DNA Fingerprinting: డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌

డీఎన్‌ఏ అణువులోని నత్రజని క్షారాల వరస క్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి, ఆ డీఎన్‌ఏ ఇతర ఏ వ్యక్తి డీఎన్‌ఏతో పోలి ఉంటుందో నిర్ధారించే పరీక్షను 'డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌' అంటారు. ఇంగ్లండ్‌లోని లీచెస్టర్‌ యునివర్సిటీకి చెందిన అలెక్‌ జెఫ్రీస్‌ 'డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ ప్రక్రియ'ను మొదటిసారిగా 1985లో  రూపొందించాడు.
ఏ ఇద్దరు వ్యక్తుల డీఎన్‌ఏ వరస క్రమం కచ్చితంగా ఒకే విధంగా(సమరూప కవలల్లో తప్ప) ఉండదు. అయితే మానవుడి డీఎన్‌ఏ అణువులో ఉండే 3 బిలియన్ల న్యూక్లియోటైడ్‌లలో 99.9% ఇతర వ్యక్తుల డీఎన్‌ఏను పోలి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వ్యక్తిగత వైవిధ్యాలు కేవలం 0.1 శాతం న్యూక్లియోటైడ్‌లలోమాత్రమే ప్రధానంగా కనిపిస్తాయి. ఈ విధంగా ఒక వ్యక్తి డీఎన్‌ఏలోని న్యూక్లియోటైడ్‌ల వరస క్రమంలోని వైవిధ్యం డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌కు మూలాధారం.
డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌లో 4 రకాల  డీఎన్‌ఏ మార్కర్‌లను ఉపయోగిస్తారు. 
అవి.. RFLP, VNTR, STR, SNP.

చ‌ద‌వండి: Biology Practice Test

సేకరించే నమూనాలు
నేరం జరిగిన ప్రదేశంలో లభించే రక్తం (ముఖ్యంగా తెల్ల రక్త కణాలు), తల వెంట్రుకల మూలాలు, వీర్యం, యోని స్రావం, చర్మంలోని కొంత భాగం లేదా చాలా కాలం కిందట పూడ్చిపెట్టిన శవం ఎముకల నుంచి డీఎన్‌ఏను సేకరిస్తారు.

దోషిని గుర్తించే పద్ధతి
సేకరించిన డీఎన్‌ఏను పీసీఆర్‌ ప్రక్రియ ద్వారా అనేక వందల రెట్లు పెంచి ఆ నేరానికి సంబంధించిన అనుమానిత వ్యక్తి రక్తం నుంచి సేకరించిన డీఎన్‌ఏ స్వరూపంతో సరిపోల్చి నేరాన్ని నిర్ధారిస్తారు.

భారత్‌లో డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌
మనదేశంలో ఈ పద్ధతిని మొదటిసారిగా ఉపయోగించి, వ్యాప్తిలోకి తెచ్చినవారు సీసీఎంబీ డైరెక్టర్‌ డా. లాల్జీసింగ్‌. ఈయన కేరళలోని న్యాయస్థానంలో దాఖలైన అత్యాచార కేసులో దోషిని గుర్తించడంలో ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. 
ఈ పరీక్ష జరిపే 'సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌' సంస్థను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు.

చ‌ద‌వండి: Study Material

అనువర్తనాలు

  1. ఫోరెన్సిక్‌ విశ్లేషణ ద్వారా దొంగలు, హంతకులు, అత్యాచారం చేసినవారిని గుర్తించవచ్చు. తల్లిదండ్రులు - పిల్లల మధ్య ఉన్న రక్త సంబం«ధాన్ని నిర్ధారించవచ్చు.
  2. అంతరించిపోయే జాతుల సంరక్షణకు దీన్ని ఉపయోగిస్తున్నారు.
  3. మెడికో, లీగల్‌ వివాదాల పరిష్కారాల్లో డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ ద్వారా మాతృత్వం, పితృత్వాన్ని కచ్చితంగా కనుక్కోవచ్చు. 
  4. జంతువులు, మానవుల వర్గ వికాస చరిత్రను తెలుసుకోవచ్చు.

#Tags