Sridhar Babu: ఏటా లక్ష మందికి నైపుణ్య శిక్షణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించేందుకు కృతనిశ్చయంతో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

పారిశ్రామికంగా ఉత్పాదక రంగం పురోగతి సాధిస్తుంటేనే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయన్నారు. పరిశ్రమలకు నిపుణులైన యువతను అందించాలన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రతీ సంవత్సరం దాదాపు లక్ష మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా 65 ఐటీఐలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని, ఇందుకోసం టాటా టెక్నాలజీస్‌ సంస్థ నుంచి రూ. 2,324 కోట్ల ఆర్థిక సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు.

చదవండి: Skills University: స్కిల్స్‌ యూనివర్సిటీకి ‘ఈ సంస్థ’ రూ.200 కోట్లు కేటాయింపు

భారత పరిశ్రమల సమాఖ్య ‘పరిశ్రమ 4.0 నుంచి పరిశ్రమ 5.0కు ఉత్పాదక రూపాంతర పరిణామం’ అంశంపై న‌వంబ‌ర్‌ 8న నిర్వహించిన సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మినీ–పారిశ్రామిక పార్క్‌లను ఏర్పాటు చేయనున్న ట్లు తెలిపారు.

పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, డీఆర్‌డీవో ఎలక్ట్రాని క్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బీకే దాస్, మహీంద్ర అండ్‌ మహీంద్రలో చీఫ్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ రుచా నానావతి, తెలంగాణ సీఐఐ చైర్మన్, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయి డి. ప్రసాద్, కన్వీనర్‌ వీఎస్‌ రామ్, గ్లోబల్‌ లింకర్‌ డైరెక్టర్‌ మాళవిక జగ్గీ మాట్లాడారు. అనంతరం ఆయా రంగాల్లో ఉత్తమ ప్రదర్శన కనపరిచిన పరిశ్రమలకు అవార్డులను అందించారు.   

#Tags