UPSC Civils Ranker Success Story : ఫెయిలైనా.. పట్టిన పట్టు వీడలేదు.. చివరికి..
ఇలాంటి కష్టమైన సివిల్స్ పరీక్షలో తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన సాయికిరణ్.. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాడు. ఈయన సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో చదివాడు. మొదటి ప్రయత్నంలో ఫెయిలయ్యాడు. అయినా కుంగిపోలేదు. రెండో ప్రయత్నంలో ర్యాంక్ రాలేదు. అయినా బాధపడలేదు. మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా కల సాకారం కాలేదు. అయినా ప్రయత్నాన్ని విరమించుకోలేదు. అలా సివిల్స్ లక్ష్యంగా చదువుతూ నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో సాయికిరణ్ సక్సెస్ జర్నీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మానాన్నలు పత్తిపాక కొమురెల్లి, లక్ష్మి. అమ్మానాన్న ఇద్దరు సర్పంచ్‌లుగా పని చేశారు. అక్క చైతన్య.. వివాహమైంది. చెల్లెలు చండీప్రియ మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్‌లో ఎండీ చదువుతుంది.
ఈ స్ఫూర్తితోనే..
హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదివాను. కేరళలోని కాలికట్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసి మూడేండ్లు ఉద్యోగం చేశాను. ఏడాదికి రూ.18 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నా సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఉద్యోగం చేసిన సమయంలో ప్రతి నెలా జీతంలో కొంత డబ్బు పొదుపు చేశాను. ఆ డబ్బులతోనే కోచింగ్ తీసుకున్నాను. కలను సాకారం చేసుకోవాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటలు స్ఫూర్తినిచ్చాయి. అందుకే ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.
ఫైనల్‌లో రెండు మార్కుల తేడాతో..
ఏం ప్రిపేర్ కాకుండా మొదటిసారి సివిల్స్ రాసి ఫెయిల్ అయ్యాను. అనుకున్న లక్ష్యం సాధించాలంటే సరైన ప్రణాళిక, సాధన అవసరమని తెలిసింది. రెండోసారి ప్రిలిమ్స్ పాసయ్యాను. మెయిన్స్ క్వాలిఫై కాలేదు. మూడోసారి ప్రిలిమ్స్, మెయిన్స్ పాసై ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. ఫైనల్‌లో రెండు మార్కుల తేడాతో సివిల్స్ చేజారింది. నాలుగో ప్రయత్నంలో 460వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకుతో ఐపీఎస్ వస్తుంది. ఐఏఎస్ సాధించడమే నా కల. ఐపీఎస్‌లో జాయిన్ అయినప్పటికీ మరోసారి సివిల్స్ రాస్తాను.
☛ Inspiration Story: భర్త కానిస్టేబుల్.. భార్య ఐపీఎస్.. 10వ తరగతి కూడా చదవని భార్యను..
నా సివిల్స్ ప్రిపరేషన్ ఇలా..
నేను సరైన గైడెన్స్ లేకపోవడం, మెటీరియల్ ఒక దగ్గర సేకరణలో , చదివిన అంశాలను రివైజ్ చేయలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాను. ఢిల్లీలోని శంకర్ ఐఏఎస్ అకాడమీలో మెయిన్స్ మాక్ టెస్ట్ కోసం కోచింగ్ వెళ్లాను. హైదరాబాద్‌లోని బాలలత మేడమ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంటర్వ్యూ కోసం కోచింగ్ తీసుకున్నాను. అక్కడ ఐదుగురితో పరిచయం ఏర్పడింది. వారితో కలిసి నిత్యం ఇష్టాగోష్టి చర్చలు, తెలియని వాటిని తెలుసుకోవడం, ముఖ్యమైనవి టిక్ చేసి, గుర్తుంచుకోవడం చేసేవాళ్లం. ఈ ప్రక్రియ ఇంటర్వ్యూలో ఎంతగానో ఉపయోగపడింది.
Rohini Sindhuri, IAS: ఈ ఐఏఎస్ కోసం జనమే రోడ్లెక్కారు.. ఈమె ఏమి చేసిన సంచలనమే..
నా ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నలు ఇవే..
ప్రశ్న : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు కావడం వల్ల ఇబ్బందులు ఏమిటి ? ఉపయోగం ఏమిటి ?
జవాబు : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు కావడం వల్ల పరిపాలన సౌలభ్యం సులువుగా ఉంటుంది. ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుంది. కాకపోతే కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల కొత్త భవనాల నిర్మాణం, మోయలేని అదనపు వ్యయం, కొత్త ఉద్యోగాల భారం ఉంటుందని చెప్పాను.
ప్రశ్న : గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలకు మరింత అధికారం ఇవ్వడం మంచిదా.. కాదా..?
జవాబు : గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలకు అధికారాలు ఎక్కువ ఇవ్వడం మంచిదని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని, అక్కడ సమస్య పరిషారం కాకపోతే జిల్లా అధికారి వద్దకు వెళ్లవచ్చని చెప్పాను.
ప్రశ్న : సింగరేణి బొగ్గు వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. దాన్ని ఎలా అధిగమించాలి..?
జవాబు : సింగరేణి బొగ్గు తీయడం వల్ల కాలుష్యం ఏర్పడుతుందన్న మాట వాస్తవమే కానీ వెంటనే ఆ పనులు నిలిపివేయవద్దని, సింగరేణి బొగ్గు వల్ల చాలామంది కార్మికులకు జీవనోపాధితో పాటు కరెంటు సౌకర్యం లభిస్తుందని చెప్పాను. అలాగే విడతలవారీగా సోలార్ వైపు ప్రజలంతా అడుగులు వేసేలా చూడాలి.
సివిల్స్ ప్రిపేరయ్యే వాళ్లు..
అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన, సంకల్ప బలం ఉండాలి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తప్పకుండా గైడెన్స్ తీసుకోవాలి. నోట్స్ సేకరించి ఒక దగ్గర పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు నోట్స్‌ను రివైజ్ చేసుకోవాలి. మాక్ పరీక్షలు పదేపదే రాయాలి. అందులో చేసిన తప్పులను సరి చేసుకోవాలి. ఫిజికల్ హెల్త్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. నిత్యం ప్రణాళికాబద్ధంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు చదవాలి.