G Satish Reddy: పరిశోధనల హబ్‌గా హైదరాబాద్‌

సాక్షి,హైదరాబాద్‌: సబ్‌మెరైన్ల తయారీలో వినియోగించే పదార్థాల అభివృద్ధి కోసం హైదరాబాద్‌లో ఎన్నో పరిశ్రమలు పనిచేస్తున్నాయని ఇప్పుడు పరిశోధనలు, అభివృద్ధికి భాగ్యనగరం కేంద్రంగా ఉందని రక్షణరంగ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మాజీ చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. టీ–హబ్‌ వేదికగా ‘వేదజ్ఞానం, ఆధునిక సాంకేతికత’పై శ్రీవీటీ సంస్థ రజతోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఐకాన్‌ భారత్‌’అంతర్జాతీయ సదస్సును సతీశ్‌రెడ్డి సెప్టెంబర్ 1న‌ ప్రారంభించారు.

ఈ సదస్సు ద్వారా విజ్ఞానం, ఆవిష్కరణల్లో భారత్‌ను ‘విశ్వ గురువు’గా చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రాచీన శాస్త్రీయతకు ఆధునికతను కలిపే చక్కటి వేదిక ఇదని సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆత్మ నిర్భరత సాధించాలంటే ముందుగా మెటీరియల్స్, తయారీరంగంలో నూతన సాంకేతికత విషయంలో స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. దేశీయంగా కీలకమైన మెటీరియల్స్‌ అభివృద్ధి చేయడంలో ఎంతో ముందున్నందుకు గర్వంగా ఉందన్నారు. 

చదవండి: Special Shoes : సాయుధ బలగాల సిబ్బందికి ఐఐటీ ప్ర‌త్యేక‌మైన బూట్లు..

సబ్‌మెరైన్ల తయారీలో, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ వంటి విమానాల తయారీలో 80% ముడి పదార్థాలు భారత్‌లోనే తయారయ్యాయని గుర్తు చేశారు. దేశీయ ఉత్పత్తి, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత్‌ ముందుకు సాగుతోందని చెప్పారు.

శ్రీవీటీ నిర్వహిస్తున్న పరిశోధనల ద్వారా వివిధ మెటీరియల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, గత 25 ఏళ్లుగా ఈ వర్సిటీ దేశంలోని వివిధ సంస్థలతో కలసి పని చేసిందని చెప్పారు. 

ఈ సదస్సుకు గౌరవ అతిథిగా బిట్స్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రాంగోపాల్‌రావు హాజరయ్యారు. సదస్సులో టీ–హబ్‌ సీఈవో శ్రీనివాస్‌ మహంకాళీ, సీఎస్‌ఐఆర్‌ మాజీ డీజీ డాక్టర్‌ శేఖర్‌ మండే తదితరులు పాల్గొన్నారు. 

#Tags