Inspiring Success Story: ఈ ఐఏఎస్‌కు పదమూడు బదిలీలు.. ఏ ఒత్తిళ్లకూ తగ్గేదేలే..
ఆమె సామాన్యుల పక్షం. వాళ్ల కోసం ఎంతటివాళ్లతోనైనా పోరాడేందుకు సిద్ధం అయ్యే.. ఏరోజుకారోజు ఆమె డ్యూటీకి బయల్దేరుతుంటారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ముగ్ధ ప్రస్తుతం రాజస్థాన్–ఢిల్లీమధ్య పాలనా వ్యవహారాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అగ్రకులాల వాళ్లు ఏది చెబితే..
రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా. 2010. ఆ జిల్లాలోని పల్లెల్లో.. చట్టబద్ధమైన ఎలాంటి అనుమతి, అంగీకారం లేకుండా యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోంది. అగ్రకులాల వాళ్లు ఏది చెబితే అదే చట్టం. ఏం చేస్తే అదే న్యాయం. మైనింగ్ మాఫియా, బోర్‌వెల్స్, గ్యాస్ సిలెండర్స్, బ్లాక్ మార్కెటింగ్.. ఒకటేమిటి అన్నీ! అలా ఒకసారి.. ఓ గ్రామంలో మైనింగ్ కోసం పేలుడు పదార్థాలు పెట్టారు. ధనార్జనే ధ్యేయం కాబట్టి పనిచేస్తున్న కూలీల, చుట్టుపక్కల ప్రజల భద్రతను గాలికొదిలేశారు. దాంతో ఆ పేలుడికి కొంతమంది ఎగిరిపడ్డారు. ప్రాణాలు గాల్లో కలిశాయి. తర్వాత చూస్తే దగ్గర్లో ఉన్న పొదల్లో తెగిపడ్డ తలలు కనిపించాయి. ఊరంతా వణికిపోయింది. దానికి బాధ్యులమంటూ స్థానిక మైనింగ్ కంపెనీలేవీ ముందుకు రాలేదు.
ఇక్కడ పనిచేయాలంటే.. ఐఏఎస్ అధికారులే భయపడ్తుంటే..
బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్నిచ్చే బాధ్యతా తీసుకోలేదు. చివరకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించింది. ఆ మైనింగ్ వ్యవస్థా మూతపడింది. ఇదంతా ఇక్కడ రాసినంత తేలిగ్గా, అలవోకగా జరగలేదు. కొన్ని నెలల పోరాటం, బెదిరింపులు, బదిలీలు.. అన్నీ జరిగాకే న్యాయం గెలిచింది. అది ఓ వ్యక్తి సాధించిన విజయం. ఆమె ఆ జిల్లా కలెక్టర్. పేరు ముగ్ధా సిన్హా. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆ జిల్లాకు కలెక్టర్‌గిరీ చేయడానికి పురుష ఐఏఎస్ అధికారులే భయపడ్తుంటే మహిళా ఐఏఎస్‌లు చార్జ్ తీసుకోవడం ఊహించలేని విషయం. కాని ఆ సవాల్‌ను స్వీకరించారు ముగ్ధా సిన్హా. ఝున్‌ఝునుకు వచ్చిన మొదటి మహిళా కలెక్టర్‌గానే కాదు.. ఆ జిల్లాను ఓ దారిలో పెట్టిన ఐఏఎస్‌గానూ చరిత్రలో నిలిచారు.
ఇది నమ్మాను కాబట్టే..
నిజానికి నలభై లక్షల జనాభా ఉన్న పెద్ద జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన ముగ్ధా.. ఝున్‌ఝునుకు ట్రాన్స్‌ఫర్ అవగానే.. చిన్న జిల్లా, హాయిగా పనిచేసుకోవచ్చని ఊపిరి పీల్చుకున్నారట. తీరా వచ్చాక తెలిసింది.. పరిమాణంలో చిన్నదే అయినా ఎదుర్కోవాల్సిన చాలెంజెస్ పెద్దవని. భయపడలేదు ఆమె. ‘‘బ్యూరోక్రాట్స్‌లో నాలుగు రకాలుంటారు. ఒకటి.. నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసేవారు. రెండు.. నిజాయితీగా ఉన్నా సామర్థ్యంలేని వాళ్లు. మూడు.. సామర్థ్యం ఉన్నా నిజాయితీలేని వాళ్లు. నాలుగు.. అవినీతి, అసమర్థులైన ఆఫీసర్లు. నాకు తెలిసింది.. నేను ప్రయత్నించేది.. ఒక్కటే.. నిజాయితీగా ఉండాలి.. సమర్థవంతంగా పనిచేయాలి. ఆ సూత్రాన్ని నమ్మాను కాబట్టే ఝన్‌ఝునులో పరిస్థితులకు వెరవలేదు’’ అంటున్నారు ముగ్ధ.
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..
మాఫియా నుంచి..
ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాక ముగ్ధాకు చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయి.. ‘‘మళ్లీ మా మైన్స్ ఎప్పుడు తెరుస్తున్నారు’’ అంటూ! అలా ఫోన్ చేసిన వాళ్లెవరూ నిజమైన యజమానులు కారు. యజమానులు ఫోన్ చేయించిన మధ్యవర్తులు. అలాంటి ఏ ఒత్తిళ్లకూ తలొగ్గలేదు ముగ్ధ. అదొక్కటే కాదు.. ఝున్‌ఝునులో జరుగుతున్న ఇతర అరాచకాలకూ ఆమె అడ్డుకట్ట వేశారు.
బ్లాక్ దందాను బ్లాక్..
మైనింగ్ తర్వాత ఆ రేంజ్‌లోనే ఉన్న వంట గ్యాస్ సిలెండర్ల బ్లాక్ మార్కెటింగ్‌నూ బ్లాక్ చేసేశారు. అలాగే పర్మిషన్ లేకుండా వేస్తున్న బోర్‌వెల్స్‌నూ పూడ్చేయించారు. హర్యానా నుంచి బోర్‌వెల్ మెషీన్స్ వచ్చేవి. వాటన్నిటినీ సీజ్ చేయించారు. ఝున్‌ఝునూను పట్టి పీడిస్తున్న ఇంకో పెద్ద రుగ్మత.. అగ్రకుల అహంకారం. సామాన్యులు తమ గోడు వెళ్లబుచ్చుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ ముందు వరుస కడితే.. వాళ్ల ముందు అగ్ర కులస్థుల సమూహం ఉండేది. అగ్రకులస్థులు కలెక్టర్‌ను కలిసి మాట్లాడాకే నిమ్న కులస్థులు కలవాలి.
ఆ ఆర్డర్ తీసుకునే లోపే..
ఆమె తీసుకున్న నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరూ చేయట్లేదు.. ఇది అక్కడి ఆనవాయితీ. ఆ ‘సంప్రదాయాన్ని’ తుంగలో తొక్కారు ముగ్ధ. అసలు ఎవరూ తన ఆఫీస్ ముందు క్యూ కట్టకముందే గ్రామాల్లోకి వెళ్లిపోయి ప్రత్యక్షంగా సామాన్య ప్రజలను ఆమె కలిసేవారు. వాళ్ల అర్జీలు, దరఖాస్తులు తీసుకునేవారు. సత్వర పరిష్కారం కోసమూ అంతే శ్రమించేవారు. ఆఫీస్ పనివేళలు అయిపోయి, పని మిగిలిపోతే ఆ ఫైల్స్ పట్టుకుని ఇంటికి వెళ్లేవారు. రాత్రంతా కూర్చొని ఫైల్స్ చెక్ చేసేవారు. ఆమె నిజాయితీ, సామాన్యులకు అండగా ఉన్న తీరు, మైనింగ్ మాఫియా, బ్లాక్ మార్కెటింగ్‌పై ఆమె ఉక్కుపాదం మోపడం.. ఇవన్నీ గిట్టని పెద్దలు ఆర్నెల్లలో ముగ్ధకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ ఇప్పించారు. ఆ ఆర్డర్ తీసుకునే ముందు.. ఆరావళి పర్వత సాణువుల్లోని మైన్స్‌లో ఇల్లీగల్ మైనింగ్ కోసం పేలుడు పదార్థాల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కులన్నిటినీ ముగ్ధ సీజ్ చేయించారు. ఇది జరిగి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. ఇప్పటి వరకు ఆ మైన్స్ తెరుచుకోలేదు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరూ చేయట్లేదు. అడ్మినిస్ట్రేషన్‌లో ముగ్ధ వేసిన ముద్ర అది!
Success Story: ట్యూషన్లు చెప్పుతూ.. రిసెప్షనిస్టుగా పనిచేస్తూ.. ఐపీఎస్ అయ్యానిలా..
అమ్మ కోసం ఐఏఎస్..
ముగ్ధా తండ్రి గురు స్వరూప్ సిన్హా. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేసేవారు. చైనాతో, ఆ తర్వాత 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1978లో విమాన ప్రమాదంలో మరణించారు.. విధి నిర్వహణలోనే. అప్పటికి ముగ్ధ వయసు నాలుగేళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. తల్లి కమలా సిన్హా పిల్లల్ని పెంచి పెద్దచేసింది. సమాజాన్ని సంస్కరించడం కోసం ముగ్ధాకు ఐఏఎస్ లక్ష్యాన్ని నిర్దేశించిందీ ఆమెనే. భర్త చనిపోయాక పిల్లలను తీసుకుని ఆగ్రా వెళ్లిపోయారు కమల.
చదువు :
పాఠశాల విద్యను అక్కడే పూర్తి చేశారు ముగ్ధ. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో హిస్టరీ హానర్స్ చదివారు. కాలేజ్ ఫస్ట్. యూనివర్సిటీలో థర్డ్ ర్యాంకర్. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎమ్మే చేశారు.
ఐఏఎస్ కొట్టానిలా..
సెకండ్ అటెంప్ట్‌లో ఐఏఎస్ సాధించారు. సివిల్స్‌లో ఆమెది ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్. జైపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ముగ్ధానే. రెండేళ్లు సీఎమ్ (రాజస్థాన్) ఆఫీస్‌లోనూ పని చేశారు. జిల్లా కలెక్టర్‌గా 2005లో మొదటి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ‘‘సివిల్ సర్వీస్.. జాబ్ కాదు. నిజంగా సర్వీసే. సామాన్యుల సంక్షేమం కోసం చేసే సేవ. మనం చేసిన పనే తర్వాతి తరాల వాళ్లకు అందే వారసత్వం. మన పనే ప్రజల హృదయాల్లో మనకు సుస్థిరస్థానం కల్పిస్తుంది’’ అని అంటారు ముగ్ధా సిన్హా.
పదమూడు బదిలీలు.. ఇంకా..
ఆర్నెల్లలోనే అరవై ఏళ్ల పాలనా సంస్కరణలు తెచ్చారు ముగ్ధ. అందుకే ఆమె ట్రాన్స్‌ఫరై పోతుంటే ఆ జిల్లాలోని ప్రజలు సరే.. లాయర్లు, టీచర్లు, ఇంజనీర్లు అందరూ ముగ్ధా బదిలీని ఆపమంటూ ధర్నా నిర్వహించారు. బంద్‌కు పిలుపిచ్చారు. ఆమెలోని సిన్సియారిటీ, సమర్థత తన పదిహేనేళ్ల సర్వీస్‌లో పదమూడు ట్రాన్స్‌ఫర్స్‌లను గిఫ్ట్‌గా ఇచ్చింది. అయినా అలుపెరగక ప్రయాణిస్తూనే ఉన్నారామె తను నమ్మిన దారిలో...
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..