Chinese Company Bans specific Zodiac Signs: పిచ్చి ముదిరిపోయింది.. జాతకాలు చూసి ఉద్యోగాలిస్తున్న కంపెనీ!

చైనాలో మూఢనమ్మకాల పిచ్చి ముదిరింది. మూఢనమ్మకం చైనీస్ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి, కార్పొరేట్ ప్రపంచంలోకి  కూడా విస్తరించింది. ఇ‍ప్పటికీ కొన్ని వ్యాపార నిర్ణయాలు మూఢనమ్మకాల ఆధారంగానే తీసుకుంటున్నారంటే ఆశ్చర్యం అనిపించక మానదు. అదృష్ట సంఖ్యలు, రంగులు, తేదీల వరకు ఫెంగ్ షుయ్ సంప్రదాయాలను కార్పొరేట్ నిర్ణయాలలో పాటిస్తున్నారు.

అయితే మూఢనమ్మకానికి పరాకాష్ట అనిపించేలా ఓ కంపెనీ అవలంభించిన అసాధారణ నియామక విధానం తాజాగా చర్చకు వచ్చింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే సంస్థ ‘డాగ్’ సంవత్సరంలో జన్మించిన అభ్యర్థులను తమ కంపెనీలో ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోకుండా నిషేధించింది.

Job Opportunities In IT Sector: ఐటీలో మళ్లీ నియామకాల సందడి.. వీరికి డిమాండ్‌ ఎక్కువ

3,000 నుంచి 4,000 యువాన్లు (సుమారు రూ. 35,140 నుంచి రూ. 46,853) నెలవారీ జీతం అందించే క్లర్క్ ఉద్యోగానికి శాంక్సింగ్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. అయితే డాగ్‌ రాశిచక్రంలో జన్మించినవారు మాత్రం ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవద్దంటూ కోరింది.

ఈ వ్యవహారం చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న వారి కారణం ఏమిటంటే, డాగ్‌ రాశిచక్రంలో జన్మించిన వారు డ్రాగన్ రాశిచక్రంలో పుట్టిన సంస్థ అధిపతికి దురదృష్టానికి కారణం కావచ్చు. చైనీస్ జ్యోతిషశాస్త్రంలో డ్రాగన్, డాగ్‌ రాశిచక్రాల మధ్య 12 సంవత్సరాల వైరుధ్యం ఉంది.

#Tags