దేశవ్యాప్తంగా నెలకొనే ఇంజినీర్ల కొరతను తీర్చాలంటే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం శిక్షణ అందించాలి.
ఏఐ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్-సెక్యూరిటీ వంటి రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఆయా రంగాల్లో పని చేస్తున్నవారు కూడా అధునాతన నైపుణ్యాలు పెంచుకోవాలి. వేగంగా మారుతున్న డిజిటల్ టెక్నాలజీలో కొలువులు సాధించాలంటే నిత్యం కొత్త సాంకేతికతనే నేర్చుకోవాల్సిందే’నని చెప్పారు.
కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్ల 80,000 ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయామని గత నెలలో టీసీఎస్ తెలిపింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏఐపై శిక్షణ పొందిన ఉద్యోగుల సంఖ్యను కూడా రెట్టింపు చేసినట్లు చెప్పింది. ప్రముఖ ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థగా పేరున్న లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ జూన్‌లో తమ ఐటీ, ఐటీ ఆధారిత సేవల యూనిట్‌లో 20,000 ఇంజినీర్ల కొరత ఉందని పేర్కొంది.
2028లో డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించిన డిమాండ్ సరఫరా అంతరం 25 శాతం నుంచి 29 శాతానికి పెరుగుతుందని నాస్కామ్ అంచనా వేసింది. మార్కెట్‌లో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ సరైన నైపుణ్యాలు లేక కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.
దేశ టెక్నాలజీ రంగ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ల డాలర్లు(సుమారు రూ.20 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ రంగంలో దాదాపు 5.4 మిలియన్ల(54 లక్షల) మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో టెక్నాలజీ సేవలు 7.5 శాతంగా నమోదవుతున్నాయి.
Tags
- Software Engineer jobs
- Engineer Jobs
- Software Jobs
- artificial intelligence
- high tech engineers
- AI
- Data Analytics
- Sangeeta Gupta
- national assosciation of software and service
- India technology growth
- technology engineers demand 2024
- NASSCOM industry insights
- tech skills development
- Indian tech education opportunities
- sakshieducationlatestnews