HMs Suspended: 11 మంది హెచ్‌ఎంల సస్పెన్షన్‌.. కార‌ణం..

సాక్షి, హైదరాబాద్‌: టీచర్ల బదిలీల్లో స్పౌజ్‌ పాయింట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై 11 మంది పాఠశాల ప్రధానోపాధ్యాయులను విద్యాశాఖ సస్పెండ్‌ చేసింది.

వారిపై విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయం నిర్ణయించింది. 2023 సెప్టెంబర్‌లో హెచ్‌­ఎంల మల్టీ జోనల్‌ స్థాయి బదిలీలు జరిగాయి. భార్యా­భర్తలు ఉద్యోగులైనప్పుడు ఒకేచోట పనిచేసేందుకు నిబంధనలు సహకరిస్తాయి. ప్రభుత్వం అందుకు కొన్ని పాయింట్లు కేటాయిస్తుంది. ఈ విభాగంలో కొందరు దరఖాస్తు చేసుకోగా వారిలో 11 మంది హెచ్‌ఎంలపై విద్యాశాఖకు ఫిర్యాదులు వచ్చాయి.

ఉమ్మడి మహ­బూబ్‌­నగర్, జనగాం జిల్లాల్లో కొంత మంది టీచర్లు వాళ్లకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ ఆప్షన్లు ఇచ్చు­కు­న్నారని, దీనికి స్పౌజ్‌ పాయింట్లు వాడుకున్నారన్న ఆరోప­ణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై జిల్లాల్లో కమిటీ­లను ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు విచారణ జరిపా­రు.

చదవండి: Anganwadis Services: అంగన్‌వాడీల సేవలు వెలకట్టలేం

కమిటీ నివేదిక ఆధారంగా 11 మంది హెచ్‌ఎంలను సస్పెండ్‌ చేశారు. అయితే జిల్లాలో ఎక్కడైనా స్కూల్‌కు వెళ్లేందుకు హెచ్‌ఎంలకు హక్కు ఉంటుందని, విద్యాశాఖ అధికారులు మాత్రం దీన్ని విస్మరించి దగ్గర్లో ఉన్న స్కూల్‌ను కాదని.. ఎక్కువ దూరం ఉన్న స్కూల్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించడం సరికాదని హెచ్‌ఎంలు అంటున్నారు.

ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ జరిగేటప్పుడు ఏ స్కూల్‌ ఎంత దూరంలో ఉందని ఎలా చూస్తారని, కేటాయించిన జిల్లానా? కాదా? అనేదే ముఖ్యమని వాదిస్తున్నారు.

ఇది సమంజసం కాదు..
అనవసర కారణాలతో హెచ్‌ఎంలను సస్పెండ్‌ చేయడం సమంజసం కాదు. హెచ్‌ఎం పోస్టు మల్టీజోనల్‌. బదిలీల సాఫ్ట్‌వేర్‌ అనుమతించిన స్కూళ్లనే వాళ్లు ఎంపిక చేసుకున్నారు. ఇది స్పౌజ్‌ పాయింట్లు దుర్వినియోగం చేయడం కాదు. వారిపై తక్షణమే సస్పెన్షన్‌ ఎత్తేయాలి.
– పి. రాజా భానుచంద్రప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  

#Tags