యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలు

ఒకే చోట నాలుగు గురుకులాలు

ఈ ఇంటిగ్రేటెడ్‌ గురుకుల ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన నాలుగు గురుకులాలను నాలుగు బ్లాక్‌లుగా ఒకే చోట నిర్మించనున్నారు. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు వీటిలో విద్యనభ్యసించనున్నారు.

ఒక్కో బ్లాక్‌లో 640 మంది చొప్పున 2,560 మంది విద్యార్థులు విద్యనభ్యసించే విధంగా వీటి నిర్మాణం చేపట్టనున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను కల్పించనున్నారు. వీటి ద్వారా ఏటా ఉమ్మడి జిల్లాలో మరో 7,680 మంది విద్యార్థులకు గురుకుల విద్య అందుబాటులోకి రానుంది.

ఉమ్మడి జిల్లాలో మూడు యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కులమతాలకు అతీతంగా విద్యార్థులంతా ఒకేచోట విద్యను అభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో విద్యార్థులు వసతితో పాటు బోధనాపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ మానవ వనరులు ప్రపంచంలో పోటీ పడేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒకేచోట గురుకులాలను నిర్మించి, విద్యార్థులకు సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ మూడు చోట్ల గురుకులాల ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ భవనాలను వచ్చే ఏడాది దసరా నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

చదవండి: DSC 2024: డీఎస్సీలో అర్హతల పంచాయితీ

ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల..

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్‌లో మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద 19 చోట్ల సమీకృత గురుకులాలను నిర్మించేందుకు అక్టోబర్ 11వ తేదీన భూమి పూజ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటిల్లో ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

నల్లగొండలోని ఎస్‌ఎల్‌బీసీ సమీపంలో..

ఒక్కో గురుకులాన్ని 20 నుంచి 25 ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మించబోతోంది. నల్లగొండ నియోజకవర్గంలో నిర్మించబోయే గురుకులానికి సంబంధించి అధికారులు స్థల పరిశీలన, ఎంపికను పూర్తి చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతంలో రెండు నెలల కిందటే 20 ఎకరాలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

మరో 5 ఎకరాలు కావాలని ఆదివారం ఆదేశాలు రావడంతో ఆ ఐదు ఎకరాలను అదేచోట గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈనెల 11వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరవుతారని వెల్లడించారు.

గడ్డిపల్లి, తొండ గ్రామాల్లో..

ఇక సూర్యాపేట జిల్లాలోని హూజూర్‌నగర్‌ నియోజకవర్గంలో మరో గురుకులాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాని కోసం నియోజకవర్గంలోని గరిడేపల్లిలో మండలం గడ్డిపల్లి శివారులో 20 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. మరోవైపు కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం సీతారాంపురం వద్ద కూడా 22 ఎకరాల స్థలాన్ని గుర్తించారు.

అయితే వాటిల్లో హుజూర్‌నగర్‌లో ఏర్పాటుకే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు అధికారులు పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండలం తొండ రైతు వేదిక సమీపంలోని 24 ఎకరాల ప్రభుత్వ భూమిలో గురుకులాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒకటీ రెండు రోజుల్లో భూములను ఖరారు చేసి, 11వ తేదీన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

  • నల్లగొండ, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏర్పాటు
  • ఒక్కో దాంట్లో 2,560 మంది విద్యార్థులకు ప్రవేశం
  • పూర్తయిన భూ సేకరణ..ఈనెల 11వ తేదీన శంకుస్థాపన
  • సకల సౌకర్యాలతో నిర్మాణం

కల్పించనున్న సదుపాయాలు ఇలా..

విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేలా ఈ గురుకులాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అదే ప్రాంగణంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి క్వార్టర్స్‌ నిర్మాణం, ఇన్నోవేటివ్‌ బోధనా విధానం ఉండేలా ఏర్పాటు చేయనున్నారు.

సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటుతో పాటు తరగతి గదులు, లేబోరేటరీలు, కంప్యూటర్‌ సెంటర్‌, లైబ్రరీ, ఆడిటోరియం, వసతి గృహం, డైనింగ్‌, కిచెన్‌, బహుళ వినియోగ హాస్టళ్లు, క్లబ్‌లు, వైద్యశాల, ఇండోర్‌ గేమ్స్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ మైదానాలు, బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌, టెన్నీస్‌ కోర్టులు, అవుట్‌డోర్‌ జిమ్‌, ల్యాండ్‌ స్కేప్‌ కోర్టువంటివి ఈ గరుకులాల్లో ఉండనున్నాయి.

#Tags