TGPSC Group 2 Cut Off: గ్రూప్‌ 2 కటాఫ్‌ ఎంతంటే!.. పేపర్‌ వారీ విశ్లేషణ ఇలా..

టీజీపీఎస్సీ గ్రూప్‌–2.. రాష్ట్ర స్థాయిలో నాయిబ్‌ తహశీల్దార్, ఏసీటీఓ, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర పోస్ట్‌ల భర్తీకి నిర్వహించిన పరీక్ష! గత నెల 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌ 2 పరీక్షకు 2.5 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు! ఇప్పుడు వీరందరిలో ఒకటే సందేహం.. గ్రూప్‌–2 కటాఫ్‌ మార్కులు ఎంత ఉంటాయి? అనేదే!! మరోవైపు.. ఔత్సాహికుల్లో గ్రూప్‌–2 పేపర్‌ సరళి ఎలా ఉంది.. భవిష్యత్తు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి? అనే సందేహాలు. ఈ నేపథ్యంలో.. రెండు రోజులపాటు మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించిన తెలంగాణ గ్రూప్‌–2లో.. పేపర్‌ వారీ విశ్లేషణ.. నిపుణుల కటాఫ్‌ అంచనా తదితర వివరాలు..
  • 783: టీజీపీఎస్సీ గ్రూప్‌–2 పోస్ట్‌ల సంఖ్య.
  • 5,51,855: గ్రూప్‌ 2కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.
  • 2,51,486: గ్రూప్‌–2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు..
  • స్థూలంగా చూస్తే గ్రూప్‌–2 పరీక్షకు సంబంధించిన గణాంకాలు ఇవి! దరఖాస్తు చేసుకున్న వారి లో సగానికి పైగా అభ్యర్థులు గైర్హాజరు కావడంతోపాటు పరీక్ష కటాఫ్‌ విషయం ఇప్పుడు పోటీ పరీక్షల అభ్యర్థుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

పేపర్‌–1 క్లిష్టంగా

టీజీపీఎస్సీ గ్రూప్‌–2 పేపర్ల సరళిని పరిశీలిస్తే.. పేపర్‌–1 బాగా కష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనరల్‌ స్టడీస్‌ పేరిట నిర్వహించిన ఈ పేపర్‌లో ప్రభుత్వా­ల విధానాలు, అంతర్జాతీయ అంశాలు, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రీజనింగ్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో.. వాటికి సరైన సమాధానాలు గుర్తించే విషయంలో అభ్యర్థులు సమయాభావానికి లోనయ్యారు. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్, నీతి ఆయోగ్, కాగ్, ఇస్రో, జాతీయ అవార్డులు, జాగ్రఫీలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టింది. ఇంగ్లిష్‌పై 20 వరకూ ప్రశ్నలు అడిగారు. అయితే ఇవి సుదీర్ఘంగా ఉండటం అభ్యర్థులను ఇబ్బందిపెట్టింది. మొత్తంగా ఈ పేపర్‌ అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని, లోతైన అవగాహనను పరిశీలించేలా ఉందనే వాదన వినిపిస్తోంది. 

చదవండి: TGPSC Group 2 Candidates : భారీగా త‌గ్గిన టీజీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్య‌ర్థుల సంఖ్య‌.. కార‌ణం ఇదే..!

పేపర్‌–2 ఓ మోస్తరు క్లిష్టత

గ్రూప్‌–2 రెండో పేపర్‌ విషయంలో మాత్రం అభ్యర్థులు కొంత ఉపశమనం లభించిందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జోగిని వ్యవస్థ, తెలంగాణ జిల్లాలు, స్థానిక సంస్థల అధికారాలు, ఆయా సామాజిక వర్గాలకు చెందిన కమిషన్ల గురించి ప్రశ్నలు అడిగారు. వీటికి సమాధానం ఇవ్వడం పెద్ద కష్టంగా లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అయితే తెలంగాణ హిస్టరీకి సంబంధించి అడిగిన ప్రశ్నలు బాగా క్లిష్టంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. కుతుబ్‌షాహీలు, రాంజీగొండు, ఆంధ్ర మహాసభ సమావేశాలు వంటి ప్రశ్నలకు సరైన మ్యాచింగ్‌ ఎంచుకోవడం కొంత కష్టంగా మారింది.

పేపర్‌–3 బాగా కఠినంగా

ఎకానమీ అంశాలతో ఉండే పేపర్‌–3 మాత్రం అత్యంత క్లిష్టంగా ఉందని ఎక్కువ మంది అభ్యర్థులు పేర్కొంటున్నారు. బడ్జెట్, సర్వేలతోపాటు ప్రభుత్వ పథకాలు, పంటలు, జనాభాకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ఎకానమీలోని అన్ని అంశాలపై గణాంక సహిత పరిపూర్ణ పరిజ్ఞానం ఉన్న వారికే సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతేకాకుండా 2011–2013 మధ్య కాలంలోని గణాంకాలపై ప్రశ్నలు ఇచ్చారు. దీంతో సమకాలీన పరిణామాల ఆధారంగా ప్రిపరేషన్‌ సాగించిన అభ్యర్థులు సమాధానాలు గుర్తించడంలో ఇబ్బందికి గురయ్యారు. అసెర్షన్‌ అండ్‌ రీజన్‌ ప్రశ్నలు ఎక్కువగా అడగడంతో సమాధానాలు గుర్తించేందుకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని అభ్యర్థులు అంటున్నారు.

చదవండి: UPSCని సందర్శించిన TGPSC బృందం.. ఇక‌పై ఇలా..

పేపర్‌–4 తేలికగానే

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం అంశాలు ఉండే పేపర్‌ ఇది. ఇది కొంత సులభంగానే ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. ఊహించిన రీతిలోనే తెలంగాణ ప్రాధా­న్యం గల అంశాలపైనే ప్రశ్నలు అడిగారు. తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు, సంస్థలు, పార్టీలు, కమిటీలు, రైతు ఉద్యమాలు, నిజాం పరిపాలన గురించి ప్రశ్నలు అడిగారు. అయితే ఇందులో చంద్రబాబు విజన్‌ డాక్యుమెంట్‌ –2020, ఆంధ్ర కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల గురించి అడగడంతో అభ్యర్థులు విస్మయానికి గురయ్యారు. వీటిపై ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడంతో దాదాపు పది ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయామని అభ్యర్థులు చెబుతున్నారు.

స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలు

గ్రూప్‌–2లో ఈసారి స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. దీంతో సమాధానాలు ఇచ్చేందు­కు అభ్యర్థులు కొంత తికమకకు గురయ్యారు. అదే విధంగా మ్యాచింగ్‌ టైప్‌ కొశ్చన్స్, క్రానాలజీ ఆర్డర్‌ ప్రశ్నల సంఖ్య కూడా అధికంగానే ఉంది. అదే విధంగా అసెర్షన్‌ అండ్‌ రీజన్‌ ప్రశ్నలకు దగ్గరి పోలిక ఉండడంతో సరైన సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థులు ఆందోళన చెందారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎకానమీలో స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం చాలా క్లిష్టంగా మారిందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. 

పట్టు సాధిస్తేనే

అన్ని పేపర్లను పరిశీలిస్తే.. అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లలో పూర్తిగా పట్టు సాధిస్తేనే సమాధానాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. సమకాలీన అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం. అదే విధంగా పాత గణాంకాలకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. దీంతో తాజా గణాంకాలకు పరిమితమైన అభ్యర్థులు ఇబ్బందికి గురయ్యారు.

మెయిన్స్‌ అభ్యర్థులకు సైతం

టీజీపీఎస్‌సీ గ్రూప్‌–2కు గ్రూప్‌–1 మెయిన్స్‌కు హాజరైన వారు కూడా ఉన్నారు. అయితే వీరు కూడా గ్రూప్‌–2 పేపర్లకు సమాధానాలు గుర్తించడం కష్టంగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా జనరల్‌ స్టడీస్, ఎకానమీపై నిడివి ఎక్కువ ఉన్న ప్రశ్నలు ఎదురవడం, తాజా అంశాలు కాకుండా పాత గణాంకాలపై ప్రశ్నలు అడగడంతో.. తమ ప్రిపరేషన్‌కు భిన్నంగా ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంటున్నారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

లోతైన అవగాహనతోనే సక్సెస్‌

గ్రూప్‌–2 ప్రశ్నలు అంచనాలకు అందని విధంగా ఉన్నాయి. దీంతో టీజీపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లపై లోతైన అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సదరు అంశాలకు సంబంధించి పూర్వాపరాల నుంచి సమకాలీన పరిణామాల వరకూ.. అన్నింటిపైనా పట్టు సాధించాలని పేర్కొంటున్నారు. అదే విధంగా ప్రిపరేషన్‌ సమయంలోనే స్టేట్‌మెంట్స్, అసర్షెన్‌ అండ్‌ రీజన్, మ్యాచింగ్‌ టైప్‌ కొశ్చన్స్‌ను బాగా ప్రాక్టీస్‌ చేయాలని సలహా ఇస్తున్నారు. ఫలితంగా పరీక్ష హాల్లో సమయాభావ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చని పేర్కొంటున్నారు. 

ఓపెన్‌ కేటగిరీలో 400?

గ్రూప్‌ 2 ప్రశ్నలు క్లిష్టంగా, సుదీర్ఘంగా వచ్చిన నేపథ్యంలో కటాఫ్‌పై అంచనాకు రావడం అంతతేలిక కాదని చెబుతున్నారు. అయితే ప్రశ్న పత్రాల సరళి, అభ్యర్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీ­సుకున్న సబ్జెక్ట్‌ నిపుణులు.. ఓపెన్‌ కేటగిరీలో 400 వరకు కటాఫ్‌ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ కేటగిరీలో 370నుంచి 390మధ్యలో;ఎస్సీ కేటగిరీ­లో 360;ఎస్టీ కేటగిరీలో 360 వరకు కటాఫ్‌గా నిలిచే అవకాశముందని ప్రాథమికంగా పేర్కొంటున్నారు. 

టీజీపీఎస్సీ గ్రూప్‌–2.. ముఖ్యాంశాలు

  • అసెర్షన్‌ అండ్‌ రీజన్, స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలకు ప్రాధాన్యం. ఊ సమకాలీన అంశాలతోపాటు కోర్‌ అంశాలకూ ప్రాధాన్యం.
  • లోతైన అవగాహన ఉంటేనే సమాధానాలు ఇచ్చేలా ప్రశ్నలు. ఊ తెలంగాణకు సంబంధంలేని ప్రశ్నలతో అభ్యర్థుల విస్మయం.
  • ఓపెన్‌ కేటగిరీలో 400 వరకు కటాఫ్‌ ఉంటుందనే అంచనా. 

#Tags