ICC Rankings: ప్రపంచ నంబర్ వ‌న్‌ బౌల‌ర్‌గా జస్ప్రీత్ బుమ్రా..

ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో 30 ఏళ్ల బుమ్రా మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్‌లో తొలిసారి ఈ ఫార్మాట్‌లో టాప్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

విశాఖపట్నంలో ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన రెండో టెస్టులో బుమ్రా తన పేస్‌ పదునుతో తొమ్మిది వికెట్లు (6/45; 3/46) పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించడంతోపాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం గెల్చుకున్నాడు.

బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 881 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. గత ర్యాంకింగ్స్‌లో ‘టాప్‌’ ర్యాంక్‌లో ఉన్న భారత స్పిన్నర్‌ అశ్విన్‌ రెండు స్థానాలు పడిపోయి 841 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడ 851 రేటింగ్‌ పాయింట్లతో రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

ఇప్పటి వరకు భారత్‌ నుంచి నలుగురు బౌలర్లు మాత్రమే ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచారు. గతంలో భారత స్పిన్నర్లు బిషన్‌సింగ్‌ బేడీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ ఘనత సాధించగా.. పేస్‌ బౌలర్‌ రూపంలో బుమ్రా తొలిసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు 34 టెస్టులు ఆడిన బుమ్రా 155 వికెట్లు తీసుకున్నాడు.

తాజా టాప్‌ ర్యాంక్‌తో బుమ్రా మరో రికార్డు కూడా నెలకొల్పాడు. క్రికెట్‌ చరిత్రలో మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. బుమ్రా 2017 నవంబర్‌ 4న తొలిసారి టి20 ఫార్మాట్‌లో.. 2018 ఫిబ్రవరి 4న తొలిసారి వన్డే ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు.

ప్రస్తుతం బుమ్రా వన్డేల్లో ఆరో ర్యాంక్‌లో, టి20ల్లో వందో ర్యాంక్‌లో ఉన్నాడు. మరోవైపు టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 37 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంక్‌లో నిలిచాడు. 

టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌ వరుస ఇలా..
1. బుమ్రా
2. రబాడ
3. అశ్విన్‌
4. కమిన్స్‌
5. హాజిల్‌వుడ్‌
6. ప్రభాత్‌ జయసూర్య
7. జేమ్స్‌ఆండర్సన్‌
8. నాథన్‌ లయోన్‌
9. రవి జడేజా
10. ఓలీ రాబిన్సన్‌

Ranji Trophy: "12th ఫెయిల్ సినిమా" డైరెక్టర్‌ కొడుకు ప్రపంచ రికార్డు.. వరుసగా నాలుగు సెంచరీలు..!

#Tags