Skip to main content

Medical and Health Department: వైద్య బదిలీల్లో భారీ అవినీతి!

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది బదిలీల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి నిఘా విభాగం జూలై 26న‌ నివేదిక అందజేసింది.
Massive corruption in medical transfers

ఈ దందాలో ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం మొదలు పైస్థాయి వరకు అందరి హస్తం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఒక విభాగానికి చెందిన అధిపతితోపాటు ఆయన వద్ద పనిచేసే ఇద్దరు అధికారులు, సచివాలయంలోని ఇద్దరు అధికారుల పేర్లను నివేదికలో పేర్కొంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ సొంత క్లినిక్‌లు, ఆసుపత్రులను నడుపుతున్న కొందరు డాక్టర్లు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడక రూ. లక్షల్లో లంచాలు సమర్పించినట్లు తెలిసింది. ఇలా ఒక ఉన్నతాధికారి ఏకంగా రూ. 5 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

చదవండి: Medical Department: ఏపీ వైద్య శాఖలో నియామకాలకు బ్రేక్‌!

ముఖ్యంగా నర్సులకు సంబంధించిన సీనియారిటీ లిస్టు మాయాజాలంగా మారింది. దీనిపై నర్సులు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేయడం తెలిసిందే. దీనిపై సీఎం కూడా ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే 23 ఆసుపత్రుల్లోని నర్సింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

ఈ వ్యవహారమంతా ఇంటెలిజెన్స్‌ నివేదిక ద్వారా ప్రభుత్వానికి చేరింది. పలు జిల్లాల డీఎంహెచ్‌వోలు కూడా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్‌ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. యాదాద్రి భువనగిరికి చెందిన ఒక కీలకాధికారి ఐదారు రోజుల కిందటే బదిలీపై మరో ప్రాంతానికి వెళ్లి రిపోర్టు చేసినప్పటికీ పాత కేంద్రంలో ఉంటూనే ఇప్పటికీ వర్క్‌ ఆర్డర్లు ఇస్తున్నట్లు తెలిసింది.

Published date : 27 Jul 2024 12:16PM

Photo Stories