UPSC Civils Ranker Success Story : ఈ టెక్నిక్‌తో చదివా.. కోచింగ్ లేకుండానే సివిల్స్ కొట్టానిలా..
ఈ గిరిజన ఆణిముత్యం పేరు అజ్మీరా సంకేత్‌కుమార్. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకర్ అజ్మీరా సంకేత్‌కుమార్ సక్సెస్ స్టోరీ కోసం..
కుటుంబ నేపథ్యం :
మాది తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి. నాన్న ప్రేమ్‌సింగ్. ఈయన హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్. అమ్మ సవిత. ఈమె ఇస్రోలో ఉద్యోగం చేస్తారు.
ఎడ్యుకేషన్ :
హైదరాబాద్‌లోని భాష్యం పబ్లిక్ స్కూల్‌లో 2011లో నేను పదో తరగతి పూర్తి చేశాను. ఫిట్(ఎఫ్‌ఐఐటీ) జేఈఈ సైఫాబాద్ బ్రాంచ్‌లో 2013లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. అలాగే దిల్లీ ఐఐటీలో 2017లో బీటెక్ పట్టా తీసుకున్నా.
ఇందుకే సివిల్స్ వైపు వచ్చాను..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికి అనేక గిరిజన తండాలు నాగరికతకు దూరంగా బతుకున్నాయని సంకేత్ ఆవేదన వ్యక్తం చేశారు. నా ఉద్యోగం ద్వారా గిరిజన తండాల్లో చైతన్యం నింపేందుకు కృషి చేస్తానని చెప్తున్నారు.
కోచింగ్ తీసుకోకుండానే..
నేను మా అమ్మనాన్నలానే ఉన్నతస్థాయికి ఎదగాలని ప్రతిక్షణం పరితపించాను. ఎంతో కష్టపడి చదివి.. చివరికి అనుకున్న సివిల్స్‌లో విజయం సాధించాను. ఈ క్షణం మా అమ్మానాన్నల కళ్లలో చూసిన ఆనందమే నా విజయానికి ప్రతీక. సివిల్స్‌లో ర్యాంకు సాధిస్తాననే నమ్మకం నాకు మొదటి నుంచే ఉంది. కోచింగ్ తీసుకోకుండానే సివిల్స్‌కు సొంతగా ప్రిపేర్ అయ్యాను. మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనుదిరిగినా.. అయినా వెనుకడుగు వేయకుండా మొదటిసారి ఎక్కడ పొరపాటు జరిగిందో ఒకటికి పదిసార్లు ఆలోచించా. రెండోసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలనే దృఢ సంకల్పంతో ప్రిపేర్ అయ్యాను. ఎట్టకేలకు సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 35వ ర్యాంకు సాధించాను.
నాకు ఇష్టమైనవి ఇవే..
నాకు మొదటి నుంచి రిసెర్చ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే.. ఆ తర్వాత జపాన్‌లో రిసెర్చింగ్‌లో ఉద్యోగం చేశాను. కానీ ఈ ఉద్యోగం నాకు సంతృప్తి కలుగలేదు. అందుకే.. సివిల్స్ సాధించాలని బలంగా నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంకు అమ్మానాన్న కూడా ఓకే అనేశారు. వెంటనే సివిల్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించాను. అలాగే మానసిక ప్రశాంతత కోసం హాకీ, బ్యాడ్మింటన్ ఆడేవాడిని.
ఏం చదువుతున్నాం అనేది..
చాలా మంది ప్రతిభావంతులు పోటీ పడే పరీక్ష ఇది. అందుకే.. ప్రతిక్షణం ఎంతో ముఖ్యం. అలాగని గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన పనిలేదు. ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు.. ఏం చదువుతున్నాం.., ఎలా చదువుతున్నామన్నదే ముఖ్యం. చదువుతున్నంత సేపు శ్రద్ధపెడితే విజయం మీ సొంతం అవుతుంది. సివిల్స్ అనగానే ఎక్కువ మంది రోజుకు 12 నుంచి 16 గంటలు చదవాలని భ్రమపడుతూ ఉంటారు. ఎక్కువ పుస్తకాలు చదివెయ్యాలని తాపత్రయ పడుతూ ఉంటారు. కానీ.. సివిల్స్ సాధించాలంటే ముందు చదవాల్సింది సమాజాన్ని. నేను అందులో సక్సెస్ అయ్యాను. పుస్తకాలతోపాటు సమాజంపై ఎక్కువ అధ్యయనం చేశాను. ప్రతి అంశాన్ని ప్రస్తుతంతో ముడిపెడుతూ అర్థం చేసుకుంటూ.. అవకాశం దొరికితే స్నేహితులతో చర్చించేవాడిని. ఎట్టకేలకు ఐఏఎస్ ఉద్యోగంకు ఎంపికైనందు చాలా సంతోషంగా ఉంది.