Artificial Intelligence: ఉద్యోగాలు పోనున్నాయా..?

చాలాఏళ్ల వరకు మానవ శ్రమపై ఆధారపడి సాగిన ఉత్పత్తి, రవాణా, ఇతర సేవా కార్యకలాపాలను యంత్రాలు నిర్వహించడం ప్రారంభమైంది. దాంతో ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగింది. పాత ఉద్యోగాలు పోయాయి. యంత్రాలపై పనిచేసే నైపుణ్యం అవసరమైన కొలువులు పెరిగాయి. తాజాగా కృత్రిమ మేధ వల్ల అనూహ్య మార్పులు రాబోతున్నాట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ విస్తరిస్తోంది. మనిషి చేసే ప్రతి పనినీ చక్కబెట్టేందుకు కంప్యూటర్లు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల తీరుతెన్నులు, సమాజ గమనం, ప్రజల జీవన విధానాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇప్పటిదాకా మనం చేస్తున్న ఉద్యోగాల్లో చాలా వరకు వచ్చే కొన్నేళ్లలో కనుమరుగవుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఆ స్థానంలో కొత్త తరహా ఉద్యోగాలు వస్తాయి. నైపుణ్యం, శిక్షణ ఉన్నవారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. సాధారణ, మానవ శ్రమ ఆధారిత ఉద్యోగాలు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. 

చదవండి: APSCHE: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'AI' కోర్సులు

కంపెనీలు అదే దారిలో..

దిగ్గజ టెక్‌ కంపెనీలైన ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, నెట్‌ఫ్లిక్స్‌, గూగుల్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌ సైతం కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిష్కారాల ఆవిష్కరణలో బిజీగా ఉన్నాయి. 2021 నుంచి ఇప్పటిదాకా టెక్నాలజీ కంపెనీలు, ముఖ్యంగా అంకుర సంస్థలు కృత్రిమ మేధ ప్రాజెక్టులపై దాదాపు రూ.8 లక్షల కోట్లదాకా పెట్టుబడి పెట్టినట్లు అంచనా.

వైద్యం, విద్య, ఆర్థిక సేవలు, నిర్మాణ, ఉత్పత్తి రంగాల్లో ఎన్నో మార్పులతో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తున్నాయి. 

ఉద్యోగాలు ఇలా..

సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చు. మెకిన్సే సంస్థ నివేదిక ప్రకారం నూతన సాంకేతిక మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 40-80 కోట్ల ఉద్యోగాలకు ముప్పు కనిపిస్తోంది. దాదాపు 35 కోట్ల మంది కొత్త ఉద్యోగాల్లోకి మారాల్సి వస్తుంది.

సంప్రదాయ ఉద్యోగాల్లోనే కొనసాగుదామనుకొన్నా సాధ్యం కాదు. అటువంటి పనులన్నీ కంప్యూటర్లు, వాటికి అనుసంధానమయ్యే యంత్రాలు పూర్తిచేస్తాయి. అయితే, యంత్రాలను నియంత్రించాలంటే మాత్రం మనుషులు కావాల్సిందే. అలాంటి కొత్త తరహా విధులకు సంబంధించి ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో రానున్నాయి.

కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని 1990 దశకంలో అందరూ భయపడిపోయారు. తదనంతర కాలంలో కోల్పోయిన ఉద్యోగాలకంటే అధికంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది.

కాకపోతే, నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదిఏమైనా కృత్రిమ మేధ, ఆటొమేషన్‌లతో తలెత్తే పరిణామాలకు అందరూ సిద్ధపడాల్సిందేనని చెబుతున్నారు.

#Tags