High Court: గ్రేస్‌ మార్కులపై ఎన్‌ఎంసీ నిర్ణయం సబబే.. ఈ మార్కులు పొందడం హక్కు కాదని స్పష్టం చేసింది

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ గ్రేస్‌ మార్కులకు సంబంధించి దాఖలైన పిటిషన్‌లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ)కి హైకోర్టు సూచించింది.

గ్రేస్‌ మార్కులను తొలగిస్తూ 2023 ఆగస్టులో ఎన్‌ఎంసీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. గ్రేస్‌మార్కులు పొందడం పిటిషనర్ల హక్కు కాదని స్పష్టం చేసింది. మార్కులు కలపాలంటూ తాము ఆదేశాలివ్వలేమని తేల్చి చెప్పింది.

ఎంబీబీఎస్‌ విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి..ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులొస్తే 5 గ్రేస్‌ మార్కులు ఇచ్చేవారు. అలా కొందరు రెండో సంవత్సరంలోకి వెళ్లేవారు. అయితే 2023, ఆగస్టులో ఈ గ్రేస్‌ మార్కులను తొలగిస్తూ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌పై మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రెగ్యులేషన్స్‌–1997 నిబంధనలను ఎన్‌ఎంసీ సవరించింది.

చదవండి: NEET UG Exam 2024 Grace Marks : నీట్ యూజీ 2024లో వీరికి మాత్ర‌మే Grace marks లను తీసేస్తాం.. కానీ..

ఎన్‌ఎంసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఎంబీబీఎస్‌ విద్యార్థి ఆర్య బచుతో పాటు మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌ కుమార్‌ జూకంటి ధర్మాసనం జూన్ 19న‌ విచారణ చేపట్టింది.

పరీక్షలు పాత నిబంధనల మేరకే జరిగాయని, మార్కుల జాబితాలోకూడా దాన్ని ప్రస్తావించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ధర్మాసనానికి వాదనలు వినిపించారు. ఇక నిబంధనల మార్పు, పరీక్షలు ఒకేసారి రావడంతో విద్యార్థులు వాటిని తెలుసుకోలేకపోయారని అందువల్ల పాత నిబంధనల ప్రకారం పిటిషనర్లకు గ్రేస్‌ మార్కులు ఇవ్వాలని కూడా ప్రభాకర్‌ వాదించారు.

చదవండి: TSPSC: 17 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకం

వాదనలు విన్న ధర్మాసనం...పాత నిబంధనల మేరకే పరీక్షలు జరిగాయన్న వాదన చెల్లదని పేర్కొంది. నిబంధనలు 2023, ఆగస్టులో వస్తే.. నవంబర్‌లో పరీక్షలు జరిగాయని వ్యాఖ్యానించింది. గ్రేస్‌ మార్కులను మంజూరు చేసే అంశంపై ప్రతివాదులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

#Tags