NIRF Rankings: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు ఎలా నిర్ణయించబడతాయి?.. విద్యావేత్తల పలు సుచనలు..
ఈ ర్యాంకులను ఒకసారి పరిశీలిస్తే, 2024లో మొదటి 100 ర్యాంకులు పొందిన విద్యా సంస్థలు 7 రాష్ట్రాల్లోనే విస్తరించి ఉన్నాయి. ఆ రాష్ట్రాలు తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లు. టాప్ 30 ర్యాంక్‌లు పొందిన విద్యా సంస్థలలో 8 డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు, 10 ఐఐటీలు ఉన్నాయి.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు నిర్ణయించే ముఖ్యమైన పారామితులు తప్పుగా రూపొందించబడ్డాయి అనిపిస్తోందనీ, ర్యాంకింగ్‌ని నిర్ణయించడానికి వీటిని మరింత తెలివిగా సమీక్షించడం, నిర్వచించడం చాలా ముఖ్యమని విద్యావేత్త్తలు అభిప్రాయ పడుతున్నారు.
విద్యాసంస్థలను మూల్యాంకనం చేయడానికి 16 పారామితులను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో కొన్ని అసంబద్ధంగా ఉన్నాయని మేధావులు పేర్కొంటున్నారు. వాటిలో మొదటిది ‘సమాజలో గుర్తింపు లేదా కీర్తి’ అనేది. దీన్ని ‘సర్వే’ ద్వారా నిర్ణయిస్తారు.
చదవండి: NIRF Rankings: ఏపీకి ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు.. ఐదు కేటగిరీల్లో ఏయూకు..
కాని, దాని వివరాలు బయటికి తెలియవు. బిట్స్ పిలానీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్), ధన్‌బాద్; వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి కొన్ని పాత ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌ల కంటే కొత్తగా ఏర్పాటైన కొన్ని ప్రైవేట్ సంస్థలు త్వరగా పేరు తెచ్చుకోవడానికి అవి సొంతంగా ప్రచారం చేసుకోవడమే కారణం. ప్రభుత్వ సంస్థలు ఇటువంటి ప్రచారం చేసుకోకపోవడం గమనార్హం.
పరిశోధన ఫలితాల ప్రచురణల నాణ్యత – వాటి సంఖ్య ముఖ్యమైన పారామితులలో ఒకటి. ఈ విషయంలో చాలా ప్రైవేట్ యూనివర్సిటీలు తమ ర్యాంకింగ్స్‌ను గణనీయంగా పెంచుకున్నాయి.
ఫ్యాకల్టీ నాణ్యత, అనుభవం అనేది విద్యార్థుల దృక్కోణం నుండి చాలా ముఖ్యమైన పారామితులలో ఒకటి. అయితే, ఎన్‌ఐఆర్‌ఎఫ్ నిర్వచనం ప్రకారం, సవిత ఇన్‌స్టిట్యూట్ భారతదేశంలో అత్యుత్తమ ఫ్యాకల్టీ నాణ్యతను కలిగి ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (11వ ర్యాంక్), ఐఐటీ మద్రాస్ (55వ ర్యాంక్) వంటి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ విషయంలో వెనుకబడిపోయాయి. అందుకే ఈ పారామితిని ఎన్‌ఐ ఆర్‌ఎఫ్ సరిగ్గా నిర్వచించిందా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
అలాగే విద్యార్థి సంఖ్యాబలం కూడా యూని వర్శిటీల ర్యాంకులు పెరగడానికి ఒక కారణం. విద్యా ర్థులను చేర్చుకునే విషయంలో ప్రైవేటు విద్యా సంస్థలకు ఎటువంటి నిబంధనలు లేవు. కాని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అనేక నిబంధనలు అడ్డు వస్తున్నాయి.
అందుకే ప్రభుత్వ విశ్వ విద్యాలయాల కంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మంచి ర్యాంకులు సొంతం చేసుకున్నాయి. తమిళనాడు వంటి ప్రాంతాలలోని సంస్థలు తమ చివరి సంవత్సరం విద్యార్థులను ఒకటి లేదా రెండు సెమిస్టర్ల ఇంటర్న్‌షిప్‌ల కోసం విదేశీ సంస్థలకు పంపడం ఒక సాధారణ అభ్యాసం– ఇది గ్లోబల్ ఎక్స్ పోజర్‌ను పెంచే చొరవ.
సీబీసీఎస్ విధానాన్ని వీఐటీ అనుసరించి తమ విద్యార్థులను విదేశాలకు పంప డాన్ని చూసి తమిళనాడు లోని ఇతర సంస్థలు కూడా సీబీసీఎస్ విధానాన్ని త్వరగా అనుసరించి సామూహిక వృద్ధి స్ఫూర్తిని నేర్చుకున్నాయి. అందు వల్ల ఎన్‌ఐఆర్‌ఎఫ్ టాప్ 100లో ఎక్కువ సంస్థలు తమిళనాడుకు చెందినవి కావడంలో ఆశ్చర్యం లేదు.
పారామితులను తప్పుగా నిర్వచించడమే కాకుండా, విశ్వవిద్యాలయాలు సమర్పించిన డేటా కచ్చితత్వాన్ని సరిగా నిర్ధారించకపోవడం వల్ల ప్రైవేట్ సంస్థలు మంచి ర్యాంకులు సొంతం చేసుకుంటున్నాయనేది ఒక అభియోగం. 410 మందితో ఇండియా రీసెర్చ్ వాచ్ నిర్వహించిన ఒక సర్వేలో, చాలా మంది (39 శాతం) ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు సమర్పించిన డేటా తప్పు అని భావించారు.
పైన పేర్కొన్నవే కాక అనేక ఇతర కారణాల వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు మంచి ర్యాంకులు సాధించగా... ప్రభుత్వ సంస్థలు ఎంత నాణ్యమై నవైనా తగిన ర్యాంకులను సాధించలేక పోయాయి.
– ప్రొ. ఈదర శ్రీనివాస రెడ్డి, వ్యాసకర్త, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ