A Chandrasekhar: విద్యతోనే సామాజిక ప్రగతి

కేయూ క్యాంపస్‌: విద్యతోనే సామాజిక ప్రగతి సాధ్యమని మానవ హక్కుల కార్యకర్త, ఏపీలోని అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ఎ.చంద్రశేఖర్‌ అన్నారు.

డిసెంబ‌ర్ 15న‌ కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో వీసీ తాటికొండ రమేష్‌ అధ్యక్షతన నిర్వహించిన మానవహక్కుల నేత దివంగత డాక్టర్‌ కే బాలగోపాల్‌ 13వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ‘మానవ హక్కులు – ప్రజాస్వామ్యం’ అనే అంశంపై చంద్రశేఖర్‌ స్మారకోపన్యాసం చేశారు.

ప్రజాస్వామ్యం.. జీవన విధానం అన్నారు. ఆదివాసీల ఉనికి కనుమరుగవుతుందన్నారు. ఆదివాసీలు ప్రజాస్వామ్యంలో అంతర్భమన్నారు. అటవీ సంరక్షణ సవరణ చట్టం –2023 సంరక్షణ చట్టం కాదన్నారు. దీంతో ఆదివాసీల హక్కులకు కూడా భంగం కలిగే అవకాశం ఉందన్నారు.

నూతన జాతీయ విద్యావిధానం– 2020లో చాలా లోపాలు ఉన్నాయన్నారు. మార్కుల ఆధారంగా విద్యార్థులు గ్రేడింగ్‌ సరికాదన్నారు. ప్రముఖ సామాజికవేత్త, సెంట్రల్‌ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యుడు జి హరగోపాల్‌ మాట్లాడుతూ పర్సె పక్టివ్‌ సంస్థలో బాలగోపాల్‌ కూడా సభ్యుడిగా ఉండేవారన్నారు.

చదవండి: Elon Musk Plans: స్కూల్స్‌, కాలేజీలను ప్రారంభించ‌నున్న‌ ఎలాన్‌ మస్క్‌..!

ఈ సంస్థ తరఫున సామాజికపరమైన చాలా పుస్తకాలను ప్రచురించామన్నారు. బాలగోపాల్‌ పుస్తకాలు బహుళ జనాదరణ పొందాయన్నారు. నేటి విద్యార్థుల్లో పుస్తకపఠనం తగ్గిందని, పుస్తకాలు చదవడం జీవితంలో భాగం కావాలన్నారు. బాలగోపాల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

న్యాక్‌ మాజీ డైరెక్టర్‌ వీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ డాక్టర్‌ బాలగోపాల్‌ నోబెల్‌ మాన్‌ అన్నారు. గొప్ప సామాజిక, శాసీ్త్రయ విశ్లేషకుడు బాలగోపాల్‌ అసాధారణ వ్యక్తి అన్నారు. వీసీ రమేష్‌ మాట్లాడుతూ గొప్ప మానవతా వాది బాలగోపాల్‌ అన్నారు. నేటి విద్యార్థులు ఆయన చరిత్ర తెలుసుకోవడం అవసరం ఉందనన్నారు.

అనంతరం బాలగోపాల్‌ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, బాలగోపాల్‌ సతీమణి డాక్టర్‌ వసంత లక్ష్మితో పాటు, జి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

#Tags