IPS Success Story: ఐపీఎస్ కొట్టానిలా .. ఒక సంచలనం కేసులో స‌క్సెస్ అయ్యానిలా..

మెడిసిన్‌ చదివి డాక్టర్‌ అయింది. పోలీసుగా మారి ప్రాక్టీస్‌ చేస్తోంది. స్టెతస్కోపు మీద ఒట్టేసి... ఖాకీకి సలాం చేసి... చెప్తున్నాం డాక్టర్‌ చేతన సమాజానికి వైద్యం చేస్తోంది.
చేతన, ఐపీఎస్‌

కోఠీ లోని మెటర్నిటీ హాస్పిటల్‌ నుంచి సుభావత్‌ విజయకు పుట్టిన ఆరు రోజుల పాపాయి అపహరణకు గురైంది. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ గా ప‌నిచేస్తున్న‌ప్పుడు చేతన అత్యంత త‌క్కువ స‌మ‌యంలోనే పాపాయిని తెచ్చి తల్లి ఒడికి చేర్చింది!

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

వైద్యం చేయాలంటే..ఇది కాదని..
‘‘మెడిసిన్‌ చేసేటప్పుడు దేహం, ఆరోగ్యం, అనారోగ్యాలను చదివాను. డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసిన ఏడాది కాలంలోనే సమాజాన్ని చదవడం సాధ్యమైంది. నా దగ్గరకు వచ్చిన పేషెంట్‌లలో ఎనీమియా, వరుస గర్భస్రావాలతో బాధపడే వాళ్లే ఎక్కువగా కనిపించారు. వాళ్లందరూ దాదాపుగా వరకట్న బాధితులే. కొందరు నేరుగా భర్త, అత్తమామల నుంచి వేధింపులకు గురవుతుంటే మరికొందరు పరోక్షంగా సూటిపోటి మాటలతో మౌనంగా వేదనను భరిస్తున్న వాళ్లే. డాక్టర్‌గా వాళ్ల దేహానికి వైద్యం చేసేదాన్ని, అంతకంటే ఎక్కువగా మరేదయినా చేయాలనిపించేది. కానీ, వారికి మానసిక ధైర్యాన్నివ్వడం వరకే సాధ్యమయ్యేది. ఆ మహిళల అనారోగ్యం వెనుక ఉన్నది అనారోగ్యకరమైన సమాజం. నిజానికి వైద్యం చేయాల్సింది సమాజానికి. మూల కారణానికి వైద్యం చేయాలంటే ఓ డాక్టర్‌కి సాధ్యం కాదు. సమాజంలో కరడు గట్టి ఉన్న ఈ రోగానికి వైద్యం చేయాలంటే చట్టంతోనే సాధ్యం అనిపించింది. అందుకే పోలీస్‌ అవ్వాలనుకున్నాను.

తొలి ప్రయత్నంలో.. ​​​​​​​

సివిల్స్‌ ప్రిపరేషన్‌లో తొలి ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌ వచ్చింది. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ కమీషనర్‌గా ఓ ఏడాది చేశాను. రెవెన్యూ సర్వీసెస్‌లో పని చేయడం బాగానే ఉంటుంది. కానీ నా ప్రధాన ఉద్దేశం మహిళలు, వాళ్ల మీద దాడులు. వాటిని అరికట్టాలంటే ఐపీఎస్‌ అయి తీరాల్సిందే. రెండవ ప్రయత్నంలో అంటే.. 2013లో ఐపీఎస్‌ వచ్చింది. కానీ అప్పటికి మెటర్నిటీ లీవ్‌లో ఉన్నాను. రెండేళ్ల తర్వాత సర్వీస్‌లో చేరాను. ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత తొలి పోస్టింగ్‌ ఇదే.

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

 

తొలి కేసులోనే.. స‌క్సెస్ అయ్యానిలా..
ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత హాస్పిటల్‌ నుంచి బిడ్డను అపహరించారని కంప్లయింట్‌ వచ్చింది. వెంటనే హాస్పిటల్‌కెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్‌ చూశాం. నీలం రంగు చీర కట్టుకున్న ఒక మహిళ.. బిడ్డతో హాస్పిటల్‌ ఆవరణ దాటడం కనిపించింది. ‘నీలం రంగు చీరతో ఉన్న మహిళ, ఆరు రోజుల పాప...’ ఆ ఆధారంతో మా సెర్చ్‌ టీమ్‌లు పరుగులు తీశాయి.కొన్ని టీమ్‌లు నగరంలోని పబ్లిక్‌ ప్లేస్‌లు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్‌లలో సీసీకెమెరా ఫుటేజ్‌ చూస్తూ వివరాలు నోట్‌ చేశాయి.

ఆ మహిళ ఎంజిబిఎస్‌ నుంచి బీదర్‌ వెళ్లే బస్‌ ఎక్కిందనే సమాచారం రావడంతో బీదర్‌ పోలీస్‌కు సమాచారమిచ్చాం. వెంటనే మా టీమ్‌తో బీదర్‌కెళ్లాను. ఈ టాస్క్‌లో మొత్తం ఎనిమిది టీమ్‌లు పనిచేశాయి. మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకు పాపాయిని బీదర్‌లోని హాస్పిటల్‌లో గుర్తించాం. ఆ తర్వాత ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నాం.

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

కొంచెం ఇబ్బందిగా కూడా..


ఏసీపీగా చార్జ్‌ తీసుకున్న తర్వాత నేను డీల్‌ చేసిన తొలికేసు ఇదే. పాపాయిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చడం గొప్ప అనుభూతి, అయితే ఈ విజయం, ఘనత అంతా నాదేనన్నట్లు మీడియా ప్రశంసిస్తుంటే కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్‌ పాయింట్‌ ఇది నా ఉద్యోగం, నా విధిని నేను నిర్వర్తించాను. ఇక రెండవది... ఇది నా ఒక్కదాని వల్ల వచ్చిన విజయం కాదు, సమష్టి కృషి. మా పోలీసులతో పాటు టెక్నాలజీకి కూడా సమభాగస్వామ్యం ఉంది.

Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..

‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు’ అని శ్రీశ్రీ సంధించిన ప్రశ్న కూడా గుర్తుకు వస్తోంది. తాజ్‌మహల్‌ సౌందర్యాన్ని ప్రశంసించడం కాదు, దాని నిర్మాణంలో చెమటోడ్చిన శ్రామికులకు వందనం చేయాలని నమ్ముతాను. ఈ పాపాయి టాస్క్‌ కూడా అంతే. మా టీమ్‌ ఎంత చురుగ్గా పని చేసిందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ పాపాయి అపహరణ కేసు. ఈ కేస్‌ నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషాన్నిచ్చిన మాట నిజమే. కానీ, చేతన ఘనత అన్నట్లు కాకూడదు. పాపాయిని రక్షించి తెచ్చాననే కృతజ్ఞతతో ఆ తల్లి బిడ్డకు నా పేరు పెట్టుకుంది. నిజమైన ఆనందం అది. ఆ క్షణంలో నాకు శ్రీశ్రీ ‘మరో ప్రపంచం’ కనిపించింది’’.

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

 

#Tags