సబ్జెక్టును ‘ప్రాక్టికల్’గా నేర్చుకుందాం...

ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర రంగాల్లో సుస్థిర వృత్తి జీవితం లక్ష్యంగా ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులు ఎంసెట్, జేఈఈ, బిట్‌శాట్ వంటి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నారు.
మంచి ర్యాంకు సాధించేందుకు పక్కా ప్రణాళికలతో చదువుతున్నారు. అయితే వీరు కేవలం పోటీపరీక్షలపై దృష్టిసారిస్తే సరిపోదు. సమాంతరంగా ఇంటర్‌లోనూ అధిక మార్కుల సాధనకు కృషిచేయాలి. ఎందుకంటే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం, జేఈఈ మెయిన్‌లో 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఐఐటీ సీటు పొందాలంటే టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. అందుకే థియరీతో పాటు ప్రాక్టికల్ పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించాలి. మరికొద్ది రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎక్కువ మార్కుల సాధనకు సబ్జెక్టు నిపుణుల సూచనలు..

  • చేయడం ద్వారా నేర్చుకునే విజ్ఞానానికి విలువెక్కువ. ఈ పరిజ్ఞానం ఎక్కువ కాలం గుర్తుండటమే కాకుండా శాస్త్రీయ ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. శాస్త్రీయ విశ్లేషణ నైపుణ్యాలను సొంతం చేస్తుంది. అందుకే విద్యార్థులు ప్రాక్టికల్స్‌ను కేవలం మార్కుల కోణంలోనే కాకుండా భవిష్యత్‌లో చేరబోయే కోర్సులను విజయవంతంగా పూర్తిచేసేందుకు అవసరమైన పునాదులు వేసేవిగా గుర్తించాలి.
  • చాలా మంది ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ అంటే భయపడతారు. సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. పరీక్ష స్వరూపాన్ని అర్థం చేసుకొని, తగిన నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
బోటనీ
  • విద్యార్థి సబ్జెక్టు పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అంచనా వేసేలా ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. దీన్ని 30 మార్కులకు, మూడు గంటల వ్యవధితో నిర్వహిస్తారు. కచ్చితమైన సమాచారాన్ని ఇస్తే మంచి మార్కులు సొంతమైనట్లే.
  • ప్రశ్నపత్రంలో మొత్తం అయిదు ప్రశ్నలుంటాయి. మొదటి ప్రశ్నలో ఇచ్చిన కొమ్మ తాలూకు శాఖీయ, పుష్ప లక్షణాలను సాంకేతిక పదాలతో వర్ణించాలి. పుష్ప విన్యాసంతో ఉన్న కొమ్మ, పుష్పం నిలువుకోత పటాలు గీసి, భాగాలు గుర్తించాలి. పుష్ప చిత్రంతో పాటు సంకేతం ఇవ్వాలి. కుటుంబాన్ని గుర్తించాలి. దీనికి ఆరు మార్కులు. స్పష్టంగా పటాలను గీయడం, భాగాలను గుర్తించడంలో పట్టు సాధించాలి. దీనికి ప్రాక్టీస్ ప్రధానం.
  • రెండో ప్రశ్నలో ఇచ్చిన మెటీరియల్ నుంచి అడ్డుకోత తీయాలి. స్లైడ్ రూపకల్పనకు మూడు మార్కులు, గుర్తించినందుకు 1 మార్కు, పటానికి రెండు మార్కులు ఉంటాయి. Dicot and Monocot stems, Dicot and Monocot rootsనుఅధ్యయనం చేయాలి.
  • మూడో ప్రశ్నలో ప్రయోగానికి ఆరు మార్కులుంటాయి. నాలుగు ప్రయోగాల్లో విద్యార్థికి ఒకటి ఇస్తారు. ఈ ప్రయోగాలకు సిద్ధమయ్యేందుకు లేబొరేటరీ మాన్యువల్‌ను ఉపయోగించుకోవాలి. ప్రయోగం 1: Osmosis by potato Osmoscope ప్రయోగం 2: Study of Plasmolysis in epidermal peel of leaf. ప్రయోగం 3: Transpiration by Cobalt Chloride method ప్రయోగం 4: Separation of leaf pigments or Chloroplast pigments' by paper chromatographic technique.
  • నాలుగో ప్రశ్నలో సరైన కారణాలతో స్పెసిమన్‌ను గుర్తించాలి. దీనికి అయిదు మార్కులు. ఇందులో డి నుంచి హెచ్ వరకు ప్రశ్నలుంటాయి. ప్రతి దానికి ఒక మార్కు.
  • రికార్డుకు అయిదు మార్కులు, హెర్బేరియంకు రెండు మార్కులుంటాయి. సిలబస్‌లో పేర్కొన్న కుటుంబాలకు సంబంధించి కనీసం 15 హెర్బేరియం షీట్లు ఉండేలా చూసుకోవాలి. ఆకులు, పుష్పాలు ఉండే కొమ్మలను సేకరించాలి.
జువాలజీ
  • ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం చాలా ముఖ్యం. జంతుశాస్త్రంలోని వివిధ అంశాలను సంపూర్ణంగా ఆకళింపు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
  • మూడు గంటల వ్యవధి ఉండే పరీక్షపత్రంలో నాలుగు భాగాలుంటాయి. వానపాము, బొద్దింక, మానవుడు.. వీటిలోని వివిధ వ్యవస్థల పటాలు/నమూనాలను విద్యార్థులకు ఇస్తారు. వీటిలో వివిధ వ్యవస్థలను గుర్తించి, వాటి పటాన్ని గీయాలి. కనీసం నాలుగు భాగాలు గుర్తించాలి. వీటికి ఆరు మార్కులు కేటాయించారు. గుర్తింపునకు ఒక మార్కు, పటానికి మూడు మార్కులు, భాగాల గుర్తింపునకు రెండు మార్కులు ఉంటాయి.
  • వానపాములోని మూడు వ్యవస్థలకు సంబంధించి జీవి ఖండితాలను గుర్తించాలి. ఆయా వ్యవస్థల్లోని భాగాలను, అవి విస్తరించి ఉండే ఖండితాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
  • బొద్దింక ముఖ భాగాలు, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ పటాలను కూడా సాధన చేయాలి.
  • మానవునికి సంబంధించి జీర్ణ, ధమని, సిర, పురుష-స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు సిలబస్‌లో ఉన్నాయి.
  • రెండో భాగానికి అయిదు మార్కులు కేటాయించారు. ఇచ్చిన శాంపిల్స్‌లో పిండిపదార్థాలు, గ్లూకోజ్, కొవ్వు పదార్థాలను, ఆల్బుమిన్‌ను గుర్తించాలి. అదే విధంగా పిండి పదార్థాల జీర్ణక్రియలో లాలాజల అమైలేజ్ పాత్రను నిరూపించాలి.
  • మూడో భాగంలో ఏ, బీ, సీ, డీ, ఈ.. క్రమంలో అమర్చిన స్పాటర్స్‌ను గుర్తించి, పటాన్ని గీయాలి. గుర్తింపు లక్షణాలను రాయాలి. ఈ భాగానికి 14 మార్కులు కేటాయించారు. వీటిలో అకశేరుకాల స్లైడ్లు, నమూనాలు, కణజాల స్లైడ్లు, సకశేరుకాల స్లైడ్లు, సకశేరుకాల నమూనాలు, కీళ్లు వంటి వాటిని ఇచ్చారు.
  • సిలబస్‌లోని అంశాలను విపులంగా సాధన చేయాలి. అధ్యాపకుల సలహాలు తీసుకొని, వేటిని గుర్తింపు లక్షణాలుగా రాయాలో తెలుసుకోవాలి.
  • నాలుగో భాగం రికార్డుకు సంబంధించినది. దీనికి అయిదు మార్కులు.
ఫిజిక్స్
  • ప్రశ్నపత్రం 30 మార్కులకు ఉంటుంది. మూడు గంటల్లో పూర్తిచేయాలి. 20 ప్రయోగాల నుంచి నుంచి 38 ప్రశ్నలుంటాయి. వీటిలో ఒక ప్రశ్నను లాటరీ ద్వారా ఎంపిక చేసి, విద్యార్థికి ఇస్తారు.
  • మార్కుల విభజన: ఫార్ములా, పద్ధతికి 5 (2+3) మార్కు లు. పట్టిక, పరిశీలన, గ్రాఫ్‌లకు 8 (2+4+2) మార్కు లు. క్యాలిక్యులేషన్స్, ఫలితాలు, ప్రమాణాలకు 6 (4+1+1) మార్కులు. జాగ్రత్తలకు రెండు మార్కులు, వైవాకు 5 మార్కులు, రికార్డుకు 4 మార్కులు కేటాయించారు.
  • ప్రయోగానికి సంబంధించిన ఫార్ములాను ప్రమాణాలతో సహా రాసి, అందులోని పదాలను వివరించాలి. ప్రయోగ విధానాన్ని సొంత వాక్యాల్లో క్లుప్తంగా రాయొచ్చు.
  • నమూనా పట్టికను గీయాలి. అవసరమైన గ్రాఫ్ నమూనాను పెన్సిల్‌తో సూచించాలి. విద్యుత్ ప్రయోగాలకు అవసరమైన వలయాలను గీయాలి. ప్రయోగానికి సంబంధించి కనీసం రెండు జాగ్రత్తలు రాయాలి. ఈ ప్రక్రియనంతా 20 నిమిషాల్లో పూర్తిచేసి, ప్రయోగం ప్రారంభించాలి.
  • మళ్లీ పట్టికలను గీసి, వాటిలో ప్రయోగం చేసేటప్పుడు వచ్చే కొలతలను పొందుపర్చాలి. గణనలను స్పష్టంగా చూపాలి. కొలతల ప్రకారం గ్రాఫ్ గీయాలి. చివర్లో వచ్చి న ఫలితాన్ని ప్రమాణాలతో సహా స్పష్టంగా రాయాలి.
  • వైవాపై ఆందోళన అనవసరం. దాదాపు అన్ని ప్రయోగాలు ఇంటర్ పాఠ్యాంశాలకు సంబంధించినవే కాబట్టి వాటి ప్రాథమిక, సైద్ధాంతిక అంశాలపై పట్టు సాధిస్తే సరిపోతుంది.
  • రికార్డుకు సంబంధించి మొత్తం 20 ప్రయోగాల్లో అయిదు ప్రయోగాలకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. కాబట్టి కనీసం 20 ప్రయోగాలు రికార్డులో ఉండేలా చూసుకోవాలి.
కెమిస్ట్రీ
  • పోటీపరీక్షల్లోని ప్రస్తుత ర్యాంకింగ్ విధానంలో ఇంటర్‌లో సాధించిన ప్రతి మార్కూ కీలకమే. అందువల్ల ప్రాక్టికల్స్‌ను అశ్రద్ధ చేయకూడదు. కెమిస్ట్రీకి సంబంధించి కాలేజీలో క్షుణ్నంగా చదువుకున్న అంశాల నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలో ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఆందోళన అనవసరం.
  • ప్రాక్టికల్స్‌కు సిద్ధంకావడంలో భాగంగా మాన్యువల్‌ను క్షుణ్నంగా చదవాలి. విధివిధానాలను అర్థం చేసుకోవాలి.
  • సెక్షన్ 1కు ఎనిమిది మార్కులు కేటాయించారు. ఇది Volumetric Analysis క ు సంబంధించినది. ప్రయోగ విధానానికి రెండు మార్కులు, ఫార్ములాకు 1 మార్కు, క్యాలిక్యులేషన్‌కు 1 మార్కు, టైట్రేషన్‌కు 4 మార్కులుంటాయి.
  • సెక్షన్ 2కు 10 మార్కులు కేటాయించారు. ఇది గుణాత్మక విశ్లేషణ (Qualitative Analysis)కు సంబంధినది. ప్రాథమిక పరీక్షలకు రెండు మార్కులు, ఆనయాన్ గుర్తింపునకు 4 మార్కులు, కేటయాన్ గుర్తింపునకు మూడు మార్కులు, సాల్ట్ రిపోర్టుకు 1 మార్కు ఉంటుంది.
  • సెక్షన్ 3కు ఆరు మార్కులుంటాయి. ఇందులో నాలుగు భాగాలుంటాయి. అవి ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్, ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడ్స్, క్రమటోగ్రఫీ, కార్బోహైడ్రేట్స్/ప్రొటీన్స్. ఒక విభాగం నుంచి మాత్రమే ప్రశ్న ఇస్తారు.
  • సెక్షన్-4కు ఆరు మార్కులు కేటాయించారు. ఇందులో రికార్డు, వైవా, ప్రాజెక్టు ఉంటాయి. ఒక్కో దానికి రెండు మార్కులు.
  • రికార్డుకు రెండు మార్కులు కేటాయించారు. దీంతో పాటు ఇంటర్ బోర్డు నిర్దేశించిన విధానంలో ల్యాబ్ ఇన్‌చార్జ్ ధ్రువీకరించిన ప్రాజెక్టు నివేదికను సమర్పించాలి.
  • వైవాలో ఎగ్జామినర్ సాధారణంగా ప్రాథమిక భావనలు, ప్రాక్టికల్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల ప్రశ్నను క్షుణ్నంగా అర్థం చేసుకొని, స్పష్టంగా సమాధానమివ్వాలి. సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పాలి. అంతేకానీ ఏదో ఒకటి చెప్పకూడదు.
పరీక్ష సమయంలో..
  • విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షకు పెన్సిల్, రబ్బరు, స్కేలు, రికార్డును తీసుకెళ్లాలి.
  • పరీక్ష గదిలో ఎగ్జామినర్ సూచనలను కచ్చితంగా పాటించాలి. హుందాగా ప్రవర్తించాలి.
  • ఎగ్జామినర్ అడిగే ప్రశ్నలకు స్పష్టంగా, నెమ్మదిగా, మర్యాదపూర్వకంగా సమాధానాలు చెప్పాలి. ఇతరులతో మాట్లాడకుండా క్రమశిక్షణ పాటించాలి.
Prepared by:
ఫిజిక్స్:
పి.కనకసుందర్ రావు
కెమిస్ట్రీ: టి.కృష్ణ
బోటనీ: బి.రాజేంద్ర
జువాలజీ: కె.శ్రీనివాసులు









#Tags