AP ITI Admission 2024: ఐటీఐ చదువుతుండగానే జాబ్ ట్రైనింగ్.. ఈ కోర్సు పూర్తయితే ఉద్యోగం సులువే..!
ఈ మేరకు ఐటీఐ కళాశాలల్లో వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు శిక్షణ అందిస్తోంది. త్వరితగతిన ఉద్యోగాలు పొందేలా కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏటా వేలాది మంది యువతీయువకులు జీవితంలో స్థిరపడేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఐటీఐలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. అనంతరం కోర్సులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దృష్టి సారించారు. ఇప్పటికే పాలిసెట్, రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. పలువురు విద్యార్థులు ఏ కోర్సులో చేరాలా అని ఆలోచన చేస్తున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరగా, కొందరు పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు.
పదోతరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు చక్కని బాటను ఏర్పాటు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐటీఐ పూర్తి చేసినవారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సైతం అవకాశంగా పొందవచ్చని సూచిస్తున్నారు. సాంకేతిక కోర్సుల్లో ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ కోర్సులతో పాటు పలువురు విద్యార్థులు ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనన్ స్టిట్యూట్)కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
ITI Admissions 2024: ఐటీఐలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..
అందుబాటులో 2,356 సీట్లు..
జిల్లా వ్యాప్తంగా 2024–25 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు 2,356 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలలు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి పరిశ్రమలకు అందిస్తున్నాయి. యువతకు భరోసానిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు పరుస్తున్నాయి. ఐటీఐలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన మెలకువలపై పట్టు సాధిస్తుండడంతో కోర్సు పూర్తవగానే మెండుగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
ప్రముఖ కంపెనీల్లో సైతం..
సంప్రదాయ కోర్సులతో పాటు ప్రతి ఐటీఐలోనూ ఒక్కో కోర్సుకు ప్రాధాన్యమిస్తున్నారు. చిత్తూరులోని ప్రభుత్వ ఐటీఐలో టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్ కోర్సులు చేసిన పలువురు విద్యార్థులు ప్రముఖ సంస్థలు బీహెచ్‌ఈఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్, బీఈఎల్, ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, ఇస్రో తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందారు.
మధ్యలోనే జాబ్ ట్రైనింగ్..
విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆన్‌లైన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) విధానాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులు చదువుతుండగానే మధ్యలో ఓజేటీకి పంపుతున్నారు. విద్యార్థులను హైదరాబాద్, చైన్నె, బెంగళూరు నగరాల్లోని వివిధ సంస్థల్లో మూడు నెలలు, ఆరు నెలల వ్యవధితో సంబంధిత అంశాల్లో నైపుణ్యం పెంపొందిస్తున్నారు.
ఈ సమయంలో విద్యార్థులకు ఆయా సంస్థలు స్టైఫండ్‌గా కొంత మొత్తం చెల్లిస్తుండడం గమనార్హం. అలాగే బాగా పనితీరుకనబరిచే విద్యార్థులు అదే కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 265 మంది విద్యార్థులు ఓజేటీకి వెళ్లారు.
Degree Admissions: నూతన విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తులు..
కోర్సులివే...
ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటర్ వెహికల్, (పదో తరగతి విద్యార్థతతో రెండు సంవత్సరాల కోర్సులు), వెల్డర్, మెకానికల్ డీజిల్, కంప్యూటర్ కోర్సు (పదోవతరగతి విద్యార్హతతో ఒక ఏడాది కోర్సులు) ఐటీఐ కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు www. iti.ap.gov.in వెబ్‌సైట్‌లో ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలో తొలివిడత కౌన్సెలింగ్‌కు అర్హత కల్గిన విద్యార్థులు జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇతర వివరాలకు 7799933370, 7799679351, 9493629036 నంబర్లలో సంప్రదించవచ్చు.
ఉన్నత చదువులకు అవకాశం..
ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు అనంతరం బీటెక్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.
జిల్లా సమాచారం..
ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు : 07
ప్రైవేట్ ఐటీఐ కళాశాలలు : 09
2022–23లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు : 2,372
2023–24లో ప్రవేశం పొందినవారు : 2,356
2024–25లో అందుబాటులోని సీట్లు : 2,356
Free Coaching: గ్రూప్–2 పరీక్షకు ఉచిత శిక్షణ.. శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ ఫ్రీ..
కోర్సు పూర్తయితే ఉద్యోగం సులువే..
ఐటీఐ ఉత్తీర్ణులైన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. విద్యుత్, రైల్వే, రక్షణ తదితర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు త్వరితగతిన లభిస్తున్నాయి. ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఐటీఐల్లో స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికి సైతం ఐటీఐ కోర్సు దోహదపడుతుంది.