Telangana: కొత్త గురుకులాలు ఇప్పట్లో లేనట్లే!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త గురుకులాల ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంతో గురుకులాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. దీంతో మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించడానికి వేచిచూడాల్సిందేనని విద్యారంగ నిపుణులు చెపుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ మేనిఫెస్టోలో కూడా గురుకుల సొసైటీల అంశాన్ని ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఆ తర్వాత మేనిఫెస్టోలోని హామీల అమలుపై దృష్టి సారించి. కొత్త గురుకులాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని బీసీ గురుకుల సొసైటీని ఆదేశించింది. ఇందులో భాగంగా కొత్త గురుకులాల ఏర్పాటు అవసరమున్న మండలాల వారీగా బీసీ గురుకుల సొసైటీ ప్రతిపాదనలు సమర్పించింది. 

చదవండి: Placement Drive: గురుకులంలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

ప్రస్తుతం రాష్ట్రంలో 292 బీసీ గురుకులాలు.. 

రాష్ట్రంలో 594 మండలాలున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 594 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలో ప్రస్తుతం 292 గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక బాలుర, ఒక బాలికల గురుకులాన్ని నిర్వహిస్తున్నారు. వీటికి అదనంగా జిల్లా కేంద్రాల్లో ఒకట్రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో కొత్తగా మరో 302 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి.

క్షేత్రస్థాయిలో డిమాండ్‌కు తగినట్లుగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న 292 బీసీ గురుకుల పాఠశాలలను మండలాల వారీగా విభజించి.. కొత్తగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే కోణంలో పరిశీలన జరిపిన అధికారులు, మండలాల వారీగా ప్రాధాన్యత క్రమంలో జాబితాను తయారు చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన బడ్జెట్‌ సన్నాహక సమావేశంలో కూడా ప్రాథమిక ప్రతిపాదనలను సమర్పించారు. ప్రస్తుతం గురుకులాల ఏర్పాటు అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.

ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. జూన్‌ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ కొనసాగనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నప్పటికీ భవనాల గుర్తింపు, నిర్వహణ ఏర్పాట్లు చేసేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త గురుకులాల ఏర్పాటుకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే ఏడాదిలో వీటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అధికారులు చెబుతున్నారు.

#Tags