AP Schools Reopen: ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభం తేదీ ఇదే..

సాక్షి, ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని స్కూల్స్‌ను జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
AP Schools Reopen

జూలై 4వ తేదీ నుంచి పాఠ‌శాల‌లు ప్రారంభం కావ‌ల్సింది ఉంది. అయితే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏపీ ప‌ర్యాట‌న నేపథ్యంలో పాఠ‌శాల ప్రారంభ తేదీని మార్పు చేశారు. పాఠ‌శాలల‌ ప్రారంభ తేదీనే ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి విద్యార్థుల‌కు జ‌గ‌న‌న్న విద్యాకానుక‌ను అందించ‌నున్నారు.

నూతన మార్గదర్శకాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (School education) బి.రాజశేఖర్‌ జీవో 117ను జారీచేశారు. Right to Education Act, నూతన జాతీయ విద్యావిధానాలను అనుసరించి పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా టీచర్ల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ ఈచర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ సెంటర్లు, నాన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ స్కూళ్లను పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు. శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్, ఫౌండేషనల్‌ స్కూల్, ఫౌండేషనల్‌ స్కూల్‌ ప్లస్, ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలుగా ఇవి పునర్వ్యవస్థీకరణ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైన మేర సెకండరీ గ్రేడ్‌ టీచర్లను, సబ్జెక్టు టీచర్లను సమకూర్చేలా ప్రభుత్వం ఈ సర్దుబాటు ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియకోసం ఆయా జిల్లాల డీఈవోలు ముందుగా మండలం, పాఠశాల వారీగా విద్యార్థుల సంఖ్య, అవసరమైన టీచర్ల సంఖ్యతో జాబితాలను రూపొందించాలి. వీటి ఆధారంగా టీచర్లను సర్దుబాటు చేస్తారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, మ్యాపింగ్‌ కారణంగా ఏ ఒక్క పాఠశాల మూతపడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. జీవోలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. కొత్త విధానంలో ఆయా స్కూళ్లలో 9, 10 తరగతుల్లో 20 మందికి మించి విద్యార్థులున్న చోట డ్యూయల్‌ మీడియం ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ అదనపు సెక్షన్‌ను ఏర్పాటు చేస్తారు.

  • ఏదైనా పోస్టు ఖాళీగా, మిగులుగా ఉండి అది వేరే అవసరమైన స్కూలుకు మార్పు చేయాలని ప్రతిపాదిస్తే ఆ పోస్టును సదరు స్కూలుకు బదలాయించాలి
  • ఖాళీ పోస్టు లేకుంటే ఆ స్కూలులోని టీచర్లలో జూనియర్‌ టీచర్‌ను బదిలీ చేయాలి
  • పాఠశాలలోని సీనియర్‌ ఉపాధ్యాయుడు కొత్త పాఠశాలలో పనిచేయడానికి ఇష్టపడితే అతనినే బదిలీ చేయవచ్చు.

స్కూళ్లలో టీచర్ల సంఖ్య ఇలా ఫౌండేషనల్ స్కూళ్లలో (పీపీ1, పీపీ–2, 1, 2 తరగతులు)

  • విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాలల్లో 1:30 నిష్పత్తిలో టీచర్లుండాలి
  • 1, 2 తరగతులకు 30 మంది వరకు విద్యార్థులుంటే ఒక ఎస్జీటీని నియమించాలి
  • 1, 2 తరగతుల్లో 31కు మించి విద్యార్థులుంటే 2వ టీచర్‌ను కేటాయించాలి
  • ఆపై ప్రతి 30 మంది అదనపు విద్యార్థులకు మరో ఎస్జీటీని నియమించాలి.
  • ఫౌండేషనల్‌ (1, 2 తరగతులు) స్కూళ్లలో 10 మంది కన్నా పిల్లలు తక్కువగా ఉంటే వాటి విషయంలో ప్రతిపాదనలను కమిషనర్‌కు పంపించాలి.

ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్లు (పీపీ1, పీపీ2, 1 నుంచి 5 తరగతులు..

  • ఈ స్కూళ్లలో 30 మంది విద్యార్థులుంటే ఒక ఎస్జీటీని నియమించాలి
  • విద్యార్థుల సంఖ్య 31 దాటితే రెండో ఎస్జీటీని కేటాయించాలి
  • ఆపై ప్రతి 30 మంది అదనపు విద్యార్థులకు మరో ఎస్జీటీని ఇవ్వాలి
  • 121 మంది విద్యార్థులుంటే ప్రైమరీ స్కూలు హెడ్మాస్టర్‌ పోస్టును ఏర్పాటు చేస్తారు.
  • 10 మందికన్నా తక్కువగా విద్యార్థులుంటే   కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపాలి.

ప్రీ హైస్కూలు 3 నుంచి 8 తరగతులు

  • ఈ స్కూళ్లలో 1, 2 తరగతులుంటే కనుక వాటిని అదే ఆవరణలో ఫౌండేషనల్‌ స్కూళ్లుగా కొనసాగించాలి.
  • 3–8 తరగతుల వరకు 6 సెక్షన్లకు ఆరుగురు, 7 సెక్షన్లకు ఏడుగురు, 8 సెక్షన్లకు 8 మంది సబ్జెక్టు టీచర్లుగా స్కూల్‌ అసిస్టెంట్లను ఏర్పాటు చేయాలి. సీనియర్‌ మోస్ట్‌ టీచర్‌ హెచ్‌ఎంగా వ్యవహరించాలి.
  • 195 మందికన్నా ఎక్కువ మంది ఉంటే 3 కిలోమీటర్ల లోపు వేరే హైస్కూలు లేకుంటే వీటిని హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్‌ చేయాలి.
  • 98 మందికన్నా పిల్లలు తక్కువగా ఉంటే ఎస్‌ఏ బదులు ఎస్జీటీలను కేటాయించాలి.
  • అన్ని ప్రీ హైస్కూళ్లను 8వ తరగతి వరకు అప్‌గ్రేడ్‌ చేయాలి.

3 నుంచి 10 తరగతులు, టీచర్లు ఇలా..

  • 3 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో సెక్షన్ల వారీగా ఎంతమంది ఏ యే సబ్జెక్టు టీచర్లుండాలో జీవోలో పట్టిక రూపంలో పొందుపరిచారు. 8 సెక్షన్లుంటే 10 మంది, 9 సెక్షన్లుంటే 11 మంది స్కూల్‌ అసిస్టెంట్‌ సబ్జెక్టు టీచర్లను కేటాయించాలి. ఆపై ప్రతి అదనపు సెక్షన్‌కు అదనంగా ఒక స్కూల్‌ అసిస్టెంట్‌ను కేటాయించాలి.
  • 6 నుంచి 10వ తరగతి వరకు ఉండే హైస్కూళ్లలో 5 సెక్షన్లకు 8 మంది ఎస్‌ఏలను  సబ్జెక్టు టీచర్లను కేటాయించాలి.ఈ స్కూళ్లలో ప్రతి అదనపు సెక్షన్‌కు అద నంగా ఒక్కో ఎస్‌ఏ టీచర్‌ను కేటాయించాలి.

#Tags