AP New Medical colleges: కొత్త వైద్య కళాశాలలకు 380 పోస్టుల మంజూరు
అమరావతి: రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలకు 21 విభాగాల్లో 380 పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, 2023–24 విద్యా సంవత్సరంలో మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలను ప్రారంభించారు.
2024–25 విద్య సంవత్సరంలో పాడేరు, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని కళాశాలలను ప్రారంభించనున్నారు. కళాశాలకు 222, బోధన ఆస్పత్రికి 484 చొప్పున గతంలోనే కొత్త పోస్టులను మంజూరు చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, టీచింగ్ ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచడంలో భాగంగా తాజాగా మరో 380 పోస్టులను మంజూరు చేశారు.
Also Read: Govt Exams June Month Calendar
60 ప్రొఫెసర్, 85 అసోసియేట్ ప్రొఫెసర్, 75 అసిస్టెంట్ ప్రొఫెసర్, 160 ఎస్‌ఆర్/ట్యూటర్ పోస్టులకు కొత్తగా మంజూరు చేసిన వాటిలో ఉన్నాయి. కాగా, 2024–25 విద్య సంవత్సరంలో ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా శుక్రవారం 130 మంది ట్యూటర్, 37 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌లకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నియామక ఉత్తర్వులిచ్చింది.
కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సరీ్వసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థుల జాబితాలను డీఎంఈకి అందజేయగా వీరికి పోస్టింగ్‌లు ఇస్తున్నారు.