Telangana History for Competitive Exams: కాకతీయానంతర యుగం.. బహమనీ సుల్తాన్లతో పద్మనాయకుల వైరం
హసన్ గంగూ 1350లో కౌలాస్ దుర్గంపై దండెత్తాడు. పానగల్లు కోటను ఆక్రమించి, అమరావతి దాకా తన రాజ్యాన్ని విస్తరించాడు. నీలగిరి కోటను కూడా ఆక్రమించాడు. ఇతడు 1356లో రెండోసారి దండెత్తి భువనగిరి దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. హసన్ గంగూ తర్వాత ఒకటో మహమ్మద్‌షా 1364–65లో గోల్కొండ దుర్గం సహా పరిసర ప్రాంతాలను ఆక్రమించాడు. ఒకటో మహమ్మద్‌షా భారతదేశంలో మొదటిసారిగా యుద్ధ రంగంలో గన్‌పౌడర్ ఉపయోగించాడు..
కాకతీయానంతర యుగం
బహమనీ సుల్తాన్లు
కాకతీయ రాజ్య పతనం తర్వాత దక్షిణాపథమంతా ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ ఆధీనంలోకి వచ్చింది. తర్వాత కొద్ది కాలానికే ఆంధ్ర దేశంలో స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. తుగ్లక్ మీద తిరుగుబాటు చేసిన అనేక మంది సర్దారుల్లో హసన్ గంగూ అబ్దుల్ ముజఫర్ ఒకడు. తెలంగాణకు పశ్చిమోత్తర ప్రాంతంలో బహమనీ షా వంశీయుడైన హసన్‌గంగూ ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్‌పై తిరుగుబాటు చేశాడు. 1341లో దౌలతాబాద్ రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సమయంలో ఉత్తర తెలంగాణను ముసునూరి వంశానికి చెందిన కాపయ నాయకుడు పాలిస్తున్నాడు. తిరుగుబాటు సమయంలో కాపయ హసన్ గంగూకు సహాయపడ్డాడు. తర్వాతి కాలంలో ఇది నష్టానికి దారి తీసింది. బహమనీ రాజ్యం సుదీర్ఘ కాలంపాటు తెలంగాణకు పక్కలో బల్లెంలా తయారైంది.
బహమనీలు అనేకసార్లు తెలంగాణపై దండయాత్ర చేశారు. 1350లో హసన్ గంగూ కౌలాస్(నిజామాబాద్ జిల్లా) దుర్గాన్ని ఆక్రమించాడు. పానగల్లు కోటను స్వాధీనం చేసుకొని, అమరావతి దాకా తన రాజ్యాన్ని విస్తరించాడు. నీలగిరి కోటను కూడా ఆక్రమించాడు. అప్పటి నుంచే నీలగిరి నల్లగొండగా మారింది. ఇరు రాజ్యాలకు గోల్కొండ సరిహద్దుగా ఉండేలా కాపయ సంధి చేసుకున్నాడు. హసన్ గంగూ తుంగభద్ర వరకు పురోగమించి విజయనగర రాజ్యభాగాలను, పశ్చిమాన కొంకణ్ రాజ్యాన్ని ఆక్రమించాడు. 1356లో రెండోసారి దండెత్తి భువనగిరి దుర్గాన్ని ఆక్రమించాడు. హసన్ గంగూ తన రాజధానిని దౌలతాబాద్ నుంచి గుల్బర్గాకు మార్చాడు. రాజ్యాన్ని గుల్బర్గా, దౌలతాబాద్, బీదర్, బీరార్ అనే నాలుగు రాష్ట్రాలుగా విభజించాడు. ఇతడి రాజ్యానికి ఉత్తరాన మాండు, దక్షిణాన రాయచూర్, పశ్చిమాన గోవా, తూర్పున భువనగిరి (కొంతకాలం) సరిహద్దులుగా ఉండేవి.
బహమనీ పాలకులు..
హసన్ గంగూ తర్వాత ఒకటో మహమ్మద్‌షా (1358–75), ముజాహిద్‌షా (1375–78), రెండో మహమ్మద్ షా (1378–97), ఫిరోజ్‌షా (1397–1422), అహ్మద్‌షా (1422–36), రెండో అల్లావుద్దీన్ అహ్మద్‌షా (1436–58), హుమాయూన్ (1458–61), నిజాంషా (1461–63), మూడో మహమ్మద్‌షా (1463–82), మహమూద్‌షా (1482–1518) బహమనీ రాజ్యాన్ని పాలించారు. హసన్ గంగూ తర్వాత కూడా బహమనీలు అనేక సార్లు తెలంగాణ సహ ఇతర తెలుగు ప్రాంతాలపై దండెత్తారు. ఒకటో మహమ్మద్‌షా 1364–65లో గోల్కొండ దుర్గం సహా పరిసర ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతడు భారతదేశంలోనే మొదటిసారిగా యుద్ధ రంగంలో గన్‌పౌడర్ ఉపయోగించాడు.
పద్మనాయకులతో మైత్రి
1366లో పద్మనాయక వంశానికి చెందిన రేచర్ల అనపోత నాయకుడి చేతిలో కాపయ మరణించాడు. తెలంగాణ పద్మనాయకుల వశమైంది. వీరికాలంలో బహమనీ సుల్తాన్లు కొంతకాలం మిత్రులుగా మరి కొంతకాలం శత్రువులుగా మెలిగారు. రెండో హరిహరరాయలు పద్మనాయక రాజ్యంపై రెండో బుక్కరాయలను దండయాత్రకు పంపాడు. ఈ సమయంలో బహమనీలు పద్మనాయకులకు అండగా నిలిచారు. విజయనగర రాజుల ఆధీనంలోని కొత్తకొండ (మహబూబ్‌నగర్ జిల్లా)ను పద్మనాయకులు స్వాధీనం చేసుకోవడానికి తోడ్పడ్డారు. బుక్కరాయలు మరోసారి ఓరుగల్లు, మెదక్, పానుగల్లును ముట్టడించాడు. ఈ సమయంలోనూ బహమనీలు పద్మనాయకులకు తోడుగా నిలిచారు.
సామంతులుగా పద్మనాయకులు
ఫిరోజ్‌షా 1417–19లో పానగల్లును ముట్టడించాడు. విజయనగర రాజుల సహాయంతో పద్మనాయకులు అతణ్ని ఓడించారు. దీంతో విజయనగర, పద్మనాయక రాజ్యాలు సన్నిహితమయ్యాయి. ఇదే సమయంలో బహమనీలతో పద్మనాయకుల వైరం తీవ్రమైంది. ఫలితంగా తర్వాతి కాలంలో పద్మనాయకుల రాజ్యానికి నష్టం వాటిల్లింది. అహ్మద్‌షా రెండో దేవరాయలతో యుద్ధం చేశాడు. ఈ సమయంలో రేచర్ల మాదానాయుడు విజయనగర పక్షం వహించాడు. ఇది బహమనీ సుల్తాన్ల ఆగ్రహానికి కారణమైంది. 1425లో బహమనీలు ఓరుగల్లు సహా అనేక దుర్గాలను ఆక్రమించారు. దీంతో పద్మనాయక రాజ్యం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. అహ్మద్‌షా 1432లో తెలంగాణ మీద దండయాత్ర చేసి రాయగిరి, భువనగిరి దుర్గాలను ఆక్రమించాడు. తెలంగాణలో అధిక భాగం బహమనీ రాజ్యంలో కలిసిపోయింది. పద్మనాయకులు కొంతకాలం సామంతులుగా రాజ్యాన్ని పాలించారు. అహ్మద్‌షా తన రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‌కు మార్చాడు. అహ్మద్‌షా గుజరాత్, మాళవ ప్రాంతాలపై దండయాత్ర చేశాడు. ఇదే అదనుగా పద్మనాయకులు కోల్పోయిన తమ ప్రాంతాలను తిరిగి ఆక్రమించారు. కానీ ఆ యుద్ధాలు ముగిశాక అహ్మద్‌షా తెలంగాణపై దండెత్తాడు. ఓరుగల్లు, రామగిరి (కరీంనగర్) మొదలైన దుర్గాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. 1435 నాటికి (దేవరకొండ మినహా) రాచకొండ సహా తెలంగాణలో అధిక భాగం తిరిగి బహమనీల వశమైంది. బహమనీ రాకుమారుడైన దాసూర్‌ఖాన్ రాచకొండ రాజప్రతినిధి అయ్యాడు. 1444లో సింగమనాయుడు, కపిలేశ్వర గజపతి సాయంతో తన రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. సుల్తాన్ తమ్ముడైన మహమూద్ ఖాన్ రాచకొండలో సామంత రాజయ్యాడు.
హుమాయూన్ రాజైన తర్వాత బహమనీ రాజ్యంలో తిరుగుబాట్లు జరిగాయి. వీటిని ఆసరా చేసుకొని తెలంగాణను తిరిగి జయించడానికి పద్మనాయకులు ప్రయత్నించారు. జలాల్‌ఖాన్, సికిందర్ బాలకొండలో స్వతంత్రం ప్రకటించుకున్నారు. వీరు పద్మనాయకులతో స్నేహం చేశారు. హుమాయూన్ తిరుగుబాట్లను అణచివేసి, దేవరకొండను ముట్టడించాడు. పద్మనాయకులు 1461లో బహమనీ సైన్యాలను పారదోలి రాచకొండ, భువనగిరి, ఓరుగల్లు మొదలైన దుర్గాలను తిరిగి పొందగలిగారు. పద్మనాయకులకు కపిలేశ్వర గజపతి కుమారుడైన హంవీరుడు సహాయం చేశాడు. తెలంగాణలో బహమనీలకు స్థానం లేకుండా చేశారు. హుమాయూన్‌షా తర్వాత నిజాంషా కాలంలో బహమనీలు తెలంగాణను తిరిగి ఆక్రమించే ప్రయత్నం చేశారు. కపిలేశ్వరుని సాయంతో పద్మనాయకులు వారిని ప్రతిఘటించారు.
కొంత కాలానికి గజపతుల్లో అంతఃకలహాలు తలెత్తాయి. ఇదే అదనుగా తెలంగాణను జయించడానికి మూడో మహమ్మద్‌షా తన సేనాని అయిన నిజాం ఉల్‌ముల్క్ ఇబ్రహీంను పంపాడు. 1475 నాటికి తెలంగాణ మొత్తం బహమనీల వశమైంది. పద్మనాయక రాజ్యం అంతరించింది. అనంతరం బహమనీలు తెలుగు దేశాన్నంతా జయించి రెండు భాగాలుగా విభజించారు. తెలంగాణకు ఓరుగల్లు రాజధాని కాగా, రెండో భాగానికి రాజధాని రాజమహేంద్రవరం. మూడో మహమ్మద్‌షా 1481లో కంచి మీద దాడి చేసే నాటికి రాజమహేంద్రవరం, తెలంగాణ తరఫ్‌లను బహ్రీ నిజాం ఉల్‌ముల్క్, ఆజంఖాన్‌ల ఆధీనంలో ఉంచాడు.
చదవండి: Telangana History for Competitive Exams: కాకతీయానంతర యుగం... రాజధానిని రాచకొండకు మార్చింది...
బహమనీ రాజ్య విచ్ఛిన్నం
మూడో మహమ్మద్‌షా 1482లో మరణించడంతో బహమనీ రాజ్యం విచ్ఛిన్నం కావడం మొదలైంది. ఇతడి తర్వాత రాజైన మహమూద్ షా కాలంలో ఓరుగల్లు పాలకుడైన ఆదిల్‌ఖాన్ మరణించాడు. రాజమహేంద్ర పాలకుడైన కివాన్ ఉల్‌ముల్క్ తన రాజ్యాన్ని కోల్పోయి ఓరుగల్లును ఆక్రమించాడు. సుల్తాన్ అతణ్ని పారదోలాడు. సుల్తాన్ నలుగురు కుమారుల్లో చివరి వాడైన కలీముల్లా 1537లో మరణించాడు. దీంతో బహమనీ వంశం అంతరించింది. 1500 ప్రాంతంలో బహమనీ సామ్రాజ్యం నుంచి అయిదు స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి.
రాజ్యాలు – స్థాపకులు
అహ్మద్‌నగర్ – నిజాం షా
బీజాపూర్ – ఆదిల్ షా
గోల్కొండ – కుతుబ్ షా
బీరారు – ఇమాదుల్ ముల్క్
బీదర్ – బరీద్ ఇమమాలిక్
వీటిలో గోల్కొండ రాజ్యం తెలంగాణ భూభాగంలో ఏర్పడింది.
పద్మనాయకుల పాలనా విశేషాలు
పాలనా విధానం
పద్మనాయకులు పాలనలో కాకతీయులను అనుసరించారు. పాలనా వ్యవహారాల్లో ప్రధానులు, సేనానులు, పురోహితులు రాజుకు సలహా ఇచ్చేవారు. పద్మనాయక రాజ్యంలో రాచకొండ, దేవరకొండ, అనుముల, పొడిచేడు, ఆమనగల్లు, అనంతగిరి, ఉర్లుకొండ, ఉండ్రుగొండ, స్తంభగిరి, ఓరుగల్లు, భువనగిరి, జల్లపల్లి, పానగల్లు మొదలైన దుర్గాలు ఉండేవి. వీటికి దుర్గాధ్యక్షులు ఉండేవారు. వీరు సైన్యాన్ని పోషించి పద్మనాయకులకు యుద్ధాల్లో తోడ్పడేవారు. రాజ్య విభాగాల్లో ముఖ్యమైంది ‘సీమ’. గ్రామం రాజ్యానికి పునాది. గ్రామాల్లో పన్నెండు రకాల వృత్తి పనివాళ్లు ఉండేవారు.
పన్నులు: రాజ్యానికి భూమి మీద వచ్చే పన్నులే ప్రధాన ఆదాయం. పంటలో 1/6వ వంతు శిస్తు రూపంలో వసూలు చేసేవారు. పద్మనాయకులు పొరుగు రాజ్యాలైన విజయనగర,రెడ్డి, గజపతులు, బహమనీ సుల్తాన్లతో నిరంతరం యుద్ధాలు చేయడం వల్ల ప్రజల మీద పన్నుల భారం ఎక్కువగా పడింది.
చదవండి: Telangana History for Competitive Exams: బహమనీ రాజ్యస్థాపనకు సహాయం చేసిందెవరు?
ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయం
పద్మనాయకులు కాకతీయుల వ్యవసాయ విధానాన్నే అనుసరించారు. అనపోత సముద్రం, రాయసముద్రం, నాగ సముద్రం, పర్వతరావు తటాకం, వేదగిరి తటాకం మొదలైన తటాకాలను తవ్వించారు. ఏతాము, రాట్నాల ద్వారా కూడా పొలాలకు నీటి వసతి కల్పించేవారు. ‘కాలమెడసేసిన / ఏతములెత్తి కాల్వలున్ పాయలు, కోళ్లు, నూతులను / బావులు రాట్నములున్ బలార్థమై’ అన్న కొరవి గోపరాజు పద్యం తరీ (పొలం) సేద్యంలో వచ్చిన కొత్త మార్పును తెలుపుతుంది. గ్రావిటీ పద్ధతిలో నీరందించే చెరువులతోపాటు నూతన నీటి పారుదల పద్ధతులు వచ్చినట్టు తెలుస్తోంది. కరవు సమయాల్లో గ్రావిటీ పద్ధతిలో నీరందని పొలాలకు కూడా నీరందించే కొత్త పద్ధతులు, సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. అవి.. ఏతాము, పర్రెకాల్వలు, కోల్(కోళ్లు) బావులు (వాగుల నుంచి వచ్చే నీళ్లను గుంతలకు మళ్లించి వాటి నుంచి మోట ద్వారా తరలించే పద్ధతి), నూతులు, రాట్నాలు, మోటలు. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. పోతన కూడా వ్యవసాయం చేయడమే దీనికి నిదర్శనం. వరి, జొన్న, సజ్జ, చెరకు, నువ్వులు, పత్తి మొదలైనవి నాటి ముఖ్య పంటలు, అరటి, ద్రాక్ష తోటలు కూడా ఉండేవి.
పరిశ్రమలు
నాటి పరిశ్రమల్లో నేత పరిశ్రమదే అగ్రస్థానం. వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా రంగుల పరిశ్రమ ఉండేది. ‘సింహాసన ద్వాత్రింశిక’ అనే గ్రంథంలో పలు రకాల పట్టువస్త్రాల ప్రస్తావన కనిపిస్తుంది. ఓరుగల్లు, దేవరకొండ, గోల్కొండ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమ కేంద్రాలుగా ఉండేవి. నిర్మల్ కత్తులు విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందాయి.
చదవండి: History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి
వ్యాపారం
ఈ కాలంలో ఉక్కు, గాజు, అద్దాలు, కాగితం వాడుకలోకి వచ్చాయి. వైశ్య, తెలగ, బలిజలు వ్యాపారం చేసేవారు. కృష్ణానది పక్కన ఉన్న వాడపల్లి పద్మనాయకుల వ్యాపార కేంద్రం.
సాంఘిక పరిస్థితులు
వర్ణాశ్రమ ధర్మం స్థూలంగా అమల్లో ఉండేది. బ్రాహ్మణుల్లో వైదిక, నియోగి భేదాలు ఏర్పడ్డాయి. వెలమ, రెడ్డి కులాలకు చెందిన కొందరు వ్యవసాయాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. మిగిలిన శూద్ర కులాల వారు వ్యవసాయం, వృత్తి పనులను అవలంభించారు. వైష్ణవ భక్తి ఉద్యమం వల్ల అన్ని కులాల్లో భక్తిభావం పెరిగింది. విద్యాభిలాష మొలకెత్తింది. ప్రజలు అధిక వడ్డీలు చెల్లించాల్సి వచ్చేది. నాటి పురుషులు ధోతి, అంగీ, ఉత్తరీయం, తలపాగ ధరించేవారు. స్త్రీలు రవిక, కాసెకట్టు, రంగుల చీరలు ధరించేవారు. ప్రజలు భజనలు, కోలాటాలు,వీధి నాటకాలు, కోడి పందేలు, ఓమన గుంటలాట, గచ్చకాయలాట, పుంజీతం లాంటి క్రీడలతో వినోదించేవారు. సామాన్య ప్రజలు పేదరికం కారణంగా చదువుకోలేకపోయేవారు.
తెలంగాణలో ఇప్పటికీ ‘సాకబోయడం’ అనే ఆచారం ఉంది. ఇది పూర్వం నుంచే ఉందని సింహాసన ద్వాత్రింశిక ఆధారంగా తెలుస్తోంది. కొరవి గోపరాజు ఏకశిలా నగరాన్ని ఓరుగల్లుకు పర్యాయ పదంగా వాడటాన్ని బట్టి వరంగల్లుకే ఏకశిలానగరమనే మరో పేరు ఉందని తెలుస్తోంది. కొరవి గోపరాజు ‘దివ్వెల పండుగ’అనే పదప్రయోగం చేశారు. దీన్ని బట్టి తెలంగాణలో దీపావళిని ‘దివిలి పండుగ’ అని కూడా పిలిచే అలవాటు ఆ కాలం నుంచే ఉందని తెలుస్తోంది. పార్శీ భాష ప్రభావం మొదలైంది. తెలుగు ప్రజల వేషధారణపై కూడా పార్శీ ప్రభావం పడింది. దూదేకుల(పింజారులు) కులం ఉనికిలోకి వచ్చింది. ముస్లింల దండయాత్రల వల్ల ఉత్తర భారతంలోని సతీసహగమనం తెలంగాణలోనూ అక్కడక్కడా కొన్ని ఉన్నత వర్గాల్లో కనిపించేది. తెలంగాణ సాంఘిక జీవితానికి ప్రతిబింబం సింహాసన ద్వాత్రింశిక. బతుకమ్మ, కోలాటం, హోళీ తదితర పండగలు ప్రాచుర్యం పొందాయి.
చదవండి: Telangana History Important Bits: తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు?