Vikram-S: అంతరిక్ష రంగంలో తెలుగు తేజం నాగభరత్‌

భారత అంతరిక్ష రంగంలో నవశకం ఆరంభం కాబోతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లేందుకు ఓ ప్రైవేట్‌ రాకెట్‌ సిద్ధమవుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే.. భవిష్యత్‌లో అంతరిక్ష యానం మరింత సులభతరం కానుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ నెలలోనే శ్రీహరికోట నుంచి మూడు పేలోడ్‌లతో కూడిన ఈ ప్రైవేట్‌ రాకెట్‌ రోదసి బాట పట్టనుంది.
Skyroot to launch India's 1st privately developed rocket Vikram-S

 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో స్కైరూట్‌ ఏరో స్పేస్‌ స్టార్టప్‌ సంస్థ తయారు చేసిన రాకెట్‌ ఈ నెల 16 లేదా 18న రోదసిలోకి దూసుకుపోనుంది. రాకెట్‌ రూపకర్తల్లో విశాఖకు చెందిన నాగభరత్‌ దాకా (33) ఒకరు కాగా.. మరొకరు హైదరాబా ద్‌కు చెందిన చందన్‌ పవన్‌కుమార్‌. వీరిద్దరూ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పేరిట స్టార్టప్‌ సంస్థను ప్రారంభించారు. వ్యవస్థాపకులలో ఒకరిగా.. చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీవోవో)గా వ్యవహరిస్తున్న నాగభరత్‌ విశాఖలోనే విద్యను అభ్యసించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఆధ్వర్యంలో రూపొందించిన విక్రమ్‌–ఎస్‌ అంతరిక్ష ప్రయాణా నికి సిద్ధమవుతూ చరిత్ర సృష్టించబోతోంది.

Also read: ISRO: సీఈ20 ఇంజన్ పరీక్ష విజయవంతం

భీమిలిలో బీజం
విశాఖ శివారు భీమిలిలోని అనిల్‌ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (అనిట్స్‌) ఫౌండర్‌ ప్రిన్సిపల్‌గా వ్యవహరించిన డాక్టర్‌ రఘురామిరెడ్డి కుమారుడు నాగభరత్‌. 1999 నుంచి 2001 వరకూ రుషి వ్యాలీ స్కూల్‌లో విద్యనభ్యసించిన ఆయన 2001 నుంచి 2005 వరకు నగరంలోని లిటిల్‌ ఏంజల్స్‌ హైస్కూల్‌లో ఉన్నత విద్య పూర్తి చేశారు. అనంతరం ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూరి చేసుకొని 2012 అక్టోబర్‌ నుంచి 2015 మే వరకూ విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో ఇంజినీర్‌ (ఎస్‌సీ)గా విధులు నిర్వర్తించారు. తర్వాత ఉద్యోగానికి స్వస్తి చెప్పి 2018 ఆగస్ట్‌లో తోటి శాస్త్రవేత్త పవన్‌కుమార్‌ చందనతో కలిసి స్కైరూట్‌ ఏరో స్పేస్‌ అనే స్టార్టప్‌ సంస్థను హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభించారు. చిన్న చిన్న రాకెట్స్‌ మోడల్స్‌ను తయారు చేస్తూ వాటిపై పరిశోధనలు వేగవంతం చేశారు. 

Also read: ICAR-IIRR: ‘మెరుగైన సాంబమసూరి’ రకం వంగడం

రెండేళ్ల నుంచి పరిశోధనలు
ఇప్పటివరకు అంతరిక్షంలోకి రాకెట్లను పంపించేందుకు ఇస్రోకు మాత్రమే అనుమతులు ఉండేవి. అయితే, రెండేళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థల కూడా అడుగు పెట్టేందుకు ఇస్రో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అప్పటి నుంచి నాగభరత్, పవన్‌కుమార్‌ కలిసి దేశ అంతరిక్షంలోకి అడుగుపెట్టే మొదటి ప్రైవేట్‌ రాకెట్‌ తమదే కావాలన్న లక్ష్యంతో పరిశోధనలు ప్రారంభించారు. అనేక సంస్థల నుంచి పోటీ ఎదురైనా.. వాణిజ్య అవసరాలు తీర్చేలా స్నేహితులిద్దరూ ముందుగా రాకెట్‌ తయారు చేసి రికార్డు సృష్టించారు. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడైన విక్రమ్‌ అంబాలాల్‌ సారాభాయ్‌కు నివాళిగా తొలి ప్రైవేట్‌ రాకెట్‌కు విక్రమ్‌–ఎస్‌ (శరభి) అని నామకరణం చేశారు. తొలుత ఈ ప్రైవేట్‌ రాకెట్‌ను నవంబర్ 15న ప్రారంభించాలని భావించగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నవంబర్ 16 లేదా 18వ తేదీన ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

Also read: Artificial Intelligence: నిమిషాల్లో వ్యాధి నిర్ధారణకు సరికొత్త ఏఐ సాధనం

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంచ్‌ప్యాడ్‌ నుంచి ఈ రాకెట్‌ ప్రయోగం చేయనున్నారు. ప్రస్తుతం చేపట్టబోయే ప్రయోగం డెమాన్‌స్ట్రేషన్‌ మాత్రమే. ఇందులో మూడు శాటిలైట్లను పంపిస్తున్నారు. తొలి ప్రైవేట్‌ రాకెట్‌ కావడంతో ఈ ఆపరేషన్‌కు ‘ప్రారంభ్‌ మిషన్‌’ గా నామకరణం చేశారు. విక్రమ్‌ పేరుతో మూడు రకాల రాకెట్లను తయారు చేస్తున్నారు. 

రాకెట్ల ధరలు తగ్గే చాన్స్‌!: భారత అంతరిక్ష రంగంపై ఇస్రో ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. కానీ, దాని బడ్జెట్‌ పరిమితులతో అనుకున్నంత వేగంగా పరిశోధనలు జరగడంలేదన్నది వాస్తవం. ఈ కారణంగా స్పేస్‌ రంగంలో ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థలకు ద్వారాలు తెరిచింది. ఇస్రో, బీహెచ్‌ఈఎల్‌ సహకారంలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ తయారీకి వివిధ సంస్థలతో కలిసి కన్సార్టియం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది విజయవంతమైతే భవిష్యత్‌లో రాకెట్ల ఖర్చు మరింత తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి.

Also read: IN COME-17': మిశ్రధాతువులపై దృష్టిపెట్టాలి: రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్‌ జి.సతీశ్‌ రెడ్డి

#Tags