IAS Officer Success Story : నాన్న డ్రైవర్.. కూతురు ఐఏఎస్.. చదవడానికి డబ్బులు లేక..
సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటాలని లక్షల్లో పోటీపడుతుంటారు. ఇలా లక్షల మంది రాసినా చివరికి మిగిలేది వందల్లోనే. అలాంటి కష్టతరమైన పరీక్షను బస్సు డ్రైవర్ కుమార్తె ఛేదించింది. ఐఏఎస్ అధికారిగా నిలిచింది. ఎన్నో ఆర్థికపరమైన సమస్యలను అధిగమించి ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంక్ సాధించింది. ఈమె పేరే ప్రీతి హుడా. ఈ నేపథ్యంలో ఈమె సక్సెస్ స్టోరీ మీకోసం..
ఆర్థికపరమైన సమస్యలు..
ప్రీతి హుడా.. లక్ష్యం చేరుకునేందుకు ఆర్థిక పరిస్థితి అడ్డంకి కాదని నిరూపించారు. బస్ డ్రైవర్ కుమార్తె అయిన ప్రీతి హుడా దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్ లో ర్యాంక్ సాధించింది. సివిల్స్ సర్వీస్ ను మదర్ ఆఫ్ ఆల్ సర్వీసెన్ అంటారు. అంటే ఆ పరీక్షలో అర్హత సాధించడం ఎంత కష్టమో అర్థం అవుతుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ లక్ష్యం మాత్రం ఈమె మరవలేదు.
ఇలా చదివారు..
ప్రీతి హుడా తన చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. అలాగే ఆమె 10వ తరగతి పరీక్షలో 77% మార్కులు సాధించింది. 12 వ తరగతి పరీక్షలో 87% మార్కులు సాధించింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆమె చదువు ఆపేసి, పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే ప్రీతి తన చదువును కొనసాగించింది. దిల్లీలోని లక్ష్మీబాయి కళాశాలలో ప్రవేశం పొంది, హిందీ సబ్జెక్టులో పట్టభద్రురాలైంది. ప్రీతి హిందీలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) పీహెచ్‌డీ కూడా పొందారు.
మొదటి ప్రయత్నంలో..
ప్రీతి స్వస్థలం హరియాణా రాష్ట్రం బహదూర్ఘగ్ ప్రాంతం. ఆమె తండ్రి దిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఎంతో ప్రణాళికతో యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమైంది ప్రీతి. సివిల్స్‌లో హిందీ మీడియాన్ని ఎంచుకుంది. అంతే కాదు హిందీ సబ్జెక్టును ఆఫ్షనల్‌గా ఎంచుకుంది. ప్రీతి హుడా తన మొదటి ప్రయత్నంలో విఫలమైంది. అంతటితో నిరుత్సాహ పడకుండా రెండో సారి ప్రయత్నించింది. 2017లో ఆమె సివిల్స్ క్లియర్ చేసింది. 288వ ర్యాంక్ సాధించింది.