High Court: స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించండి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక వసతులు, అగ్నినిరోధక చర్యలు, శానిటేషన్, శుద్ధిచేసిన నీరు తదితర సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ గైడ్‌లైన్స్‌ (ఎన్‌డీఎంఏ) పేర్కొన్న పాఠశాల భద్రతా విధానం–2016 నిబంధనల మేరకు వీటిని ఏర్పాటు చేయాలని, దీనిపై 4 వారాల్లో నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల, ఉన్నత విద్యా శాఖల ప్రధాన కార్యదర్శులు, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ కమిషనర్, డైరెక్టర్, ఇంటర్‌ బోర్డు, హోంశాఖ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల డీజీ, కేంద్ర మహిళా వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

చదవండి: K Srinivas: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కనీస భద్రతా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన కీతినీడి అఖిల్‌ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ‘హైదరాబాద్‌లోని జవహర్‌నగర్, రాంనగర్, యూసుఫ్‌గూడ, మాసబ్‌ట్యాంక్, రాజ్‌భవన్, సోమాజిగూడ, నాంపల్లి, అమీర్‌పేట్, బోరబండ, విజయానగర్, ప్రభాత్‌నగర్‌లోని పాఠశాలలతోపాటు ఆలియా జూనియర్‌ కళాశాలలో 8,163 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఈ భవనాల్లో ఎక్కడా అగ్నిమాపక యంత్రాలు, బిల్డింగ్‌ పటిష్టత సర్టిఫికెట్‌ లేదు సరికదా కనీస తనిఖీలు లేవు. సుప్రీంకోర్టు గతంలో పేర్కొన్న విధంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వసతులు కల్పించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి’అని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం న‌వంబ‌ర్‌ 23న‌ విచారణ చేపట్టింది.

చదవండి: Madhusudan Rao: ప్రతి టీచరూ కొత్తగా ఆలోచించాలి

పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. మందులు, ప్రథమ చికిత్స కిట్లు, తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు అగ్నిమాపక శిక్షణ అందించాలని, ప్రతీ మూడు నెలలకు ఒకసారి అధికారులు పాఠశాలలు, కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. వసతుల ఏర్పాటుపై నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.  

#Tags